సాయిపల్లవి ఓ హిందీ సినిమా చేస్తోంది… బాలీవుడ్‌కు చేరింది ఆమె ప్రస్థానం… నిజానికి ఇది వార్తేనా..? వార్తే..! ఎందుకంటే… విరాటపర్వం తరువాత ఆమె తెలుగు సినిమాలేమీ చేయడం లేదు… గార్గి అనే సినిమా వచ్చింది కానీ అదీ తమిళ డబ్బింగ్ కావచ్చు బహుశా… ఆ తరువాత చాలాకాలం మాయమైపోయింది…
రకరకాల పుకార్లు… ఆమె ఇండస్ట్రీని వదిలేసిందనీ, సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటోందనీ… ఇలా… కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ ఆమధ్య శివకార్తికేయ హీరోగా నటించే ఓ తమిళ సినిమాకు సైన్ చేసినట్టు, ఆ సినిమా ప్రారంభానికి కమల్ హాసన్ కూడా అటెండైనట్టు, సినిమా పేరు మావీరన్ అనీ, అది కమల్ హాసన్ సొంత సినిమా అనీ వార్తలు వచ్చాయి…
ఆ వార్తల్ని తెలుగు మీడియా లైట్ తీసుకుంది… అప్పట్లో ఎప్పుడూ తెలుగు వార్తల్లో కనిపించే సాయిపల్లవి తరువాత తరువాత వార్తల్లో కనిపించడమే మానేసింది… (ఆమె మీడియా మేనేజ్మెంట్ చేయదు… అలాంటోళ్లు మన మీడియాకు పనికిరారు… ‘‘కవరేజీ’’ ఉండదు…) ఆ సినిమాకు సంబంధించిన వార్తలు కూడా పెద్దగా కనిపించలేదు…
Ads
తెలుగు ఇండస్ట్రీ ఆమెను వదిలేసిందో లేక ఆమే తెలుగు ఇండస్ట్రీని వద్దనుకుందో గానీ… ఆమెను టెంప్ట్ చేయగల ఏ ఆఫర్ రాలేదు… ఆమె అల్లాటప్పాగా ఏదిపడితే ఆ పాత్రను ఒప్పుకోదు… ( అప్పట్లో ఓ పెద్ద స్టార్ చెల్లెగా నటించమంటే ఆమె తిరస్కరించింది… బహుశా ఆ ప్రభావం కూడా ఆమె ఆఫర్లపై నెగెటివ్‌గా పడి ఉంటుంది… ఈ బడా స్టార్ల ఇగోలు తెలుసు కాబట్టే అంతటి కీర్తిసురేష్ కూడా చెల్లె పాత్రలకు సై అంటోంది… ఐనా సరే సాయిపల్లవి తన స్టాండ్ మార్చుకోలేదు… తనకు నచ్చని పాత్రల వెంట పరుగులు తీయలేదు… తమిళంలోనే కొన్ని సినిమాలు వచ్చినా ఆమె రిజెక్ట్ చేసింది… )
ఇప్పుడిక ఏకంగా ఆమెకు ఓ హిందీ సినిమాలో మంచి పాత్ర లభించినట్టు వార్తలు… అది లవ్ స్టోరీ… అందులో సాయిపల్లవి ఆమీర్ ఖాన్ కొడుకు జునాయిద్ ఖాన్ సరసన నటించనుంది… దీనికి సునీల్ పాండే దర్శకుడు, రీసెంటుగా షూటింగ్ కూడా స్టార్టయిందట కూడా… అధికారిక ప్రకటనలు ఇంకా రావడం లేదు… ఈ సినిమాయే నిజమైతే ఆమె బాలీవుడ్ ప్రముఖ గ్రూపుల్లోకి చేరినట్టే…
ఇంతకీ ఎవరు ఈ జునాయిద్..? లాస్ ఏంజెల్స్ లోని the American Academy of Dramatic Arts లో శిక్షణ పొందాడు… చాన్నాళ్లుగా థియేటర్ ఆర్టిస్టు… ఒక సినిమా చేసినట్టుంది… ఇది రెండో సినిమా తనకు… ఆమీర్ ఖాన్ మొదటి భార్య పేరు రీనా దత్తా… ఆమెకు ఆమీర్ ఖాన్ ద్వారా ఇద్దరు పిల్లలు… ఒకరు ఈ హీరో… మరొకరు అమ్మాయి, ఇరా ఖాన్… ఆమీర్‌కు రెండో వైఫ్ కిరణ్ రావు ద్వారా ఓ పిల్లాడు… ఆజాద్ రావు ఖాన్… సరే, వీళ్ల కథ ఎలా ఉన్నా… సాయిపల్లవి చాలా ప్లాన్డ్ అడుగులే వేస్తున్నట్టు ప్రస్తుతానికి మనం అనుకోవాల్సిందే…
Share this Article