.
ఏనాటి నుంచో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ అంటున్నారు తప్ప తను రావడం లేదు, బాలయ్య ఎందుకో మరి సుదీర్ఘంగా వాయిదా వేస్తున్నాడు… కారణాలు తెలియవు… ఈమధ్యే ఏదో ఓ కథకు, ఎవరో ఓ దర్శకుడికి వోకే చెప్పాడని వార్త వచ్చింది… ఐతే…
ఇప్పుడు ట్రెండ్ ఏమిటి..? పౌరాణికాలు లేదా ఆ వైబ్స్ ఉండే డివోషనల్… అందులోనూ హీరోయిజం ఉండాలి, ఎలివేషన్స్ ఉండాలి, గ్రాఫిక్స్ అదరగొట్టాలి… యాక్షన్, పాటలు సరేసరి… ఇప్పుడున్న వెటరన్ తెలుగు హీరోల్లో పౌరాణికం వేయాలంటే బాలయ్యే సూటబుల్.., చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలకు అవి పెద్దగా నప్పవు…
Ads
సో, బాలయ్య ఉండాలి, పౌరాణికం ఉండాలి, కొడుకు లాంచింగ్ ఉండాలి, ఇద్దరికీ యాక్షన్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి… అందులోనూ బాలయ్య కొడుకుగా మోక్షజ్ఞే ఉండాలి… కొడుకును బలంగా లాంచ్ చేయాలంటే బాలయ్య కూడా కథలో ఉండాలి… అఖండ మార్క్ డైలాగులు పడాలి… మరి ఆ కథ ఏదై ఉండాలి…
…… ఓ మిత్రుడితో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు తన సూచించింది ఏమిటంటే… ప్రముఖ నవలా రచయిత భైరప్ప రాసిన పర్వ నవలలోని భీమ- ఘటోత్కచ- హిడింబి ఎపిసోడ్… సరిగ్గా తీయగలిగితే కాంతారాను మించి సూపర్ హిట్ కంపల్సరీ…
అంటే భీముడిగా బాలయ్య, కొడుకు ఘటోత్కచుడిగా మోక్షజ్ఞ… జోడీగా ఏ మమతా బైజూయో లక్కీ లెగ్గు… మరి హిడింబిగా పేరున్న, టెంపర్మెంట్ ఉన్న వెటరన్ నటి కావాలి, అవును, రోజా అయినా బాగుంటుంది లేదా ఉండనే ఉందిగా రమ్యకృష్ణ….
కానీ ఇది రొటీన్ కథ కాదు… తప్పకుండా తెలుగు ప్రేక్షకుడిని కనెక్టయ్యే కొత్త కథ… అదేమిటంటే..? హిడింబిని పెళ్లి చేసుకుని, అక్కడే అడవిలో వదిలేసి భీముడు వెళ్లిపోతాడు కదా… ఆమె ఆ అడవికి రాణి, అడవి వదిలి ఎటూ వెళ్లదు… కానీ కురుక్షేత్ర సమరసన్నాహాలు మొదలయ్యాక ఆమె సైన్యం సాయం కోసం, కొడుకును యుద్ధానికి పంపమని అడగడం కోసం మళ్లీ అడవికి, ఆమె దగ్గరకు వెళ్తాడు భీముడు… అదీ కథ…
ఏడాది క్రితం… ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన కథ యథాతథంగా ఇదుగో…
‘‘భీముడు ఎదురుగా నిలబడగానే పాలకటకంటి అతని రెండు భుజాలను బిగువుగా పట్టుకుంది… అదే శక్తిమంతమైన చేతిపట్టు… అనంతరం ఒళ్లూ, చేతులూ, ముఖాలను తన రెండు చేతులతోనూ తడిమి, నిమిరి, ఉన్నట్టుండి పక్కకు అడుగువేసి వీపు మీద ఏడెనిమిదిసార్లు గుద్దింది…
ముఖం బిరుసెక్కింది… కళ్లు ఎరుపయ్యాయి… నోట్లో ఊరకే భీమ, భీమా అనుకుంటూ రెండు చేతుల్ని పిడికిళ్లు బిగించి గుద్దింది… అతను ఊరకే తలవంచి నిల్చున్నాడు… పిడికిలి సడలించి వీపు మీద, రెట్టల మీద ఫటఫటా పదే పదే కొట్టింది…
ఎర్రటి వడిసెలతో కొట్టినట్టు, అతను కిక్కురుమనలేదు… చివరకు కొట్టడం ఆపి అతని ఎదుట వచ్చి నిలబడింది… తానే రెండు చేతులతో , వాలిన అతని ముఖం ఎత్తిపట్టుకుని పైకెత్తి, తన చూపుల్ని అతని చూపుల్లోకి సంధించింది… ఉన్నట్టుండి ఆమె కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి… భీమ భీమ అని పలవరిస్తూ దుఖం పెరిగిపోయి అతని కుడిభుజం మీద మళ్లీ ఒకటి గట్టిగా అంటించింది…’’
అవును, చాలా ఏళ్ల తరువాత మళ్లీ తనను వెతుక్కుంటూ తన రాజ్యంలోకి, తన పాలనలోని దట్టమైన అడవిలోకి వచ్చిన భీముడి పట్ల హిడింబి స్పందన ఇదే… ఎంత బాగుంది పాత్ర చిత్రణ..? ఒకేసారి ఎన్ని ఉద్వేగాల్ని కనబరుస్తుంది ఆమె… తనదైన ఆటవిక రాణి తాలూకు అతిశయం, కోపం, ప్రేమ…
వేల ఉపకథలు, వేల కళారూపాలు, వేల ప్రదర్శనలు, వందల భాషల్లో చెప్పబడుతూనే ఉన్న మహా గ్రంథం మహా భారతం… రకరకాల ప్రక్షిప్తాలు, ఏది ఒరిజినలో ఎవరికీ తెలియదు… ఏమో, బహుశా అప్పటి కాలమాన స్థితుల్లో ఇలా జరిగి ఉండవచ్చునేమో అనే కల్పనాత్మక, ఊహాత్మక రచనే ఎస్.ఎల్.భైరప్ప రాసిన పర్వ… అపూర్వమైన పుస్తకం…
ఏ పాత్రనూ కించపరచడు… అంతేకాదు, సగటు మనిషికి తలెత్తే అనేక సందేహాలకు జవాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు తను… మాస్టర్ పీస్… హిడింబి స్పందనే చూడండి… ఆమె చర్యలో కోపం ఉంది, ప్రేమ ఉంది, దుఖం ఉంది, కలగలిసిపోయిన పలు ఉద్వేగాలను అలా బహిర్గతం చేసేసింది అక్కడే…
అవి శిక్షించడం కాదు… అదొక అసంకల్పిత ప్రేమపూరిత చర్య… వాళ్లదీ ఒక జాతి… వాళ్లకూ ఓ రాజ్యం, అక్కడ కట్టుబాటు ఉంది, వాళ్లకంటూ నియమావళి ఉంది, ఆమె రాణి… వాళ్ల వ్యక్తీకరణలు వేరు… దాన్నే హిడింబి చర్య మనకు పట్టిస్తుంది… ఇక్కడ భీముడికి తలవంచి ఆమె ఎదుట నిలబడటం తప్ప వేరే గత్యంతరం లేదు…
నోటికొచ్చినట్టు రామాయణం, భారతం, భాగవతం వంటి వేల ఏళ్ల పురాణాలను భ్రష్టుపట్టించడం కాదు… (ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్ దరిద్రుల తరహాలో…) పదిమందీ మెచ్చేలా చెప్పాలి… ఇక్కడ భీముడిదే అవకాశవాదం… తన ప్రేమలో నిజాయితీ లేదు… ఐనా సరే, ఆమె క్షమించింది… మొదటిసారి చూసి, మోహించి పెళ్లి చేసుకున్నప్పుడే తన వాడు అనుకుంది… ఫిక్స్… తనే చెబుతుంది కథలో…
‘‘నీకు మా రాక్షసులంటే ఎందుకంత కక్ష…? అంతా మావాళ్లనే చంపుతున్నావట… అదేదో పెద్ద యుద్ధం జరగబోతోందట కదా… నీకు వ్యతిరేకంగా మావాళ్లందరూ ఒక్కటవుతున్నారు… నీ కొడుకు ఘటోత్కచుడే వాళ్లకు నాయకుడు…
ఓరోజు పిలిచి చెప్పాను, మీ తండ్రి ఆయనే, వేరే ఎవరినీ పెళ్లాడలేదు… రాణిని కదా, ఎక్కువ మంది పిల్లలుండాలి… ఆ పిల్లల కోసం వేరే వేళ్లతో ఉన్నాను, మీ తమ్ముళ్లు పుట్టారు… నా తండ్రి అయితే నన్ను చూడటానికి ఒక్కసారీ ఎందుకు రాలేదని అడిగాడు ఘటోత్కచ… వచ్చినప్పుడు అడుగు అన్నాను… ఏం చెబుతావో చెప్పుకో…’’
భీముడి దగ్గర జవాబు లేదు… నాడు ఆ దట్టమైన అడవిలో రక్షణ కోసం ఆమె కావల్సి వచ్చింది… వదిలేసి వెళ్లిపోయాడు… మళ్లీ ఇప్పుడు ఘటోత్కచుడి సాయం కావాలి కాబట్టి వచ్చాడు, అంతే తప్ప హిడింబి కోసం కాదు, కొడుకు కోసం కాదు, వాళ్ల ప్రేమ కోసం కాదు…
అందుకే తలదించుకున్నాడు… ఆమె భీముడి కోసం కొడుకును రణరంగానికి పంపింది… కులం అభీష్టానికి వ్యతిరేకంగా… భీముడు ఏం చేశాడు..? ఈ ప్రశ్న మనల్ని కొంతసేపు వేధిస్తూనే ఉంటుంది… జస్ట్, ఆ మూడు నాలుగు పేజీల కథనానికే…!!
కొడుకు యుద్దానికి వెళ్తానన్నా వద్దనలేదు… మనమడు బర్బరీకుడు వెళ్తానన్నా వద్దనలేదు… కురు రాజ్యం కావాలని అనుకోలేదు… మరో మనమడు మేఘవర్ణుడికి పట్టం కట్టింది… తన జనం, తన రాజ్యం, అంతే… భీముడు ఆమె జీవితంలోకి వచ్చివెళ్లిన ఓ పాసింగ్ క్లౌడ్… అంతే… ఆమె సంపూర్ణ ప్రేమమయి… త్యాగమయి… భీముడే అతి పెద్ద అవకాశవాది..!!
.
స్టోరీ రీటెల్లింగ్ ఓ క్లిష్టమైన ప్రక్రియ… ప్రత్యేకించి కోట్ల మంది తరాలకొద్దీ చదివే మహాభారతం వంటి గ్రంథాన్ని… అందరూ మెచ్చే రీతిలో చెప్పడం సాహసం… పర్వ 1970 ప్రాంతంలోనే ఓ ప్రయోగం… అంతటి కృష్ణుడిని కూడా ఓ మనిషిగా చిత్రీకరించి, పాఠకుల్ని కన్విన్స్ చేస్తాడు తను భైరప్ప… ఈకాలంలో రకరకాల పైత్యాలతో స్టోరీ రీటెల్లింగ్ అనేక కోణాల్లో సాగుతోంది… కానీ భైరప్పకు సాటి ఎవరూ రారు… అదేకాదు, దాటు, వంశవృక్షం, ఆవరణ, సాక్షి, గృహభంగ, తంతు వంటి అనేకం ఆయన ఖాతాలో…
.
(గత ఏడాదే ఈ పద్మభూషణ్, ప్రయోగాత్మక, ప్రసిద్ధ సాహితీకారుడు భైరప్ప 94 ఏళ్ల వయస్సులో కన్నుమూశాడు… తనకు నివాళి)

ఆయన మరణం తరువాత నివాళిగా విశ్వవాణి కన్నడపత్రిక ఫస్ట్ పేజీ ఇలా ఇచ్చింది… గొప్ప నివాళి…
.
అంతేకాదు, హెడింగ్ ఏం పెట్టిందో తెలుసా..? ‘యాన అంత్య, బిత్తి శాశ్వత’… అని…
.
యాన, బిత్తి తన నవలల పేర్లు… కన్నడంలో యాన అంటే ప్రయాణం, బిత్తి అంటే కట్టడం, గోడ, నిర్మాణం… అంటే తను మరణించినా తన రచనలు, తన సృష్టించిన సాహిత్యం అమరం అని…
.
అంతేకాదు, మైసూరులో ఉండే తనను బెంగుళూరు తీసుకొచ్చి, చికిత్స జరిపిస్తూ… 3 నెలలపాటు ఆయన బాగోగులు కూడా పత్రికే చూసుకుంది… ఈ పత్రిక ఓనర్ కమ్ ఎడిటర్ విశ్వశ్వర్ భట్… ఆయన కూడా ప్రముఖ రైటర్, జర్నలిస్ట్…. నచ్చింది…
Share this Article