Kocherlakota Jagadish
‘ప్రయాణం టైమవుతోంది. బట్టలు సర్దుకోవాలబ్బాయ్!’ తను నన్నిలా ‘అబ్బాయ్’ అని పిలిచిందంటే తన మూడ్ బావున్నట్టే! అదొక లిట్మస్ టెస్ట్. మళ్లీ తనే అంది.. ‘మా ముగ్గురివీ అయిపోయాయి సర్దుకోడం. నువ్వెన్ని జతలు పెట్టుకుంటున్నావు? అంతాచేసి అయిదురోజులేగా ఉండేదీ? ఆ ఎర్రపెట్టి సరిపోతుందిగా?’ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు, సమాధానాలు అయిన తరవాత నా బట్టల అల్మైరా తెరిచి ఓ ఆరేడు చొక్కాలూ, పేంట్లూ తీసి మంచమ్మీద పెట్టుకున్నాను. ఇప్పుడంటే ఒళ్లొచ్చిందిగానీ అయిదారేళ్లక్రితం మరీ అరవింద్ స్వామిలా కాకపోయినా రమేష్ అరవింద్ లా వుండేవాణ్ణి. అప్పుడు కొన్న బట్టలే ఓ ఇరవై జతలదాకా వుంటాయి. ఆ చొక్కాలు ఇప్పుడేసుకుంటే ‘పిటపిటలాడే పచ్చివయసూ పైపైకొచ్చిందీ…’ పాట గుర్తొస్తుంది ఎవరికైనా! పేంట్లన్నీ సర్కస్ లో మోటార్ సైకిల్ ఫీట్లు చేసేవాళ్ల పేంటుల్లా టైట్ గా వుంటాయి.

అలాగని చూస్తూ చూస్తూ అంతంత డబ్బోసి కొన్న బట్టల్ని ఎవరికైనా ఎలా ఇచ్చేస్తాం? అవన్నీ కొత్తవాటితో కలిసి బీరువా నిండా ఇండియా పాకిస్తాన్ మ్యాచప్పుడు ఈడెన్ గార్డెన్స్‌లో జనాల్లా కిక్కిరిసి వుంటాయి.
మానవుడు ఆశాజీవి. కాదంటారా? ఎప్పటికైనా మళ్లీ సన్నబడి ఆ బట్టలన్నీ వేసుకోకపోతానా అని ఏమూలో స్పెషల్ స్టేటస్ లాంటి చిన్న ఆశ! కానీ అమితాబ్ బచ్చన్ పొట్టిగా అయినా అవుతాడేమోగానీ నేను సన్నబడనుట! ఇది మా ఇంటావిడిచ్చిన శాపం!
‘అయినా చంద్రమోహన్లా ఇలా బానేవున్నావులెద్దూ!’ అనికూడా అనేస్తుంది ఒక్కోసారి మరీ ముద్దొస్తే!
బీరువాలోకి తొంగిచూసి ‘బాబోయ్ ఎన్ని బట్టలో! మీరు వేసుకోనివి పక్కనబడేస్తే ఆ వాచ్ మన్ కైనా ఇచ్చేస్తాను. ఎందుకలా బీరువాల నిండా?’ అంది!
జలుబొచ్చినపుడు రోజూ మూడుపూటలా వేసుకునే యాంటీబయాటిక్ మాత్రల్లా రోజుకి మూడుసార్లు వేసుకునే గొడవే ఇది! ముందుగానే అనుకుంటాం ‘భోజనానికి ముందేసుకుందామా తరవాతా?’ అని!
సరే, తనని సమాధానపరచడం కోసం ‘పొట్టివానికి పుట్టెడంగీలని ఊరికే అనలా!’ అనన్నానో లేదో ‘ఈమాట మన పెళ్లయినప్పటినుండీ వింటున్నాగానీ త్వరగా సర్దుకో!’ అనేసి గదిలోంచి నిష్క్రమించింది.
బ్లాక్ జీన్స్ వుండాలి. ఉతకడానికేసిందా? అదయితే చాలా సౌకర్యంగా వుంటుంది.
ఈ కిల్లర్ జీన్స్ మీదకి బ్లూషర్టేదబ్బా? ఆఁ, వుంది. అయ్యో! పై బటన్ ఊడిపోయిందే! సరే, ఈ గ్రీన్ షర్టేసేద్దాం.
అంతేగానీ పాపం తను ఆఫీసుకెళ్లే హడావిడిలో వున్నప్పుడు ఈ బొత్తాలవీ కుట్టమనడం, పెసరట్లలోకి ఉప్మా కూడా చెయ్యమనడం… ఇలాంటివన్నీ కోరి ‘గొంతెమ్మ’గా పేరుపొందడం నాకిష్టంలేదు. ఆమాత్రం సహాయం చేస్తాను భర్తగా మారినందుకు.
రోజూ హాస్పిటలుకి వేసుకెళ్లే డ్రెస్సు కూడా అంతే! చిన్నచిన్న తేడాలుంటే పట్టించుకోను. ఎలాగూ అక్కడికెళ్లిన అయిదునిమిషాల్లో విప్పిపడేసేదే కదా? అపార్ధం చేసుకోకండి. మత్తు డాక్టర్ని కదూ, ఓటీ కాంప్లెక్స్ లోకి అడుగెట్టగానే ఆపరేషన్ డ్రెస్సేసుకుంటానని అంతరార్ధం.
బట్టలనీ ముందేసుకుని మ్యాచింగ్ అయ్యేలా జతలు జతలుగా పెడుతున్నాను. పూర్వం పెద్దపెద్ద సూట్ కేసులు నిండిపోయేలా బట్టలన్నీ కుక్కేసి, చివరాఖర్న పట్టకపోతే దాని పీకమీద కూర్చుని మరీ తాళం వేసేవాళ్లం. గుర్తుందిగా? ఇప్పుడలాంటి బాధల్లేవు. బట్టలకన్నా తేలికైన పెట్టెలొచ్చేసాయి. మళ్లీ వాటికి చక్రాలు, కర్రలూ కూడానూ! పిల్లలెంతో ఇష్టంగా తోస్తాఁవంటారు ఈ తోపుడు పెట్లని!
అన్నీ సర్దేశాకా నా అసలైన సరంజామా ముందుపెట్టుకున్నాను. అదేనండీ మీరెరిగిందే! మొబైల్ చార్జర్లు, వైఫై డాంగిల్సు, బ్లూటూత్ స్పీకర్లు, ఓటీజీ పెన్ డ్రైవులు, రకరకాల కేబుళ్లు…! నేనైనా వెళ్లడం మానేస్తానేమోగానీ ఇవిమాత్రం తప్పకుండా బయల్దేరి తీరాలి!
ఇవన్నీ ఎంతో శ్రద్ధాసక్తులతో సర్దుతానా, మళ్లీ బ్రష్షూ పేస్టు లాంటివి మర్చిపోతాను. అయినా ఏవూరెళ్లినా మనం దిగే హొటళ్లన్నింట్లోనూ మనుగుడుపుల్లో పెళ్లివారికిచ్చినట్టు సబ్బులు, తువ్వాళ్లు, షాంపూలూ ఇస్తూనే వుంటారుగా? పాపం, ఒక్క కుంకుడుకాయలు తప్ప సమస్తం ఇస్తారు.
అంచేత వాటిగురించయితే బెంగలేదు. కానీ ఈ చార్జర్లవీ ఎవడిస్తాడు? ఒకవేళ ఇచ్చినా ఈ ఆపిల్ ఫోనులాంటి ఒంట్రెత్తు చార్జర్లు ఎవరి దగ్గరా వుండవాయె! అందువల్ల మన జాగ్రత్తలో మనఁవుండాలి.
తను కాసేపటి తరవాత గదిలోకొచ్చేటప్పటికి రిపేర్లో వున్న రోబోలా చుట్టూ వైర్లతోనూ, రకరకాల పరికరాలతోనూ కనబడ్డాను.
‘ఏంటీ, ఇవన్నీ మోసుకొస్తావా? ఎక్కడికెళ్లినా ఇంత వ్యవహారమూ ఉండాల్సిందేనా?’ అంది కొంత విచిత్రాన్నీ విసుగునీ అల్లం వెల్లుల్లి పేస్టులా తయారుచేసి చూస్తూ!
‘తప్పదు బన్నీ! మనం ఊరంతా తిరిగి రకరకాల ఫొటోలు తీసేసుకుంటాం. రాత్రి గదికి చేరగానే ఆ ఫొటోలవీ హొటల్ టీవీలో పెట్టుకుని చూడాలనిపించడం సహజం కదా? అందుకే ఇవన్నీ! ఎస్సెల్లార్ కెమెరాలోంచి మెమరీకార్డు తీసి ఈ కార్డ్ రీడర్లో పెట్టి టీవీకి తగిలిస్తే ఎంచక్కా ఏరోజు ఫొటోలు ఆరోజే చూసెయ్యొచ్చు!’ అంటూ నాప్టాల్ అడ్వర్టైజ్మెంట్లో మోడల్లా విపులంగా చెప్పడం మొదలెట్టాను.
‘ఆ గోలేదో నువ్వూ, ఆ పెద్దాడూ పడండి. వాడికీ నీ పోలికలే వచ్చాయి! నేనాఫీసుకెళ్లి పెందరాళే వచ్చేస్తాను. వచ్చేటప్పటికి ఇంకా ఇలాగే బాంబ్ బ్లాస్టయినట్టు చెల్లాచెదురుగా కనబడితే ఊరుకోను. త్వరగా తెమలండి. ఆ వెధవలిద్దర్నీ కూడా లేపి, నీకు హెల్ప్ చెయ్యమను!’ అంటూ శ్రీచైతన్య ర్యాంకులు చదివే అమ్మాయిలా గడగడా మాటాడేసి వెళిపోయింది.
మొత్తానికి ఆడపిల్లని కాపరానికి పంపేటప్పుడు సర్దే సారె సామానులా అన్నీ సరిగ్గా వున్నాయో లేదో అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని తయారయిన పెట్లని పక్కనబడేశాను.
‘నాన్నా! రేజర్లూ, బ్లేళ్లూ, సిజర్సూ హేండ్ లగేజిలో లేదుగా? డియోలు కూడా!’ అంటూ మా పెద్దాడొచ్చాడు. వాడు బెంగుళూరు, వైజాగ్ మధ్య గంధర్వరాజు గయుడిలా ఎక్కువగా విమానాల్లో తిరుగుతూ వుంటాళ్లెండి! అంచేత వాడికివన్నీ బాగా జ్ఞాపకం.
మావాడన్నది కరెక్టే! నేను హడావిడిలో రేజర్లూ, కత్తెరా నా చేతిసంచిలో పెట్టేశాను. పైపెచ్చు స్ప్రే బాటిల్ కూడా అందులోనే వుంది. అదిగనక సెక్యూరిటీ వాళ్లు తీసేసుకుంటే రెండొందల ముప్పై రూపాయలూ బూడిదలో పోసిన డియో అవుతుంది. డియో అంటే పన్నీరేగా?
మళ్లీ అన్నీ తెరిచి, ఈసారి వాడి సాయంతో మరింత జాగ్రత్తగా సర్దాను. హమ్మయ్య! ఇక తనొచ్చేటప్పటికి నేను రెడీగా వున్నట్టే! అదో తుత్తి!
ఎప్పట్లాగే మేఁవిద్దరం ఇంత కుస్తీలూ పడుతున్నా మా రెండోవాడు మాత్రం చంద్రబాబు ఎన్ని మాటలన్నా పట్టించుకోని మోడీలా తను అనుకున్నదే చేస్తూ కూర్చున్నాడు. అదేనండీ, మొబైల్ చూసుకోవడం! వాడి ఏకాగ్రతంటే నాకు చాలాయిష్టం. పక్కనే దావూద్ ఇబ్రహీం వచ్చి కూర్చున్నా పట్టించుకోనంత శ్రద్ధగా చేస్తాడు ఏ పనయినా!
మొత్తానికి తను ఆఫీసునుండి వచ్చేటప్పటికి ముగ్గురు కొడుకులు సినిమాలో కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబుల్లా తయారైపోయి కూర్చున్నాం ముగ్గురమూ!
ముచ్చటగా బంగార్తండ్రుల్లా తయారైపోయిన మమ్మల్ని చూసిన ఆనందం కళ్లలో కనబడకుండా జాగ్రత్తపడుతూ గబగబా లగేజంతా బయటికి చేరేసేసింది. మా ముగ్గుర్నీ సామానంతా కారెక్కించమని చెప్పి తను పూజగదిలోకెళ్లింది. ప్రయాణం సుఖంగా, సురక్షితంగా, శుభప్రదంగా సాగాలని! మేఁవెళ్లేది ఆర్టీసీ బస్సులో కాకపోయినా అలా దణ్ణం పెట్టుకోవడంలో తప్పులేదుగా?
డిక్కీలో పట్టినంత పెట్టేసి మిగిలిన బ్యాగుల్ని భూకైలాస్ సినిమాలో వినాయకుడు శివలింగాన్ని పట్టుక్కూచున్నట్టు ఒళ్లో పెట్టుకుని డెబ్భై స్పీడులో విశాఖపట్నం చేరాం!
అన్నయ్య ఇంట్లో కార్ పార్క్ చేసేసి, నాలుగు మెతుకులు తిని, ఫ్లైట్ టైమవుతుండగా ఓలా బుక్ చెయ్యాలని చూశాం. సహజంగా వైజాగ్ ఓలా వాళ్లు నాలుగుసార్లు డ్రైవర్లే కాన్సిల్ చేసేస్తారు. అయిదోసారి ఎవరో అమాయకుడు ఉంచుకున్నాడు. అడ్రెస్ అందరం తలోరకంగా చెప్పి అతణ్ణి కావలసినంత తికమకపెట్టేసి కాసేపు దోబూచులాడుకుని ఎట్టకేలకి ఓ ఓలా ఎక్కాం!
ఎయిర్‌పోర్ట్ ముఖద్వారంలో సెక్యూరిటీ వాళ్లు ప్రయాణికులందరినీ ఆధార్ కార్డులు చూసి లోపలికి పంపించేస్తున్నారు. అలా ఎలా పంపించేస్తారో కదా అస్సలు పోలికల్లేకపోయినా?
నేనడిగేద్దాఁవనుకున్నాను…‘ఇది నేనేనని గ్యారంటీ ఏఁవిటోయ్?’ అని! కానీ అంత హిందీ రాని కారణంగా ఆగిపోయాను!
బోర్డింగ్ పాసులూ, స్కానింగులూ పూర్తయ్యాక మా పెట్లన్నీ కౌంటర్లో కూర్చున్న పిల్లకి సారె సామానిచ్చేసినట్టు ఇచ్చేసి స్వేచ్ఛగా చేతులూపుకుంటూ బయటపడి, సెక్యూరిటీ చెకింగ్ లైన్లో నిలబడ్డాం.
ఈ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వాళ్లు మనల్ని అంగుళం అంగుళం తడిమి సిగ్గుతో చితికిపోయేలా చేస్తారు. మన బ్యాగుల్ని కూడా అంత మమకారంతోనూ విప్పి చూస్తారు.
ఒకతను నా జేబులన్నీ తడిమి తడిమి మొత్తానికి ఓ పెన్ డ్రైవొకటి సంపాయించాడు. ‘యే క్యా హై?’ అన్నాడు.
అది రొటీన్ పెన్ డ్రైవ్ కాదు. వైఫైతో పనిచేస్తుంది. 64జీబీ సాన్ డిస్క్ మెమరీ పెన్ డ్రైవ్. అంత విజ్ఞానం అతనికి బోధిద్దామని ‘యే సాధారణ్ పెన్ డ్రాయివ్ నహీహైఁ! ఏ వైఫై సే కామ్ కర్తీ హైఁ….’ అన్నానో లేదో నా బోర్డింగ్ పాస్ మీద దఢేలని స్టాంపేసేసి ’ఆప్ అందర్ జాయియే!’ అంటూ గెంటేశాడు!
లేకపోతే… నాతో పెట్టుకుంటాడా??
గేట్ నెంబర్ వన్ ముందున్న సోఫాల్లోను, కుర్చీల్లోను భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, అన్నదమ్ములు ఒకరికొకరు ఏమవుతారో అన్న విషయాన్ని మర్చిపోయి లాప్ టాపులూ, మొబైళ్లూ చూసుకుంటూ కూర్చున్నారు.
కొంతమంది ఇథియోపియా నుంచి వచ్చినవాళ్లలా వచ్చినప్పటినుంచీ పిజ్జాలు తింటూనేవున్నారు. మా చిన్నతనాల్లో రైలు మారడానికి తుని స్టేషన్లో కూర్చున్నప్పుడు దిబ్బరొట్టి తినడం గుర్తొచ్చింది.
నో అనౌన్స్మెంట్ ఎయిర్‌పోర్ట్ అన్నారుగానీ గొంతుచించుకుని ‘బోర్డింగ్!’ అని అందర్నీ పిలిస్తే తప్ప ఒక్కరూ కదల్లా! మళ్లీ క్యూలో నిలబడిన తరవాత తొందరపడిపోతున్నారు.
‘మీరెక్కకుండా విమానం కదలదర్రా!’ అని అనౌన్స్ చేద్దామనిపించింది.
సరిగ్గా పదినిమిషాల్లో బయల్దేరుతుందనగా ఫ్లైట్లోకొచ్చి పడ్డాం. పెళ్లలు పెళ్లలుగా వేసుకున్న మేకప్పుతోను, అప్పుడే టొమాటో పండు తిన్నట్టున్న పెదాల్తోను బోల్డుమంది అమ్మాయిలు స్వాగతం పలుకుతోంటే మా నెంబర్లు వెతుక్కుని కూర్చున్నాం.
ఈ ఉద్యోగాలకి ఎప్పుడూ అమ్మాయిల్నే ఎందుకు ఎన్నుకుంటారో? పైపెచ్చు ’స్కై నీడ్స్ స్టార్స్! జాయిన్ ఇండిగో యాజ్ ఎయిర్‌హోస్టెస్!’ అంటూ ప్రకటనలు కూడానూ! అది ఏ రకమైన వ్యాపార సూత్రమో, మహిళల వస్త్రధారణ, అలంకారం తప్పనిసరిగా ఆకర్షణీయంగా ఉండాలంటూ చేసేసిన ఆ ఉద్యోగ నియమాలేఁవిటో పంతంకొద్దీ శబరిమలకెళ్లిన అమ్మణ్ణుల్ని అడగాలి!
కాసేపటికి ఓ చైనా కళ్ల చిన్నదొచ్చి ఏకపాత్రాభినయం చెయ్యడం మొదలెట్టింది. ఒకవేళ ఈ విమానం నీళ్లలో పడిపోతే ఏంచెయ్యాలి, నిప్పుల్లో పడిపోతే ఎలా బయటపడాలంటూ వెనకనించి హిందీలోనూ, ఇంగ్లీషులోను చెబుతున్నారు. పాపం, వాళ్ల ఉద్యోగధర్మం వాళ్లు నిర్వర్తిస్తున్నారు. మన ధర్మం ప్రకారం చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కళ్లు మూసుకు పడుకున్నాను.
‘గాల్లో తేలినట్టుందే…!’ టిప్పు గొంతులో నిజంగానే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతోంది. భాస్కరభట్ల, డిఎస్పీ కలిసి పంచిన ఎనర్జిటిక్ పాటతో వెంటనే నిద్రలోకి జారుకున్నాను
…………జగదీశ్ కొచ్చెర్లకోట
venkateswaru rejeti says
good travellogue yenugula veeraswamy
subha says
You have that flair for comedy and satire, sir. Reminds me of the articles by Adivishnu and Gollapudi. Keep writing. I promise you we keep reading.
srini kesiraju says
jagadish garu is a born writer …hilarious and lucid .keep posting his writings sir . very natural writer with a tinge of humor … appreciate you MS garu for keeping his posts in your platform .. good of you …
Rajendar Gangisetti says
very close to Reality…
Satya vallala says
As kaalam lo puranam sitha gaaru illalimuchatlu chadivina anubhuthini gurthuchesaaru. Paravasinchaa…