.
వ్యాపార, రాజకీయ సర్కిళ్లలో ఓ కలకలం… కారణం, ప్రముఖ గోల్డ్ కంపెనీ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌పై సెబీ లేవనెత్తిన సంచలనాత్మక ప్రశ్నలు… 2021- 2025 మధ్య కంపెనీ చూపించిన దాదాపు రూ.15.15 లక్షల కోట్ల రెవెన్యూకు తగిన ఆధారాలు కనిపించడం లేదని సెబీ ప్రాథమికంగా పేర్కొంది… ఇది తెలంగాణ రాజకీయ సర్కిళ్లలోనూ చర్చకు దారితీస్తోంది… కారణం, సదరు కంపెనీతో కేటీఆర్ 2022 జూన్‌లో ఒక ఎంఓయూ కుదుర్చుకోవడం…
జాతీయ స్థాయిలో ఇది చర్చనీయాంశం కావడానికి మరో ప్రధాన కారణం, సదరు కంపెనీలో ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టడం… ఈ వివాదం ఎల్ఐసీ పెట్టుబడులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందనే లెక్కలు, విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి…
Ads
సరళంగా చెప్పాలంటే, సెబీ “ఈ రూ.15.15 లక్షల కోట్ల రెవెన్యూను నిరూపించే ఆధారాలు కనిపించడం లేదు” అంటోంది; రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ మాత్రం “ఆధారాలు ఉన్నాయి, మా కన్సాలిడేటెడ్ లెక్కలను సెబీ తప్పుగా అర్థం చేసుకుంది” అంటోంది… ఇప్పుడు ఈ కేసులో తుది నిర్ణయం ఫోరెన్సిక్ ఆడిట్, తదుపరి విచారణలపై ఆధారపడి ఉంటుంది…
సరే, ప్రస్తుతానికి సెబీ కొన్ని అకౌంటింగ్, రెవెన్యూ రిపోర్టింగ్ అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది… విచారణ ఇంకా పూర్తికాలేదు… ఇది తుది తీర్పు కాదు… కానీ కంపెనీ సీఎండీ రాజేశ్ మెహతాను కంపెనీ షేర్లలో ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధం విధించింది… అసలు ఏమిటి ఈ కంపెనీ కథ..?
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనేది భారతదేశానికి చెందిన ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ, ఎగుమతి సంస్థ… ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది… దీనిని 1989లో రాజేశ్ మెహతా, ఆయన సోదరుడు ప్రశాంత్ మెహతా స్థాపించారు… బంగారం మైనింగ్ నుంచి రిటైల్ వరకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఇది…
2015లో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గోల్డ్ రిఫైనరీ వాల్‌కాంబీని కొనుగోలు చేయడంతో కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించింది… కర్ణాటకలో “శుభ్ జ్యువెలర్స్” పేరుతో రిటైల్ షోరూమ్‌లు కూడా నిర్వహిస్తోంది… ఒకానొక సమయంలో ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు సంపాదించిన కొద్ది భారతీయ కంపెనీలలో ఇది ఒకటి… బెంగళూరు దీని ప్రధాన కార్యాలయం…
కంపెనీ ఆర్థిక లెక్కలపై అనుమానాలు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆడిటర్ల రాజీనామా… తాము కోరిన ఆర్థిక వివరాలు, పత్రాలు పూర్తి స్థాయిలో అందలేదని పేర్కొంటూ ఆడిటర్లు తప్పుకోవడం మార్కెట్‌లో చర్చకు దారితీసింది…
ఇక “రౌండ్ ట్రిప్పింగ్” ఆరోపణలు కూడా వినిపించాయి… “రౌండ్ ట్రిప్పింగ్” అంటే కంపెనీ తన అనుబంధ సంస్థలకు సరుకులు విక్రయించినట్లు చూపించడం, ఆ సరుకులు తిరిగి మరో మార్గంలో అదే వ్యవస్థలోకి రావడం… ఇలా జరిగితే వాస్తవ వ్యాపారం కంటే కాగితాలపై టర్నోవర్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు… అయితే ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు…
మరోవైపు, కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో వేల కోట్ల రూపాయల నగదు నిల్వలు చూపించినప్పటికీ, వాటికి సంబంధించిన వివరాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి… దాదాపు రూ.45,000 కోట్ల నగదు నిల్వలకు సంబంధించిన స్పష్టమైన వివరాలపై చర్చ జరిగింది…
ఈ నేపథ్యంలో సెబీ, ఇతర దర్యాప్తు సంస్థల దృష్టి కంపెనీపై పడింది… ప్రాథమిక దర్యాప్తులో పలు సందేహాస్పద అంశాల్ని గుర్తించినట్లు సెబీ పేర్కొంది… ఇక, తెలంగాణకు వద్దాం…
- 2022 జూన్‌లో ఇదే కంపెనీతో అప్పటి మంత్రి కేటీఆర్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు… భారతదేశంలో అత్యంత అధునాతన AMOLED డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు కోసం తెలంగాణలో రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెడతామని కంపెనీ ప్రకటించింది… ఆ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ (X) వేదికగా “Historic day for Telangana” అంటూ ఉత్సాహంగా ట్వీట్ కూడా చేశాడు… తీరా చూస్తే ఆ కంపెనీ కథ ఇదీ… ప్రస్తుతం సెబీ విచారణ ఎదుర్కొంటున్న కంపెనీతో అప్పట్లో ఎంవోయూ కుదుర్చుకోవడంపై సోషల్ మీడియాలో భారీగా రాజకీయ విమర్శలు స్టార్టయ్యాయి…
దానికి బీఆర్ఎస్ వర్గాలు ఏవేవో కౌంటర్లు ఇస్తున్నాయి… ఒప్పందం కుదిరేనాటికి రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటి అని, అప్పటివరకు కంపెనీపై ఎలాంటి ఆరోపణలు లేవని, పైగా తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థకు భూమి కానీ, ఆర్థిక ప్రోత్సాహకాలు కానీ ఇవ్వలేదని అంటున్నాయి… మరి ఏ ట్రాక్ రికార్డు చూసి ఆ కంపెనీతో అన్ని వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్టు..?
మళ్లీ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లెక్కల వివాదానికి వద్దాం… అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే..? 2024 మార్చిలో సెబీకి ఒక సాధారణ షేర్‌హోల్డర్ నుంచి ఈమెయిల్ ఫిర్యాదు అందింది… కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో ట్రేడ్ రిసీవబుల్స్ అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయని, ఇందులో ఆర్థిక అనుమానాస్పద అంశాలు ఉండవచ్చని ఆ ఫిర్యాదు సారాంశం…
ఆ చిన్న ఫిర్యాదుపై రంగంలోకి దిగిన సెబీ… రెండేళ్ల పరిశోధన తర్వాత ఇప్పుడు సంచలనాత్మక పరిశీలనలను బయటపెట్టింది… FY21 నుంచి FY25 వరకు కంపెనీ మొత్తం ప్రకటించిన రెవెన్యూ దాదాపు ₹15.45 లక్షల కోట్లు… ఇందులో దాదాపు ₹15.15 లక్షల కోట్ల ఆదాయానికి తగిన ఆధారాలు సమర్పించలేదని సెబీ ప్రాథమికంగా పేర్కొంది…
దర్యాప్తులో తేలిన మొదటి పెద్ద అంశం ఏమిటంటే… కంపెనీ ప్రకటించిన మొత్తం ఆదాయంలో 98 శాతానికి పైగా విదేశీ అనుబంధ సంస్థల నుంచే వచ్చినట్లు చూపించడం… అంటే, బెంగళూరులో లిస్ట్ అయిన కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల డబ్బు, వాస్తవానికి విదేశాల్లోని అనుబంధ సంస్థల పనితీరుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్టుగా కనిపిస్తోంది…
ఈ విదేశీ ఆదాయాల నిజానిజాలు తెలుసుకునేందుకు సెబీ, ఫోరెన్సిక్ ఆడిటర్లు కంపెనీని కీలక పత్రాలు అడిగారు… “కస్టమర్లు ఎవరు? వెండర్లు ఎవరు? సేల్స్ ఇన్‌వాయిస్‌లు ఎక్కడ? బ్యాంక్ లావాదేవీల రికార్డులు ఎక్కడ?” వంటి ప్రశ్నలు సంధించారు… అయితే, అడిగిన అన్ని వివరాలు పూర్తిస్థాయిలో అందలేదని సెబీ తన ఉత్తర్వులో పేర్కొంది…
దర్యాప్తు లోతుగా వెళ్లేకొద్దీ అసలు రహస్యం స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లు కనిపించింది… కంపెనీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత గోల్డ్ రిఫైనరీ వాల్‌కాంబీ ఎస్‌ఏ, దాని మాతృసంస్థ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ ఏజీ (GGR) లెక్కలపై సెబీ దృష్టి సారించింది…
వాల్‌కాంబీ స్టాండ్‌అలోన్ ఆదాయం కొన్ని వందల కోట్లలో ఉండగా, జీజీఆర్ కన్సాలిడేటెడ్ ఆదాయం లక్షల కోట్ల రూపాయల స్థాయిలో ఉండటాన్ని సెబీ ప్రశ్నించింది… దానికి కంపెనీ ఇచ్చిన వివరణ ఏమిటంటే… “వాల్‌కాంబీ తన ఖాతాల్లో కేవలం బంగారం శుద్ధికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజులను మాత్రమే చూపిస్తుంది. కానీ గ్రూప్ కన్సాలిడేటెడ్ ఖాతాల్లో మొత్తం బంగారం లావాదేవీల గ్రాస్ విలువను ఆదాయంగా పరిగణిస్తాం” అనేది…
అయితే, ఈ వివరణకు మద్దతుగా అవసరమైన పత్రాలు, యాజమాన్య హక్కుల వివరాలు, ఇన్వెంటరీ రిస్క్‌కు సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో సమర్పించలేదని సెబీ పేర్కొంది… అందువల్ల ₹15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రస్తుతం ధృవీకరించలేకపోతున్నామని తన మధ్యంతర ఉత్తర్వులో స్పష్టం చేసింది… ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే..? కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసీ పరిస్థితి ఏమిటి..? ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటి..?
సెబీ జారీ చేసినవి ఇప్పటికైతే మధ్యంతర పరిశీలనలు మాత్రమే… రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌కు తన వాదనలు వినిపించే పూర్తి చట్టపరమైన అవకాశం ఉంది… రాబోయే రోజుల్లో జరిగే పూర్తి స్థాయి దర్యాప్తు, విచారణల తర్వాతే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి…
ఒక సాధారణ షేర్‌హోల్డర్ ఫిర్యాదుతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు దేశ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ అకౌంటింగ్ వివాదాల్లో ఒకటిగా మారింది… సెబీ ఆరోపణలు నిజమా? లేక రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చెబుతున్నట్లుగా అకౌంటింగ్ విధానాలపై అపార్థమా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది… కానీ ప్రస్తుతం మాత్రం ₹15.15 లక్షల కోట్ల ఈ మిస్టరీ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది…
Share this Article