Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

824 సీట్లు… ఖేల్ ఖతం..? ఇదేం ప్రాతిపదిక..? కొత్త ప్రశ్నలకు నాంది..!

June 12, 2026 by M S R

.

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) వర్కింగ్ పేపర్ ఒక ఆసక్తికర ప్రతిపాదన చేసింది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలను 824కు పెంచాలని, అందుకోసం కొన్ని నియోజకవర్గాలను రెండుగా, మరికొన్నింటిని మూడుగా విభజించాలని సూచించింది.

చూస్తే బాగానే ఉంది. కానీ అసలు ప్రశ్న… ఎందుకు 824? ఏ ప్రాతిపదికన 824? ఏ ప్రమాణాల ఆధారంగా ఏ సీటును రెండుగా, ఏ సీటును మూడుగా విభజించాలి? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.

Ads

హైదరాబాద్, మల్కాజిగిరి నిజంగానే రెండుగానో, మూడుగానో విడిపోవాల్సిన సీట్లే… ఉదాహరణకు తెలంగాణలోనే చూస్తే… హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల వంటి లోక్‌సభ నియోజకవర్గాలు జనాభా, ఓటర్ల సంఖ్య పరంగా దేశంలోనే అత్యంత పెద్ద సీట్లలో ఉన్నాయి. మల్కాజిగిరి అయితే ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమని చెప్పుకునే పరిస్థితి. ఇలాంటి సీట్లను విభజించాలనే వాదనలో లాజిక్ ఉంది.

ఎందుకంటే ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే జనాభా అసాధారణంగా పెరిగిపోతే ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టం. అలాగే పట్టణ ప్రాంతాల్లో జనాభా విస్ఫోటనం జరిగినప్పుడు కొత్త నియోజకవర్గాలు రావడం సహజమే. అక్కడివరకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ…

అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోని భారీ జనాభా సీట్లను కూడా అదే ప్రమాణాలతో విభజించాల్సి ఉంటుంది. అంటే అసలు చర్చ “ఎక్కడ సీట్లు పెంచాలి?” కాదు…

“ఏ ప్రమాణం ప్రకారం సీట్లు పెంచాలి?” అన్నదే…

సీట్లు పెంచడం ఒక పరిపాలనా నిర్ణయమా? లేక రాజకీయ నిర్ణయమా? ఇప్పటి వరకు డీలిమిటేషన్ చర్చలో ఎక్కువగా జనాభా గురించే మాట్లాడుతున్నారు. కానీ ఒక ప్రజాస్వామ్యంలో నియోజకవర్గాల రూపకల్పనకు జనాభా ఒక్కటే ప్రమాణం కాదు.

భౌగోళిక విస్తీర్ణం
పట్టణీకరణ
పరిపాలనా సౌలభ్యం
సాంస్కృతిక గుర్తింపు
భాషా ప్రత్యేకత
గిరిజన, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం

ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే.

అప్పుడు ప్రశ్న వస్తుంది…

824 అనే సంఖ్య ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వచ్చిందా? లేక కొన్ని పెద్ద నియోజకవర్గాలను రెండుగా, మూడుగా చీలిస్తే వచ్చిన మొత్తం సంఖ్యే 824 నా? అని.

దక్షిణాది అసలు అడుగుతున్నది ఇదే … తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు “మాకు సీట్లు తగ్గిపోతాయి” అని మాత్రమే భయపడటం లేదు. వాటి ప్రశ్న మరింత మౌలికమైనది.

“జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు, విద్యా ప్రమాణాలు పెంచిన రాష్ట్రాలకు, దేశ జీడీపీలో పెద్ద వాటా అందిస్తున్న రాష్ట్రాలకు రాజకీయ వ్యవస్థలో ఎలాంటి గుర్తింపు ఉంటుంది?” అనేదే.

ఈ ప్రశ్నకు 824 సీట్లు సమాధానం కాదు. 824 అయినా, 900 అయినా, 1000 అయినా… ప్రమాణం జనాభా ఒక్కటే అయితే సమస్య అలాగే ఉంటుంది. అందుకే రేవంత్ చెప్పిన హైబ్రీడ్ మోడల్ ప్రాధాన్యం. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్‌ను చాలామంది రాజకీయ వ్యాఖ్యగా మాత్రమే చూశారు. కానీ అందులో ఒక కీలకమైన ప్రజాస్వామ్య ప్రశ్న ఉంది.

ప్రాతినిధ్యం నిర్ణయించేటప్పుడు:

జనాభా
మానవాభివృద్ధి సూచీలు
విద్యా స్థాయి
ఆర్థిక సహకారం
జనాభా నియంత్రణలో విజయం వంటి అంశాలకు కూడా కొంత వెయిటేజ్ ఇవ్వలేమా? అన్న ప్రశ్న. హైదరాబాద్ స్థానంలో ఉర్దూ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి విభజించాలా..? ఇది శాస్త్రీయ ప్రాతిపదికేనా..?

కనీసం జాతీయ స్థాయిలో ఈ డిలిమిటేషన్ తీరుపై చర్చ జరగాలని రేవంత్ కోరుతున్నాడు. అసలు చర్చ 824 గురించా? లేక న్యాయమైన ప్రమాణాల గురించా?

నిజానికి దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను తొలగించాలంటే… “మీ సీట్లు కూడా పెరుగుతాయి కదా” అని చెప్పడం సరిపోదు. ఎందుకంటే వారి ప్రశ్న సంఖ్యల గురించి కాదు. సూత్రాల గురించి. ప్రమాణాల గురించి. ఫెడరల్ న్యాయం గురించి.

హైదరాబాద్, మల్కాజిగిరి వంటి భారీ నియోజకవర్గాలు విభజనకు అర్హమే కావచ్చు. కానీ అవి ఎందుకు విభజించబడుతున్నాయి? ఏ ప్రమాణం వల్ల విభజించబడుతున్నాయి? అదే ప్రమాణం దేశమంతా సమానంగా అమలవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం లేకపోతే… 824 అనే సంఖ్య కూడా మరో రాజకీయ సంఖ్యగానే మిగిలిపోతుంది.

డీలిమిటేషన్ విజయవంతం కావాలంటే సీట్ల పెంపు కంటే ముందు… సీట్ల పెంపుకి ఉండాల్సిన న్యాయమైన, పారదర్శకమైన ప్రాతిపదికపై జాతీయ ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. అక్కడే ఈ మొత్తం చర్చ ఇంకా పూర్తి కాలేదు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Sing Geetham … ప్రయోగం, వైవిధ్యంపై టేస్టున్న ప్రేక్షకులకు మాత్రమే..!
  • ఇరాన్- అమెరికా- ఇజ్రాయిల్… ఈ యుద్ధం ఏం నేర్పింది మనకు..?
  • కమ్‌తాయి… అపరిచితుడు… విరోధా‘బాసుడు… వెరసి వీరలౌక్యుడు…
  • 824 సీట్లు… ఖేల్ ఖతం..? ఇదేం ప్రాతిపదిక..? కొత్త ప్రశ్నలకు నాంది..!
  • నిశ్శబ్దంగా కాటేసే క్రౌర్యాన్ని ‘అబ్బాయి గారి’పై చూపించిన ఆ కళ్లు…
  • సినారె..! జ్ఞానపీఠమైనా ఈ కవి పాదపీఠమే…! అనితరసాధ్యం..!!
  • కాల్పులు, కర్ఫ్యూలు… ఆగని నిరసనలు! అట్టుడుకుతున్న పీవోకే..!
  • మెహబూబా మెహబూబా… ఈ పాపులర్ పాటపై ఓ పాపులర్ జోక్…
  • వెంటాడే ‘మిన్నేటి సూరీడు’ భారతీరాజా… ఏదో తెలియని మత్తు…
  • తమిళ రాజకీయ నేతలకు కర్ణాటక అమ్మవార్లే ఎందుకు ప్రత్యేకం?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions