.
చాన్నాళ్లుగా తెలుగు యూట్యూబ్ చానెళ్లకు ఓ పైత్యం… ఎవడినో కూర్చోబెట్టి ఏదేదో అడగడం, వాళ్లు నోటికొచ్చింది వాగడం… సరే, ఎవడో ఏదో వాగాడు, పది మంది చూశారు అనుకునేంతవరకు వోకే… కానీ చనిపోయిన సినిమా సెలబ్రిటీలు, ప్రముఖుల గురించి నోటికొచ్చింది కూసినప్పుడే చిక్కు…
నిజాలో అబద్ధాలో వదిలేయండి… మరణించినవాళ్ల మీద అకారణంగా కేవలం వ్యూస్, క్విక్ బైట్ల కోసం బురద జల్లితే… ఆ ప్రముఖుల్ని అభిమానించేవాళ్లు సీరియస్‌గా రియాక్టవుతారు, అవసరమైతే చెప్పుతో కొడతాం అనీ హెచ్చరిస్తారు… అవును, ఎవరో ఒకరు తిరగబడి తర్జని చూపాల్సిందే…
Ads
ఓసారి ఎవరో సీనియర్ జర్నలిస్టు పేరిట ఏదేదో కూస్తే టీవీ నటి రోహిణి ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది… ‘నువ్వు జర్నలిస్టువైపోయావ్ కాబట్టి ఏమీ అనడం లేదు, వేరేవాడయితే చెప్పుతో కొట్టేదాన్ని’ అని ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది… అవును, కొందరు ఎందుకులే అనవసరంగా ఇంకా ఇంకా గోక్కోవడం అని వదిలేస్తారు, కొందరు మాత్రమే అభిమానం చంపుకోలేక తిరగబడతారు… (ఆమధ్య ఓ పాత దర్శకుడు ప్రతి చానెల్లోనూ చిల్లర దిగజారుడు వ్యాఖ్యలు చేసేవాడు, ఇప్పుడు కనిపించడం లేదు)…
తాజాగా ఇలాంటి వివాదమే… ఎవరో సీనియర్ కో డైరెక్టర్ అట… కనకాల జయకుమార్… ఏదో చానెల్లో మాట్లాడుతూ… కోడి రామకృష్ణ,, కోదండరామిరెడ్డి బిజీగా ఉన్నప్పుడు వాళ్ల ఇళ్లల్లో వండుకునేవారు కాదనీ, వాళ్ల ఇళ్లకు కూడా ప్రొడక్షన్ ఫుడ్ వెళ్లేదని ఏదో కూశాడు… అంటే, షూటింగ్ జరుగుతున్నప్పుడు నిర్మాత డబ్బులతో ఆర్టిస్టులకు ఫుడ్ పెడతారు కదా… అది…
నిజంగా చిల్లర వ్యాఖ్యానం అది… కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణలు మరీ చిల్లర కేరక్టర్లు అని నిందించడం ఇది… వాళ్ల కుటుంబాలనూ అవమానించడం… కోడి రామకృష్ణ శిష్యుడు, దర్శకుడు దేవిప్రసాద్ దీనిపై స్పందించాడు… ఈ సొల్లు ఖండిస్తున్నాను అనడమే కాదు, ఎప్పుడో ఓసారి నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుంది అని తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టాడు… (నిజం అబద్ధాన్ని చెప్పుతో కొట్టడం అంటే అర్థమైంది కదా…) సరే, ఆ పోస్టు ఇలా ఉంది…

Director Devi Prasad.C… అభిజ్ఞ వర్గాల భోగట్టా అంటూ న్యూస్‌పేపర్స్ అసలైన న్యూస్‌ని కాకుండా ఆయా యాజమాన్యాల, పార్టీల వ్యూస్ ని మాత్రమే రాయటం మామూలే.
కానీ యూట్యూబ్ వీడియోల్లో కొందరు మాత్రం తామే స్వయంగా సినిమా పరిశ్రమలోని సెలబ్రిటీల పక్కనే ఉండి అంతా చూసినట్లుగా అబద్ధాలను మసాలాలు దట్టించి మరీ వండి వారుస్తుంటారు. ఇదుగో ఈ “కనగాల జయకుమార్”గారిలా.
ఈయన సీనియర్ కోడైరెక్టర్ గారట. అది నిజమే. కానీ ఆయన చెప్పేవాటిలో అన్నీ నిజాలు కావు.
వాటిని వీక్షించేవారిలో ఏ కొంచెం లాజిక్‌తో ఆలోచించేవారైనా ఇలాంటివారు చెప్పే అన్ని విషయాలనూ నమ్మరు కానీ, నమ్మేసేవారి సంఖ్య కూడా తక్కువేమీకాదు.
ఈయన కధనం ప్రకారం దిగ్దర్శకులు కోడిరామకృష్ణ గారు ,కోదండరామిరెడ్డి గార్లు బిజీగా ఉన్నంతవరకూ వారి ఇళ్ళల్లో అసలు పొయ్యే వెలగలేదట. అన్ని రోజులూ అన్ని పూటలూ ప్రొడక్షన్ నుండే వారి కుటుంబ సభ్యులకు కూడా నిర్మాతలే భోజనాలు పంపించేవారని సెలవిచ్చారీయన గారు ఓ ఇంటర్వ్యూలో.
దానికి సాక్షిగా జీవించిలేని మహానుభావుడు నిర్మాత ఎం.ఎస్.రెడ్డి గారిని సీన్లో ప్రవేశపెట్టారు. ఈ వయసులో ఈయనకు ఎందుకీ దిగజారుడుతనం…? చానెల్స్ వారిచ్చే డబ్బు కోసమేనా…?
సీనియర్ మోస్ట్ అంటున్నారు కనుక ఊహాగానాలు కాకుండా, నిజంగా తనకు తెలిసిన వాస్తవాలు మాట్లాడితే హుందాగా ఉండదా…? సినిమా చరిత్రను నమోదు చేసినట్టవుతుంది కదా.
మా గురువు గారి తొలి చిత్రం “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” నుండే ఆయన సూపర్‌హిట్ చిత్రాల దర్శకులు కదా . ఆయనకు డబ్బుకు లోటా కుటుంబంతో సహా నిర్మాతల భోజనాలను ఆశించటానికి…?
ఆ మాత్రం లాజిక్ ఆలోచించరా.
సినిమా నిర్మాణంలోనైనా సరే, వృధా ఖర్చులను ఇష్టపడరు తప్ప కోడి రామకృష్ణ గారు, ఆయన కుటుంబసభ్యులే ఎందరికో భోజనం పెట్టారు. ఇప్పటికీ పెడుతున్నారు.
పోనీ ఈయన ప్రస్తావించిన ఎం.ఎస్.రెడ్డి గారి కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారున్నారు కదా వారిని అడిగితే నిజం తెలుస్తుంది కదా.
ఈయన గారి “సొల్లు”ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
కాంట్రవర్సీలకు నేను దూరం. కానీ “నిజం చెప్పులేసుకొని గడప దాటేలోపు అబద్ధం రంగురంగు బట్టలేసుకుని ఊరంతా ఊరేగుతుంది. కానీ ఏదోరోజు నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుంది” అని నానుడి. అందుకే ఈ మాత్రం వివరణ.
అవాకులు చెవాకులు మాట్లాడుతున్న ఈ పెద్దాయనను ఇంతకంటే అసహ్యించుకోవటానికి ఆయన వయసు నా సంస్కారం అడ్డొస్తున్నాయి.
తప్పులు సరిదిద్దుకుంటే ఆయన పెద్దరికానికే మర్యాద గౌరవం.
_______ దేవీప్రసాద్.
Share this Article