.
‘‘తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని నాగార్జున సాగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మహా వరుణ యాగం నిర్వహించింది. ఈ యాగం పూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య 108 మంది రుత్వికులు, 11 హోమ గుండాలతో ‘కరీరీ ఇష్టి’ అనే ప్రత్యేక క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు…’’
….. ఇదీ ఎక్కడో చదివాను… అవునూ, ఇంతకీ ప్రభుత్వం నిర్వహించిన ఈ యాగం మహా వరుణ యాగమా..? కరీరీ ఇష్టి క్రతువా..? అధికారిక ప్రకటనల్లో మాత్రం మహా వరుణ యాగం అనే పేర్కొన్నారు… మరి ఈ కరీరీ ఇష్టి ఏమిటి..? ఈ రెండూ వేర్వేరా..? ఓసారి చూద్దాం…
Ads

కరీరీ ఇష్టికి, సాధారణంగా మనం వినే వరుణ యాగం (లేదా పర్జన్య యాగం) మధ్య ప్రధానంగా క్రతువు నిర్వహించే విధానంలో, ఉపయోగించే పదార్థాలలో, వైదిక సంప్రదాయంలో కొన్ని సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి…
1. కరీరీ ఇష్టి (Kariri Ishti) …
నిర్వచనం & స్వరూపం…: ‘ఇష్టి’ అంటే వైదిక పరిభాషలో ఒక చిన్నపాటి హవిస్సుతో (యజ్ఞోపకరణాలతో) చేసే యాగం లేదా యజ్ఞ విశేషం. ఇది ప్రధానంగా కృష్ణ యజుర్వేదానికి చెందిన మైత్రాయణీ సంహితలో వర్షాలు కురిపించడానికి నిర్దేశించబడిన ఒక ప్రత్యేకమైన ప్రాయశ్చిత్త/ కామ్య క్రతువు.
ప్రత్యేకత…: ఈ యాగంలో ‘కరీర’ (Karira – అడవులలో పెరిగే ఒక రకమైన పొద) మొక్కకు సంబంధించిన భాగాలు లేదా దాని పండ్లను హోమంలో ప్రధాన ద్రవ్యంగా ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రకృతిలోని ఒక నిర్దిష్టమైన వృక్ష సంపదను ఉద్దేశించి చేసే ప్రయోగం దీనికి ప్రత్యేకతను తెస్తుంది.
ఆచరణ…: ఈ క్రతువును నిర్వహించేటప్పుడు ఋత్వికులు వాతావరణంలో మేఘాలు కమ్ముకోవడానికి ప్రతీకగా నల్లటి వస్త్రాలు ధరించడం ఒక ప్రత్యేక నియమం… అలాగే వరుణ సూక్తం, పర్జన్య సూక్తం, వర్ష పాశుపత మంత్రాలను పఠిస్తారు. వరుణ వృక్ష బెరడు, వట్టివేరు, పంచక్షీర వృక్షాల సమిధలు, నవధాన్యాలు, ఆవు నెయ్యిని హోమంలో ఉపయోగిస్తారు.
శాస్త్రీయ పోలిక…: ఆధునిక కాలంలో మేఘాలను కృత్రిమంగా కరిగించి వర్షం కురిపించే ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud Seeding) ప్రక్రియకు, మన ప్రాచీన వేదాల్లోని ఈ ‘కరీరీ ఇష్టి’ విధానానికి దగ్గరి పోలికలు ఉన్నాయంటారు… క్లౌడ్ సీడింగులో మేఘాలపై సిల్వర్ అయోడైడ్ చల్లుతారు కదా, సేమ్, ఈ కరీర కాల్చిన పొగ అదే పనిచేస్తుందని ఓ సూత్రీకరణ…
2. వరుణ యాగం / పర్జన్య యాగం (Varuna Yagam / Parjanya Yagam) …
నిర్వచనం & స్వరూపం…: వర్షాధిపతి అయిన వరుణ దేవుడిని లేదా మేఘాలను సూచించే పర్జన్య దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే పెద్ద ఎత్తున జరిగే యాగం ఇది. ఇది శ్రౌత యాగాల పరిధిలోకి వస్తుంది.
ప్రత్యేకత…: ఇందులో కరీర వృక్షాన్ని ఉపయోగించాలనే కఠినమైన నిబంధన ఉండదు. బదులుగా, జలాశయాలలో నీటి మట్టాలు పెరగడానికి, వరుణ సూక్త పఠనంతో పాటు జలాధిపతికి ప్రీతికరమైన ద్రవ్యాలతో హోమాలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాలలో పెద్ద చెరువుల గట్లు మీద లేదా జలాశయాల మధ్యలో ఈ యాగం చేయడం ఆనవాయితీగా వస్తోంది…
ఆచరణ..: ఇది మరింత విస్తృతమైనది. దేశంలో లేదా ఆయా ప్రాంతాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలందరూ భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఆలయాల్లో లేదా నదీతీరాల్లో ఈ యాగాలను నిర్వహిస్తారు…

ఇవి గాకుండా అతిరాత్రం మరింత క్లిష్టమైంది… నిన్నటి యాగంలో రుత్విక్కులు ఎవరూ నల్ల బట్టలు ధరించలేదు… పసుపు, తెలుపు వస్త్రాలే ధరించారు… కరీర వృక్ష సంబంధ హోమ ద్రవ్యాల్ని వాడినట్టు కూడా లేదు… సో, ఇది కరీరి ఇష్టి కాదు, కేవలం మహా వరుణ యాగం మాత్రమే..!! ఏదైతేనేం అంటారా..? తేడా ఉంటుంది… చేసే పనిని నిర్దిష్ట / విహిత పద్ధతుల్లో చేస్తేనే ఫలితం కాబట్టి..!!
Share this Article