.
Vamsy Krishna … ఒక సీతాకోక చిలుక ఎగిరిపోయింది. తూర్పుకు వెళ్ళవలసిన రైలొకటి పడమరకు వెళ్ళిపోయింది. పదహారేళ్ళ వయసుకు శతమానం భవతి పచ్చికొట్టింది. ముదల్ మరియాదై చివరి స్థానాన్ని దాటి దిగంతంలో కలిసిపోయింది. అవును. భారతీరాజా ఇకలేరు. తమిళ తెరను కప్పేసిన మెలోడ్రామాకి, అవుట్ స్పోకెన్ సంభాషణలకి చెల్లు చీటీ ఇచ్చి, తమిళ చిత్రాన్ని నాలుగు గోడలమధ్య నుండి విశాల ప్రపంచంలోకి తీసుకుని వచ్చి, ప్రేక్షకుడికి తన కళ్ళముందే ఉన్న తన ప్రాకృతిక సౌందర్యాన్ని తనకే సరి కొత్తగా పరిచయం చేసిన భారతీ రాజా ఇకలేరు. సామాన్య మనుషుల అసామాన్య భావోద్వేగాలకు పెద్ద పీట వేసిన భారతీ రాజా ఇకలేరు.
భారతీ రాజా రాకతో తమిళ సినిమా శైలి మాత్రమే కాదు, మొత్తం దక్షిణ భారత సినిమా ఆలోచనా విధానమే మారిపోయింది. పల్లెటూరి మట్టి వాసనను, గ్రామీణ సంస్కృతిని, పల్లెటూరి మనుషుల అంతరంగాలను వెండితెరపై భారతీరాజా చూపించినంత అద్భుతంగా ఎవరూ చూపించలేరనే పేరును ఆయన సొంతం చేసుకున్నారు.
Ads
భారతీరాజా దర్శకత్వ శైలి అత్యంత విలక్షణమైనది. సినిమా అంటే కేవలం నటీనటులు చెప్పే డైలాగులు మాత్రమే కాదని, కెమెరా కదలికలు, నేపథ్య సంగీతం, ప్రకృతి కూడా మాట్లాడగలవని ఆయన నిరూపించారు. భారతీరాజా సినిమాల్లో విజువల్స్ చాలా బలంగా ఉంటాయి. ఎర్రటి మట్టి రోడ్లు, చెరువులు, పొలాలు, ఎండ తీవ్రత, వర్షం, ఇవన్నీ ఆయన సినిమాల్లో కేవలం నేపథ్యాలుగా కాక కథలో పాత్రలుగా మారిపోతాయి. పాత్రల భావోద్వేగాలను ప్రతిబింబించడానికి ప్రకృతిని ఒక సాధనంగా వాడుకోవడం ఆయన శైలి.
సాంప్రదాయక సినిమా సూత్రాలను బద్దలు కొడుతూ, పాత్రల సహజత్వానికి ఆయన అగ్రతాంబూలం ఇచ్చారు. మెలోడ్రామాను తగ్గించి, మనుషుల మధ్య ఉండే అసలైన మానసిక సంఘర్షణను తెరపై చూపించారు. నిశ్శబ్దం ఒక భాష అనీ, అదొక బలమైన భావ వ్యక్తీకరణ అని ఆయన తన సినిమాల ద్వారా నిరూపించారు.
సంగీత దర్శకుడు ఇళయరాజాతో ఆయనకు ఉన్న అనుబంధం సినిమా చరిత్రలోనే ఒక స్వర్ణయుగం. భారతీరాజా దృశ్య శైలికి, ఇళయరాజా జానపద శాస్త్రీయ సంగీత మిశ్రమానికి కుదిరిన బంధం తమిళ సినిమాకు ప్రాణం పోసింది. పాటలను కేవలం వినోదం కోసమే కాకుండా, కథను ముందుకు నడిపించేందుకు, పాత్రల అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు ఆయన వాడుకున్నారు.
ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మొదటి సినిమా ’16 వయతినిలే’… ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఒక పల్లెటూరి అమ్మాయి అమాయకత్వాన్ని, చుట్టూ ఉండే మనుషుల స్వార్థాన్ని, క్రూరత్వాన్ని ఎంతో యథార్థంగా చూపించిన చిత్రమిది. ఈ సినిమాతోనే ఆయన గ్రామీణ చిత్రాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
ఆ తర్వాత వచ్చిన ‘కిళక్కే పోగుం రైల్’ (తెలుగులో ‘తూర్పు వెళ్ళే రైలు’) కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఒక రైలు చుట్టూ, ఆ ఊరి మనుషుల నమ్మకాల చుట్టూ అల్లిన ఈ కథ ఒక దృశ్య కావ్యం. ‘సిగప్పు రోజాక్కల్’ (తెలుగులో ‘ఎర్ర గులాబీలు’) సినిమాతో ఆయన తన శైలిని పూర్తిగా మార్చి, ఒక అద్భుతమైన సైకో థ్రిల్లర్‌ను అందించారు. కమల్ హాసన్ కి మాత్రమే సాధ్యమైన నటనతో, మానసిక విశ్లేషణతో సాగే ఆ సినిమా భారతీరాజాలోని వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
ఆయన దర్శకత్వంలో వచ్చిన మరొక అద్భుత చిత్రం ‘అలైగల్ ఓయివత్తిల్లై’ (తెలుగులో ‘సీతాకోకచిలుక’). మతాంతర ప్రేమ, సమాజంలోని కట్టుబాట్లు, యువతరం ఆలోచనలను ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ సినిమా ఒక సంగీత సంచలనం కూడా.
‘ముదల్ మరియాదై’ సినిమా భారతీరాజా కెరీర్‌లో ఒక శిఖరాగ్రం లాంటిది. శివాజీ గణేషన్, రాధ నటించిన ఈ చిత్రం ఒక మధ్యవయస్కుడైన వ్యక్తికి, ఒక పేద యువతికి మధ్య ఉండే పవిత్రమైన, సమాజానికి అందని అనుబంధాన్ని ఎంతో హుందాగా , సున్నితంగా ఆవిష్కరించింది.
భారతీరాజా దర్శకత్వ శైలిని జాగ్రత్తగా పరిశీలిస్తే బ్రిటిష్ క్లాసిక్ సినిమాల దిగ్గజం డేవిడ్ లీన్ గుర్తుకువస్తారు. ఈ ఇద్దరు దర్శకులు వేర్వేరు కాలాలకు, వేర్వేరు సంస్కృతులకు చెందినవారైనప్పటికీ, వారి దృశ్య చిత్రణ శైలిలో (Visual Storytelling) అత్యంత ఆశ్చర్యకరమైన సామ్యాలు కనిపిస్తాయి. సినిమాను కేవలం నటీనటుల సంభాషణల ద్వారా కాకుండా, కంటికి కనిపించే ల్యాండ్‌స్కేప్స్, కెమెరా కదలికలు, ఎడిటింగ్ టెక్నిక్స్ ద్వారా ఒక దృశ్య కావ్యంగా మలచడం వీళ్ళిద్దరిలో కనిపించే ఒక సాధారణ పోలిక. అయితే అతి పెద్ద సారూప్యం ప్రాకృతిక నేపథ్యాన్ని కేవలం ఒక లొకేషన్‌లా కాకుండా కథలో ఒక సజీవ పాత్రగా మార్చడం.
డేవిడ్ లీన్ అనగానే మనకు ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’ (Lawrence of Arabia) సినిమాలో అనంతంగా విస్తరించి ఉండే ఎడారి గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో ఎడారి అనేది కేవలం బ్యాక్‌డ్రాప్ కాదు, అది ప్రధాన పాత్ర అయిన లారెన్స్ మానసిక ఒంటరితనానికి, అహంకారానికి, అతను ఎదుర్కొనే సవాళ్లకు ఒక ప్రతీక. సరిగ్గా ఇదే శైలి భారతీరాజా సినిమాల్లోనూ కనిపిస్తుంది.
‘ముదల్ మరియాదై’ (Mudhal Mariyadhai) లో పల్లెటూరి చెరువు, పచ్చని పొలాలు, ప్రశాంతంగా సాగే నది కేవలం అందం కోసం చూపించినవి కావు. అవి ఆ సినిమాలో శివాజీ గణేషన్, రాధల మధ్య కుదురుకున్న నిశ్శబ్ద అనుబంధానికి, వారి అంతరంగంలోని ప్రశాంతతకు అద్దం పడతాయి.
అలాగే, లీన్ తన ‘డాక్టర్ జివాగో’ (Doctor Zhivago) సినిమాలో రష్యాలోని శీతాకాలపు మంచును, చలిని పాత్రల మధ్య ఉండే దూరాన్ని, నిస్సహాయతను చూపించడానికి వాడుకుంటే, భారతీరాజా ‘అలైగల్ ఓయివత్తిల్లై’ (తెలుగులో సీతాకోక చిలుక ) సినిమాలో ఎగసిపడే సముద్రపు అలలను, తీరాన్ని ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే మతాంతర సంఘర్షణకు, వారి గుండెల్లోని ఆవేదనకు ప్రతీకగా నిలిపారు.
డేవిడ్ లీన్ వైడ్ షాట్స్ (Wide Shots) ఉపయోగించడంలో సిద్ధహస్తుడు. ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’లో సుదూరం నుండి ఒక ఒంటరి మనిషి గుర్రంపై వస్తున్న షాట్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైనది. మనిషి ప్రకృతి ముందు ఎంత చిన్నవాడో చూపిస్తూనే, అతని సంకల్పాన్ని ఎలివేట్ చేయడానికి ఆ వైడ్ ఫ్రేమ్ ను ఒక సాధనంగా వాడుకున్నాడు డేవిడ్ లీన్ .
భారతీరాజా కూడా సరిగ్గా ఇదే టెక్నిక్‌ను తన గ్రామీణ చిత్రాలలో అద్భుతంగా అమలు చేశారు. ‘తూర్పు వెళ్ళే రైలు’ (Kizhakke Pogum Rail) సినిమాలో పచ్చని పొలాల మధ్య నుండి సుదూరంగా పరుగెడుతూ వచ్చే రైలును వైడ్ యాంగిల్‌లో చూపిస్తారు. ఆ ఊరి మనుషుల నమ్మకాలు, ఆచారాల మధ్య నలిగిపోయే ఇద్దరు ప్రేమికుల జీవిత ప్రయాణానికి ఆ పరుగెత్తే రైలు షాట్ ఒక అద్భుతమైన విజువల్ మెటఫర్ అనిపిస్తుంది.
ఎడిటింగ్, విజువల్ ట్రాన్సిషన్స్ (Visual Transitions) విషయంలో కూడా వీరిద్దరి ఆలోచనా విధానం ఒకేలా సాగుతుంది. డేవిడ్ లీన్ తన సినిమాల్లో ‘మ్యాచ్ కట్’ (Match Cut) లని అద్భుతంగా వాడుకునేవారు.’లారెన్స్ ఆఫ్ అరేబియా” లో లారెన్స్ ఒక అగ్గిపుల్లను ఊది ఆర్పే షాట్ నుండి నేరుగా ఎడారిలో సూర్యుడు ఉదయించే షాట్‌కు కట్ అవుతుంది. అది కేవలం సీన్ మారడం కాదు, కథలోని తీవ్రతను మార్చే ఒక దృశ్య ప్రయోగం.
భారతీరాజా కూడా తన సినిమాల్లో ఇటువంటి కట్స్ ఎన్నో చేశారు. ‘పదహారేళ్ళ వయసు’ సినిమాలో శ్రీదేవి అమాయకత్వాన్ని చూపించే సీన్ నుండి, ఊరి పెద్దల స్వార్థాన్ని చూపించే సీన్లకు మారేటప్పుడు ప్రకృతిలోని మార్పులను అంటే హఠాత్తుగా ఎండ తీవ్రత పెరగడం, కాకి అరవడం వంటి దృశ్యాలను మ్యాచ్ కట్స్‌గా వాడుకుని ప్రేక్షకుల మైండ్‌సెట్‌ను కథకు అనుగుణంగా మార్చేవారు.
మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను భారీ కాన్వాస్‌పై చూపిస్తూనే, పాత్రల సున్నితత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడడం ఇద్దరిలోనూ కనిపిస్తుంది. డేవిడ్ లీన్ ‘ఎ ప్యాసేజ్ టు ఇండియా’ సినిమాల్లో సమాజం అంగీకరించని బంధాలు, సంస్కృతుల మధ్య ఘర్షణలు ఉంటాయి. భారతీరాజా కూడా తన కెరీర్ పొడవునా కుల వివక్ష, మతాంతర కట్టుబాట్లు, సమాజం గీసిన గీతలను ఎదిరించే ప్రేమకథలనే ఎంచుకున్నారు.
కానీ ఆ ఘర్షణను కేవలం గొడవలుగా కాకుండా, పాత్రల అంతరంగంలో జరిగే యుద్ధంగా, అత్యంత సున్నితమైన భావోద్వేగాలతో దృశ్యబద్ధం చేశారు. అందుకే, వెస్ట్ లో డేవిడ్ లీన్ కెమెరాతో ఎలాంటి దృశ్య కావ్యాలు సృష్టించారో, ఈస్ట్ లో భారతీరాజా కూడా పల్లెటూరి నేపథ్యంలో అలాంటి క్లాసిక్స్‌ను కెమెరా కంటితోనే లిఖించారు.
భారతీరాజా కేవలం కెమెరాను స్టూడియో నాలుగు గోడల నుండి బయటకు తీసుకురావడమే కాదు, సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ రంగాలలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. అంతకుముందు వరకు సినిమా అంటే ఫిలిం నెగెటివ్‌పై రంగుల అలంకరణ అనే భావన ఉండేది. కానీ, ఆయన సహజమైన సూర్యకాంతిని (Natural Lighting), సంధ్యా సమయపు వెలుతురును, పల్లెటూరి రాత్రుల చీకటిని యథాతథంగా తెరపై బంధించి, విజువల్స్‌కు ఒక సరికొత్త అర్ధాన్ని ఇచ్చారు.
నిశ్శబ్దానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత కేవలం పాత్రల మధ్యే కాదు, సౌండ్ డిజైనింగ్‌లోనూ కనిపిస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఆయన సినిమాల్లో కోయిల కూతలు, గాలికి ఊగే ఆకుల చప్పుడు, ఎద్దుల బండ్ల గజ్జెల రవళి, నది ప్రవాహ ధ్వని వంటి పరిసరాల శబ్దాలను (Ambient Sounds) కథలో లీనమయ్యేలా వాడుకుని ప్రేక్షకుడిని నేరుగా ఆ గ్రామంలో కూర్చోబెట్టిన అనుభూతిని కలిగించేవారు.
భారతీరాజా సినిమాల్లో మహిళా పాత్రల చిత్రణ అత్యంత శక్తిమంతంగా, సమాజ ఆలోచనలను ప్రశ్నించే విధంగా ఉంటుంది. ఆయన సృష్టించిన నాయికలు కేవలం గ్లామర్ బొమ్మలు కాదు; వారిలో పల్లెటూరి అమాయకత్వం కనిపిస్తూనే, కష్టాలను ఎదుర్కొనే మానసిక ధైర్యం, పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించే తిరుగుబాటు స్వభావం మూర్తీభవిస్తాయి. ప్రేమ కోసం ప్రాణాలనైనా ఇచ్చే లేదా కులమతాల కట్టుబాట్లను తెంచుకుని పోరాడే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన సృష్టించే ప్రతి నాయిక పాత్రలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తుంది.
దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న భారతీరాజా, నటుడిగా కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్నారు సాధారణంగా దర్శకులు నటిస్తే వారిలో దర్శకుడు కనిపిస్తుంటాడు, కానీ భారతీరాజా నటుడిగా మారినప్పుడు పూర్తిగా ఆ పాత్రలోనే లీనమైపోతారు. ఆయన బేస్ వాయిస్ , కళ్ళల్లో ఉండే తీవ్రత నటుడిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
మొదట్లో తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఆయన, ఆ తర్వాత పూర్తిస్థాయి నటుడిగా మారి పవర్‌ఫుల్ పాత్రలను పోషించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఆయుధ ఎళుతు’ (తెలుగులో ‘యువ’) సినిమాలో ఆయన పోషించిన రాజకీయ నాయకుడి పాత్ర ఆయన నటనకు ఒక మచ్చుతునక. కుటిల రాజకీయం చేసే ఒక వృద్ధ రాజకీయవేత్తగా, యువతరం ఆలోచనలను అణచివేయాలని చూసే క్రూరమైన విలన్‌గా ఆయన చూపించిన హావభావాలు, నటన అద్భుతం.
ఇటీవల వచ్చిన ‘తిరుచిత్రంబలమ్’ (తెలుగులో ‘తిరు’) సినిమాలో ధనుష్‌కు తాతగా ఆయన చేసిన నటన ప్రేక్షకులను కంట నీరు పెట్టిస్తుంది. నటుడిగా కెమెరా ముందు ఎలా ప్రవర్తించాలో, పాత్రకు ఎంతవరకు అవసరమో అంత మాత్రమే ఎలా నటించాలో ఆయనకు బాగా తెలుసు.
తమిళ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలలోని నేటి తరం అగ్ర దర్శకులు ఎందరో ఇప్పటికీ తాము భారతీరాజా సినిమా స్కూల్ నుండి స్పూర్తి పొంది ఇక్కడికి వచ్చామని గర్వంగా చెప్పుకుంటారు. ఆయన ప్రయోగశాల నుండి వచ్చిన సాంకేతిక నిపుణులు, నటీనటులు భారతీయ సినిమాను దశాబ్దాల పాటు ఏలారు…!!
Share this Article