.
కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సమాజానికి రోల్ మోడల్స్‌గా నిలవాలి. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సంయమనం, పరిపాలనా దక్షత, వ్యవస్థాగత హుందాతనం ప్రదర్శించడమే వారి శిక్షణ సారాంశం.
కానీ, కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి రూప దివాకర్ మౌడ్గిల్ మధ్య కొన్నేళ్లుగా సాగుతోన్న ‘అహాల పోరాటం’ బ్యూరోక్రసీకే మాయని మచ్చగా, న్యూసెన్స్‌గా మారింది. చిన్నగా మొదలైన వీరి వ్యక్తిగత వైరం, సోషల్ మీడియా వేదికగా రచ్చకెక్కి, క్రిమినల్ పరువు నష్టం దావాల దాకా వెళ్లి, చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానమే మధ్యవర్తిత్వం వహించాల్సిన ‘అసాధారణ’ స్థితికి చేరుకుంది.
Ads
ఈ ఇద్దరు అధికారుల మధ్య వైరం రాత్రికి రాత్రి మొదలైంది కాదు. కర్ణాటక ప్రభుత్వ పరిపాలనా విభాగాల్లో వీరిద్దరూ కీలక బాధ్యతల్లో ఉన్నప్పటి నుంచే అంతర్గత విబేధాలు నడుస్తున్నాయి. రోహిణి సింధూరి మైసూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు, మ్యూజియం నిధుల వివాదం, ప్రజాప్రతినిధులతో ఆమెకు వచ్చిన విభేదాలపై రూప సోషల్ మీడియా వేదికగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం ద్వారా వివాదం మొదలైంది.
ప్రభుత్వ అంతర్గత వేదికలపై లేదా సర్వీస్ రూల్స్ పరిధిలో పరిష్కరించుకోవాల్సిన విషయాలను, ఒకరి పనితీరుపై మరొకరు బహిరంగంగా విమర్శలు గుప్పించుకోవడంతో ఈ రెండు కొప్పుల తగాదా మరీ వీథిపంపు పంచాయితీగా మారింది.
2023 ఫిబ్రవరిలో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. ఐపీఎస్ అధికారిణి రూప తన ఫేస్‌బుక్ ఖాతా వేదికగా రోహిణి సింధూరిని టార్గెట్ చేస్తూ వరుస పోస్ట్‌లు పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోహిణి సింధూరి కొందరు పురుష ఐఏఎస్ అధికారులకు తన ‘వ్యక్తిగత ఫోటోలు’ పంపారంటూ కొన్ని స్క్రీన్ షాట్లను రూప బహిరంగంగా పోస్ట్ చేశారు.
అంతేకాకుండా, మైసూర్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఈత కొలను నిర్మించారని, అవినీతికి పాల్పడ్డారంటూ ఏకంగా 19 రకాల ఆరోపణలతో చార్జ్‌షీట్ తరహాలో పోస్ట్‌లు పెట్టారు. దీనికి కౌంటర్‌గా రోహిణి సింధూరి కూడా ఘాటుగా స్పందించారు. రూప మానసిక సమతుల్యత కోల్పోయారని, వ్యక్తిగత కక్షతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు అగ్ర శ్రేణి అధికారులు మీడియా ముందే వాగ్వాదానికి దిగడంతో కర్ణాటక అధికార యంత్రాంగం నివ్వెరపోయింది.
ప్రభుత్వం ఇద్దరినీ పిలిచి హెచ్చరించినా, పోస్టింగులు లేకుండా పక్కన పెట్టినా వీరి పంతాలు తగ్గలేదు. వివాదం కాస్తా లీగల్ బ్యాటిల్‌గా మారింది. తన వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు కీడ్చి, ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఐఏఎస్ రోహిణి సింధూరి… ఐపీఎస్ రూపపై బెంగళూరు కోర్టులో కోటి రూపాయలకు క్రిమినల్ పరువు నష్టం (Criminal Defamation) దావా వేశారు.
ఈ కేసును కొట్టివేయాలంటూ రూప హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఉన్నతాధికారి అయి ఉండి బహిరంగంగా అలా మాట్లాడటం సమర్థనీయం కాదంటూ కర్ణాటక హైకోర్టు రూప పిటిషన్‌ను కొట్టివేసి, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రూప సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానం దరిచేరింది. ఇద్దరు సమర్థులైన అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ కెరీర్‌ను నాశనం చేసుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఇది పరిపాలనా పరమైన సమస్య కాదు, ఇద్దరి వ్యక్తుల ‘ఇగో’ సమస్య అని గ్రహించిన ధర్మాసనం— విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను మధ్యవర్తిగా (Mediation) నియమించింది. ఇద్దరూ ఆయన ముందు హాజరై కోర్టు వెలుపల రాజీ పడాలని, అప్పటివరకు వీరిపై ఉన్న కేసుల విచారణను నిలిపివేస్తున్నామని అసాధారణ ఆదేశాలు జారీ చేసింది.
‘ఆల్ ఇండియా సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్, 1968’ ప్రకారం ఏ అధికారి కూడా ప్రభుత్వంపై కానీ, తోటి అధికారులపై కానీ బహిరంగంగా గానీ, మీడియా/సోషల్ మీడియా వేదికలపై గానీ విమర్శలు చేయకూడదు. కానీ ఇక్కడ ఇద్దరు అధికారులూ ఈ రూల్స్‌ను ఉల్లంఘించారు. వీరిద్దరి గొడవ వల్ల కర్ణాటక బ్యూరోక్రసీలో గ్రూపులు ఏర్పడటం, ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ అనే విధంగా వాతావరణం దెబ్బతినడం… ఇదో నష్టం.
సివిల్ సర్వీసెస్ అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అదొక అత్యున్నత బాధ్యత. అధికారం, హోదాతో పాటు అంతేస్థాయి నిగ్రహం, లౌక్యం, హుందాతనం అలవడనప్పుడు ఎంతటి ప్రతిభావంతులైనా వ్యవస్థకు భారంగా మారుతారని ఈ ‘రోహిణి- రూప’ వివాదం నిరూపించింది….
Share this Article