.
Pratap Reddy Maneti ….. ఇకపై కారుణ్య నియామకాలు అంత ఈజీ కాదు! ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి కుటుంబంలో ఒకరికి ఇచ్చే కారుణ్య నియామకం ఇకపై అంత సులభం కాబోదు. ఈ నియామకాలకు సంబంధించి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఒక సంచలన తీర్పును వెలువరించింది.
“గోగగట్టు సుజన వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (W.P. No. 6472/2025)” కేసులో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు, ఆ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తిగా మార్చేయనుంది. కారుణ్య నియామకాల ఉద్దేశం మరణించిన ఉద్యోగి కుటుంబానికి తక్షణ ఆర్థిక ఆసరా ఇవ్వడమే తప్ప, దాన్నొక హక్కుగా లేదా ప్రత్యామ్నాయ ఉద్యోగ కోటాగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది.
Ads
తీర్పులోని ప్రధానాంశాలు ఇవే!
1.కారుణ్య నియామకాలపై రానున్న మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను (Guidelines) రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఇకపై చేపట్టబోయే అన్ని నియామకాలు ఆ కొత్త రూల్స్ ప్రకారమే జరగాలి. ఈ కేసు వేసిన పిటిషనర్ కి సైతం కొత్త నిబంధనలే వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.
2.మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆర్థిక సామర్థ్యం (Financial Capacity) ఎంత అనేదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలి. కుటుంబానికి ఇతర ఆదాయ వనరులు, ఆస్తులు ఉండి, ఆర్థికంగా నిలకడగా ఉంటే కారుణ్య ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
3.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కానప్పుడు, దానికి బదులుగా ఒకేసారి ఎక్స్-గ్రేషియా కాంపెన్సేషన్ చెల్లించే విధానాన్ని తీసుకురావాలని కోర్టు సూచించింది.
పెండింగ్ దరఖాస్తుదారులపై పడనున్న ప్రభావం..!
ఈ తీర్పుతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వేలాది మంది అభ్యర్థులకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే దరఖాస్తు చేసి పెండింగ్‌లో ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త రూల్స్ మాత్రమే వర్తిస్తాయి. కేవలం ఉద్యోగి చనిపోయారనే కారణంతో కాకుండా, ఆ కుటుంబం నిజంగానే రోడ్డున పడే స్థితిలో ఉందా? లేదా? అనే దాన్ని లెక్కిస్తారు.
ఒకవేళ కుటుంబంలో వేరే ప్రభుత్వ ఉద్యోగులున్నా, లేదా తగినంత పెన్షన్, ఆస్తులు ఉన్నా ఇకపై ఉద్యోగం దక్కడం ఇకపై కష్టం కావచ్చు. దానికి బదులు ప్రభుత్వం నిర్దేశించే ఎక్స్-గ్రేషియాతోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు.
మొత్తానికి, ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఆ రాష్ట్రంలో కారుణ్య నియామకాల ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ప్రభుత్వం రాబోయే 3 నెలల్లో ఎలాంటి గైడ్‌లైన్స్ రూపొందిస్తుందనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణకు వర్తిస్తుందా!?
గౌరవ AP హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణకు వర్తిస్తుందా? అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటికిప్పుడు వర్తించదు. ఈ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకుంటుందని భావించలేం. ఈ తీర్పు బేస్ చేసుకొని ఎవరైనా రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయిస్తే అప్పుడు పరిస్థితిని ఊహించలేం. కాబట్టి, ఇప్పటికే దరఖాస్తులు పెండింగులో ఉన్న వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది.
-మానేటి ప్రతాపరెడ్డి…
Share this Article