.
పాత ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ హిందూ గుడిలో కార్తీకదీపానికి అడ్డుపడ్డాడు… ఓడిపోయాడు… మరో పాత ముఖ్యమంత్రి విజయన్ రుతుమహిళల్ని శబరిమల గుళ్లోకి పంపించాడు… ఓడిపోయాడు… మరి ఈ కొత్త ముఖ్యమంత్రి విజయ్, నువ్వు గుళ్లలో ఈ మార్పులు చేయగలవా..? ఇది ఓ సూటి ప్రశ్న… ఇదెందుకు అంటే..? వివరాల్లోకి, ఒక వార్తలోకి వెళ్లాలి…
దేవుడి ముందు అందరూ సమానమే: వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Ads
“దేవుడి ముందు భక్తులంతా సమానమే. ఆలయాల్లో వీఐపీ సంస్కృతి, ప్రత్యేక దర్శనాల వల్ల సామాన్య భక్తులు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. అసలు దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు ఎందుకు?” అని మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ఎప్పుడు పడితే అప్పుడు ఆలయాల్లోకి వెళ్లవచ్చని, తమ కోసం దేవుడు ఎదురుచూస్తూ ఉంటాడని అనుకోవద్దని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
తమిళనాడులోని హిందూ ధార్మిక, దేవాదాయ శాఖ (HR&CE) పరిధిలోని దేవాలయాల్లో వీఐపీ, ప్రత్యేక రుసుము దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ (VHP) ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి. చొక్కలింగం దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించింది. జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం నిన్న ఈ కేసుపై కీలక విచారణ జరిపింది.
‘ద్రవిడ ధర్మం’ పేరిట దోపిడీయా?
సనాతన ధర్మం సంపద, కులం ఆధారంగా భక్తుల మధ్య ఎలాంటి వివక్ష చూపదని, అందరూ సమానమేనని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దేవాదాయ శాఖ రూ. 300 నుండి రూ. 500 వరకు ప్రత్యేక టికెట్లు పెట్టి, దీనికి ‘ద్రవిడ ధర్మం’ అని కొత్త పేరు ప్రస్తావిస్తూ భక్తులను దోపిడీ చేస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం డబ్బు ఆధారంగా ఒకరు దేవుడిని త్వరగా చూడాలా, వద్దా అని నిర్ణయించడం సరైనది కాదన్నారు.
- దీనికి ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పి.వి. బాలసుబ్రమణియన్ స్పందిస్తూ— ఈ రుసుములు కేవలం రద్దీని నియంత్రించడానికేనని, ప్రత్యేక దర్శనాల వల్ల ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని నిలిపివేస్తే ఇబ్బందులు వస్తాయని కోర్టుకు తెలిపారు.
ఈ వాదనను ధర్మాసనం పూర్తిగా తోసిపుచ్చింది. “ఆదాయం తగ్గిపోతుందనే సాకుతో వివక్షను ఎలా సమర్థిస్తారు? చర్చిల్లో, మసీదుల్లో ఇలాంటి వీఐపీ దర్శనాల సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఎక్కువ డబ్బులు ఇస్తే గర్భగుడిలోకి వెళ్లి దేవుడిని కౌగిలించుకుంటారా ఏంటి? దేశ రాష్ట్రపతి వచ్చినా దేవుడి ముందు సామాన్యుడే” అని న్యాయమూర్తులు తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మంత్రి పర్యటనపై ఆరా
ఇటీవల తమిళనాడు కొత్త మంత్రి ఆర్. నిర్మల్‌కుమార్, ఆయన అనుచరుల దర్శనం కోసం తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయ తలుపులను నిబంధనలకు విరుద్ధంగా, ఆలస్యంగా మూసి ఉంచారనే అంశంపై గత విచారణలో కోర్టు వివరణ కోరింది. నిన్నటి విచారణలో ప్రభుత్వం స్పందిస్తూ— మంత్రి పర్యటన వల్ల ఎలాంటి ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించలేదని నివేదిక సమర్పించింది. ఆ నివేదికను రికార్డుల్లోకి తీసుకున్న కోర్టు, ప్రజాప్రతినిధులు తాము చట్టానికి అతీతులం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.
వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులు, కొత్తగా పెళ్లయిన జంటలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే మినహాయింపులు ఇవ్వాలి. మిగిలిన అందరికీ ఒకే తరహా క్యూ లైన్లు ఉండాలి. ప్రత్యేక రుసుము దర్శనాలను రద్దు చేయాలి. తమిళనాడులోని ప్రతి ఆలయంలో వృద్ధుల కోసం వీల్‌చైర్ సౌకర్యం కల్పించాలి…. ఇవీ పిటిషనర్ డిమాండ్స్…
ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తూ, తదుపరి విచారణను ధర్మాసనం ఆరు వారాల పాటు వాయిదా వేసింది. తమిళనాడు దేవాదాయ శాఖ ఈ వీఐపీ సంస్కృతిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, కోర్టు ఎలాంటి తుది తీర్పు ఇస్తుందోనని ఇప్పుడు భక్తులు ఆసక్తిగా గమనిస్తున్నారు…
……. ఇదీ వార్త… ఎన్నాళ్లకు ఓ మంచి తీర్పు… తిరుమలనే చూడండి, ప్రోటోకాల్ దర్శనాలు సామాన్య భక్తుల నుంచి దేవుడిని ఎలా దూరం చేస్తాయో… ఎలా అవస్థల పాలు చేస్తాయో… ప్రత్యేకించి ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు వస్తే అధికారగణం సాగిలబడుతుంది… తెల్లారి పత్రికల్లో ఫోటోలు, వార్తలు… అక్కడికి ఆ దేవుడిని వీళ్లే కనికరించి, కరుణించి, నాకు దర్శనమిచ్చే వరాన్ని ఆ దేవుడికి ఇచ్చినంత బిల్డప్… ఇవి గాకుండా ఆర్జిత సేవలు… డబ్బును బట్టి ఎంత దూరం నుంచి దేవుడిని చూడొచ్చే ‘టారిఫ్ దర్శనాలు’… బోలెడు, బోలెడు ఇలాంటివి… దేశమంతా ఇలాగే… సో, విజయ్, హైకోర్టు తీర్పు స్పూర్తిని కనీసం నువ్వయినా అందిపుచ్చుకోగలవా..?
Share this Article