.
ప్రేమకు భాష లేదంటారు… దూరం తెలియదంటారు… కానీ ప్రేమకు రెక్కలుంటాయని ఎవరైనా చెబితే నమ్ముతామా?
1993లో క్రొయేషియాలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన సంఘటన ఒక ప్రేమకథకు ఆరంభం పలికింది. వేటగాడి తుపాకీ నుంచి వచ్చిన తూటా ఓ తెల్ల కొంగ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. “మలెనా” అనే ఆ ఆడ కొంగ రెక్క తీవ్రంగా దెబ్బతినడంతో ఇక జీవితంలో ఎప్పటికీ ఎగరలేని పరిస్థితికి చేరుకుంది.
Ads
ప్రతి ఏడాది చలికాలం రాగానే వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్రికాకు వెళ్లే కొంగల గుంపు బయల్దేరింది. కానీ మలెనా మాత్రం వెళ్లలేకపోయింది. మిగతా పక్షులన్నీ ఆకాశంలో కలిసిపోతుంటే, ఆమె ఒంటరిగా క్రొయేషియాలోనే మిగిలిపోయింది.
అప్పుడు ఆమెకు అండగా నిలిచాడు స్టెపాన్ వోకిచ్ అనే రిటైర్డ్ వ్యక్తి. తన ఇంటి పైకప్పుపై గూడు కట్టించి, ఆహారం పెట్టి, మంచుతో గడ్డకట్టే చలికాలాల్లో కూడా దాన్ని కంటికి రెప్పలా కాపాడాడు. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది.
మలెనాకు “క్లెపెటాన్” అనే మగ కొంగ జోడీగా ఉండేది. చలికాలం రాగానే అది మిగతా కొంగలతో కలిసి దాదాపు 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయేది. సాధారణంగా చూస్తే అదే వారి ప్రేమకథకు ముగింపు కావాలి.
కానీ అలా జరగలేదు.
వసంతకాలం రాగానే క్లెపెటాన్ మళ్లీ వచ్చేది.
ఒకసారి కాదు…
రెండుసార్లు కాదు…
ఏడాది తర్వాత ఏడాది…
వరుసగా 16 సంవత్సరాల పాటు!
ఆఫ్రికా ఖండం, మధ్యధరా సముద్రం, ఎన్నో దేశాలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించి చివరకు అదే గ్రామం… అదే ఇల్లు… అదే పైకప్పు… అదే గూడు… అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న మలెనా.
ఈ అద్భుతమైన కలయికను స్థానికులు, మీడియా ప్రతి ఏడాది నమోదు చేశారు. క్లెపెటాన్ వచ్చిన రోజు గ్రామంలో పండగ వాతావరణం కనిపించేది.
ఇద్దరూ కలిసి 40కి పైగా పిల్లలకు జన్మనిచ్చారు. మలెనా ఎగరలేకపోయినా, వారి కుటుంబ జీవితం మాత్రం ఆగలేదు. ప్రతి శరదృతువులో క్లెపెటాన్ పిల్లలను వెంటబెట్టుకుని మళ్లీ ఆఫ్రికా బయల్దేరేది. మలెనా మాత్రం మరోసారి ఒంటరిగా ఎదురుచూసేది.
మరి తర్వాత?
మళ్లీ వసంతం…
మళ్లీ ఆకాశం నుంచి క్లెపెటాన్ రాక…
మళ్లీ అదే ప్రేమకథ.
ఇది ప్రేమా? అలవాటా? ప్రకృతి ప్రసాదించిన సహజ స్వభావమా? శాస్త్రవేత్తలు దీనికి తమదైన వివరణలు చెబుతారు.
కానీ ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ మాత్రం ఒకటే అంటారు…
ప్రపంచంలో కొన్ని విషయాలను శాస్త్రంతో వివరించవచ్చు. కానీ కొన్ని బంధాలను మాత్రం హృదయంతో మాత్రమే అర్థం చేసుకోవాలి. కొన్నింటికి లాజిక్కులు అవసరం లేదు… ఉండవు…
Share this Article