.
నిన్న రెండు ఆందోళనలు… ఒకటి కల్వకుంట్ల కవిత, రెండు హరీష్ రావు… పోలీసులతో తోపులాట, అరెస్టు, వ్యానుల్లో ఎక్కించి ఏదో పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోవడం, తరువాత వదిలేయడం… ఈలోపు ఫోటోలు, వీడియోలు, కేకలు, నినాదాలు, పోలీసులతో పెనుగులాడుతున్నట్టు షో ఆఫ్… ఎందుకొచ్చిన ప్రచార ప్రయాస?
కవిత ఉప్పల్ భగాయత్‌లో ఆందోళన… దేనికి..? ఉద్యమకారులకు భూములివ్వాలని! అసలు ఉద్యమకారులంటే ఎవరు..? ఎవరు ధ్రువీకరించాలి..? అర్హతలు, ప్రామాణికాలు ఏమిటి..? జనమంతా ఉద్యమించారు కదా, కొందరిని ఎలా ప్రత్యేకంగా గుర్తించాలి..? అది తేల్చడానికే కదా ప్రభుత్వం ఓ కమిటీని వేసింది…
Ads
మరి అప్పుడే తలా 250 గజాల్ని ఎవరు ఇవ్వాలి, అదీ ఉప్పల్ భగాయత్ వంటి చోట్ల ఇస్తారా..? అసలు ఉద్యమకారుల గుర్తింపు జరిగిందా? లేక కవిత ఏదైనా లిస్టు ఇస్తే వాళ్లకు ఇచ్చేయాలా..? దీనికి భూపోరాటం అని పేరు..!! పోలీసులు రాగానే వాళ్లు చెప్పిన వ్యానులోనో, వాహనంలోనే వెళ్లి కూర్చుంటే చిన్నతనమా..? అలా చేస్తే పోరాటం స్థాయి ఏమైనా బలహీనపడుతుందా..? హేమిటో!!
ఏదైనా సమస్యపై ఒక రాజకీయ పార్టీగా పోరాడాలి, తమ నిరసన ప్రకటించాలి, కానీ ఆమె తొందరపడుతోంది… తల్లి పార్టీ బీఆర్ఎస్‌ను దాటేయాలని తహతహ… ప్రబల ప్రత్యర్థి హరీష్ రావుకన్నా ముందుండాలనే తాపత్రయం అవసరమా..?
మొన్న కేవీరెడ్డి అనే జర్నలిస్టు అరెస్టుపైనా ఆమె స్టాండ్ అలాంటిదే… తెలంగాణవాడు అయితే ఇక వేరే రాష్ట్రాల్లో కేసులు ఏమున్నా సరే, అరెస్టులు చేయకూడదా..? అసలు క్యాంపెయిన్, ప్రాపగాండా యూట్యూబర్లు జర్నలిస్టులేనా? కవితే క్లారిటీ ఇవ్వాలి… ఐనా కాలం చెల్లిన ఈ ఆందోళన పద్ధతులు, పోలీసులతో పెనుగులాటను పెద్ద పోరాటంగా షో చేయడం గాకుండా… ఏదైనా కొత్తగా నిరసన, డిమాండ్ పద్ధతుల్ని ఆలోచించొచ్చు కదా!
మరోవైపు హరీష్ రావు కథా అలాగే ఉంది… అసలు చర్చకు సిద్ధమా అనే ప్రశ్న రాజకీయాల్లో అత్యంత భ్రమాత్మకం… ఏదో మీడియాలో ఆ సవాల్ ప్రచారానికి రావాలనేదే తప్ప, నిజంగా రాజకీయ నాయకులు ఏదో ఓ చోట కూర్చుని హుందాగా, పరిణతితో, సంస్కారవంతంగా చర్చించే వాతావరణం ఉందా..? మరెందుకు ఈ శుష్క సవాళ్లు…
కాంగ్రెస్ మంత్రులదీ అదే పోకడ… ఎందుకు చర్చకు సవాల్ పేరిట గోకినట్టు..? చివరకు పారిపోయారు అనే బ్యాడ్ రిజల్ట్ దేనికి..? తెల్లారిలేస్తే మొత్తం పత్రికల నిండా ఇవే వార్తలు, ఇవే ఫోటోలు… ప్రయోజనం..? పెద్ద గుండు సున్నా!! మీడియాకు పని, స్పేస్ ఫిల్లింగ్… అసలు వాటిని ఎవరైనా చదువుతున్నారా అనే సోయి కూడా లేదు… పోనీ, ఇందులో ప్రజాప్రయోజనం ఏమైనా ఉందా..? ఒక ప్రజాసమస్యపై పోరాటమా ఇది?
గురుకుల టెండర్లలో అక్రమాలు, కేసీయార్ చేసిన భారీ అప్పులు అనేవి బీఆర్ఎస్ ఆరోపణలు, మీడియాలో వచ్చాయి, జనం చదివారు, చూశారు, సరిపోదా..? ప్రభుత్వం తరఫున ఎవరో మంత్రి వివరణ ఇచ్చాడు, అదీ జనం చదివారు, సరిపోదా..? ఈ సవాళ్ల పోరాటం దేనికి..? కేటీయార్‌కు, హరీష్ రావుకు ఓ చాన్స్ ఇచ్చింది మంత్రులే!
నిజానికి ప్రస్తుత తరం రాజకీయ ప్రచార ప్రదర్శనల్ని ఏవగించుకుంటోంది.,. ప్రత్యేకించి రాస్తారోకోలు వంటి సందర్భాల్లో అవస్థలు పడుతున్న జనం బండబూతులు తిడుతున్నారు ఆందోళనకారుల్ని..! ఏదేని ప్రజావ్యతిరేక పోకడ మీద నిరసన వ్యక్తం చేయాలంటే ధర్నా చౌక్ వంటి వేదికలున్నాయి… కానీ అక్కడ కూర్చుంటే మీడియా దేకదు…
అందుకని వీథ్లులోకి రావడం, జనాన్ని అవస్థలకు గురిచేయడం… పోలీసులకు కూడా ఇదే పని… బందోబస్తు, అరెస్టులు… పొద్దున్నే పేపర్లలో, టీవీల్లో పోలీసుల జులుం పేరిట శాపనార్థాలు… బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఒకరు ఆమధ్య చెప్పాడు కదా, ప్రజలు ఆందోళనలకు రాకపోతే ఆఫీసులు, రైలుపట్టాల పనిపట్టాలి అని… ఫామ్ హౌజులో కూర్చుని ఒకాయన నిర్వేదంగా, నిర్లిప్తంగా చూస్తుంటాడు, తనకు ఇవేమీ పట్టవు అన్నట్టుగా..!!
ఎస్, రాజకీయ ప్రచార లబ్ధికి పార్టీలు పన్నే శుష్క ఎత్తుగడల్ని జనం హర్షించడం లేదు… ఎటొచ్చీ పార్టీలకే అది అర్థం కావడం లేదు… మీడియాకు అస్సలు అర్థం కావడం లేదు!!
Share this Article