.
ప్రజెంట్ తెలుగు సినిమాల ట్రెండ్ ఏమిటి..? పంచ్ వన్ లైనర్స్, లాజిక్ లేని కామెడీతో కథ నడిపించేయడం..! మరి కథే సరిగ్గా లేకపోతే, కేవలం ఏవో నాలుగు జోకులతో నడిపించాలనుకుంటే..? కుదరదు… కుదరలేదు… అనుదీప్, విశ్వక్‌సేన్, కాయదు లోహర్ సినిమా ఫంకీ ఇదే బాటలో ఉంది…
అనుదీప్ ఇంకా జాతిరత్నాలు హ్యాంగోవర్ నుంచి బయటపడటం లేదు… ఆ సినిమా రిలీజు సందర్భంలో, ఆ సమయంలో అది క్లిక్కయింది… ప్రతిసారీ కుదరదు… మొన్నటి సంక్రాంతి సినిమాలే తీసుకొండి… మన శివశంకర ప్రసాద్ గారు సినిమాలో అధికంగా అనిల్ రావిపూడి తన స్టయిల్ కామెడీ మీదే ఆధారపడ్డాడు… కానీ ఓ కథ ఉంది… అనగనగా ఒక రాజు సినిమాను పోలిశెట్టి నవీన్ తనదైన స్టయిల్‌లో నిలబెట్టాడు… నారీనారీనడుమ మురారి సినిమాలో కూడా శర్వానంద్ కామెడీతో మెప్పించాడు… ఆ పాత్రలు వాళ్లకు సూటయ్యాయి…
Ads
కానీ ఎందుకో గానీ విశ్వక్‌సేన్ బాగానే నటించినా సరే, అనుదీప్ మార్క్ కామెడీ ఫ్రేమ్‌లో తను సరిగ్గా ఫిట్ కాలేదేమో అనిపించింది… వివరాల్లోకి వెళ్తే… ‘ఫంకీ’ కేవలం కథ మీద ఆధారపడ్డ సినిమా కాదు… ఒక సాదాసీదా పాయింట్ చుట్టూ తిరిగే కథ ఇది… కెరీర్ కష్టాల్లో ఉన్న ఒక సినిమా దర్శకుడు (విశ్వక్ సేన్), తన సినిమాను ఎలా పూర్తి చేశాడు? తన ప్రేయసి చిత్ర (కాయదు లోహర్) మనసును ఎలా గెలుచుకున్నాడు? అనేదే ఈ చిత్ర ప్రాథమిక ఇతివృత్తం…
విశ్వక్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఒక ‘మిక్స్‌డ్ బ్యాగ్’ అని చెప్పాలి… ఓ అమాయకపు పాత్రలో నటించినా, ఎక్కడా అది ప్రత్యేకంగా అనిపించదు… తన నటన వరకూ వోకే… కాయదు స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించింది… తన కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి… కానీ, ఆమె పాత్రను చాలా సాధారణంగా రాసుకోవడం వల్ల నటనకు పెద్దగా స్కోప్ లేదు…

సంపత్ రాజ్ పాత్ర పరిమితంగా ఉంటే, మురళీధర్ గౌడ్ ఒక్క సీన్‌లో మెరిసి నవ్వులు పూయించాడు… అనుదీప్, కల్యాణ్ శంకర్ ట్రాక్ లు సాగదీసినట్లు ఉండి కాస్త చిరాకు తెప్పిస్తాయి…
దర్శకుడు అనుదీప్ తన గత చిత్రం ‘జాతిరత్నాలు’ మ్యాజిక్‌ను విశ్వక్ సేన్ ద్వారా రీక్రియేట్ చేయాలని గట్టిగా ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం క్లిక్ కాలేదు… సినిమా ప్రారంభమైన 30 నిమిషాలు వన్-లైనర్స్, జోకులతో బాగానే సాగుతుంది… కానీ ఆ జోకులు సినిమాను నిలబెట్టలేకపోయాయి సరికదా కామెడీ సహజంగా కాకుండా, కావాలని బలవంతంగా నవ్వించడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది, ఓ దశలో ఇక చిరాకు మొదలవుతుంది…
సీన్ల మధ్య సరైన ఫ్లో లేదు… అమాయకత్వం నుంచి పుట్టాల్సిన హాస్యం, ఇక్కడ ‘స్టేజ్ షో’ లాగా అనిపిస్తుంది… ‘జాతిరత్నాలు’లో ఉన్న ఆ సింపుల్ మేజిక్ ఇక్కడ పూర్తిగా మిస్ అయ్యింది… భీమ్స్ సంగీతంలో ఒక పాట మినహా మిగతావి ఆకట్టుకోవు…
సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమిటంటే..? అక్కడక్కడా పేలిన కొన్ని వన్-లైనర్స్… హీరోయిన్ గ్లామర్… మైనస్ పాయింట్స్ ఏమిటంటే..? ‘జాతిరత్నాలు’ను అనుకరించే బలహీనమైన ప్రయత్నం… హీరో క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేకపోవడం… బలవంతపు కామెడీ, బోర్ కొట్టించే సెకండాఫ్…
ప్రధాన లోపం ఎడిటింగ్… యూట్యూబ్ కామెడీ బిట్లను ఒక్కచోట కలిపి కుట్టేసినట్టుగా… అసలు ఓ ఫ్లో లేకుండా పోయింది… చివరకు వాయిస్ రికార్డింగ్ కూడా సరిగ్గా చూసుకోలేదు టెక్నికల్ టీమ్… దర్శకులు, నిర్మాతలు గెస్టులుగా కనిపించినా నో ఇంపాక్ట్… హీరో హీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ కూడా పండినట్టు అనిపించలేదు… వెరసి అనుదీప్ విశ్వక్‌సేన్‌తో కలిసి పెద్దగా మెప్పించలేదు..!!
Share this Article