Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వారణాసిలో పెద్ద కర్మ ! తంతు అల్లాటప్పా ఏమీ కాదు, అదొక పరీక్ష !!

August 25, 2026 by M S R

.

ముందుగా ఓ చిన్న క్లారిటీ కమ్ డిస్‌క్లెయిమర్ ::: ఈ పోస్టు ఎందుకు షేర్ చేస్తున్నానో చెప్పాలి కాబట్టి… ప్యూర్ వ్యక్తిగతం కదానే ప్రశ్నకు జవాబు ఇవ్వాలి కాబట్టి… చాలామంది శ్రాద్ధ కర్మల్ని పంతుళ్లు చెప్పినట్టు  చేస్తారు, నిజానికి చాలామంది మామూలు వ్రతాలు, పూజలు చేయించే పంతుళ్లకు పెద్ద కర్మ బాపతు తంతు చేతకాదు, అదొక సిన్సియర్, సీరియస్ ఎఫర్ట్… మంత్రోచ్ఛారణ దగ్గర నుంచి తంతు పద్దతిగా చేయించడం వరకూ ఓ పరీక్ష…

సరిగ్గా చేయించకపోతే వాళ్లకే పాపం అనే భావన… అయితే గరుడ పురాణం ఆసాంతం చదివి, ఆకళింపు చేసుకుని, మరణించిన వారికి పద్దతిగా కర్మ చేయించడం, అదీ వారణాసిలో… అది మృతుడు చేసుకున్న పుణ్యమేమో… సరే, మిత్రుడు Nàgaràju Munnuru పోస్టు చూద్దాం ఓసారి…

Ads



Ps: హిందూ మతం మీద, శాస్త్రాలు, క్రతువుల మీద విశ్వాసం లేనివారు ఈ పోస్టుకు దూరంగా ఉండండి…

మా ప్రాంతంలో ఎవరైనా చనిపోతే 9వ రోజు లేదా 11వ రోజున పెద్ద కర్మ చేసి, చనిపోయిన వ్యక్తిని పెద్దల్లో కలుపుతారు. అయితే ఈ క్రవుతులో బ్రాహ్మణుడి మంత్రాలు, శాస్త్రీయ పద్ధతిలాంటివి పెద్దగా ఉండవు. పెద్దకర్మ రోజున కుటుంబం, వంశంలో మగవారు గుండు చేసుకోవడం, చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహారం వండి, సమాధి వద్ద పెట్టి, కాకి ముట్టడం చేయించడం, ఇంట్లో ఫోటో ముందు ఆహారం నైవేద్యంగా పెడతారు.

పెద్దకర్మ రోజున చనిపోయిన వ్యక్తి బంధువులు, కులస్తులు, స్నేహితులకు భోజనం పెట్టి పంపడం జరుగుతుంది. మా ఇళ్లలో అయితే పెద్దకర్మ రోజున మాంసాహారంతో పాటు మద్యం కూడా తప్పనిసరి. అది మా ప్రాంత సంస్కృతి…

మా తండ్రి బస్వరాజు ఈ నెల 16వ తేదీన మరణించాడు. అయితే మా తండ్రికి శాస్త్రం చెప్పిన విధంగా పవిత్ర కాశీ పుణ్య క్షేత్రంలో గంగానది ఒడ్డున పెద్దకర్మ చేయాలని అనుకుని నా కుటుంబం, మా చిన్న తమ్ముడితో కలిసి రెండు రోజులు కారులో ప్రయాణం చేసి కాశీకి చేరుకున్నాం. 1250 కిలోమీటర్లు దూరం నేనొక్కడినే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను.

9వ రోజునే మా ఇంటి వద్ద పెద్దకర్మ చేస్తున్న రోజునే కాశీలో నేను, మా సోదరుడితో కలిసి శాస్త్రోక్తంగా పెద్దకర్మ చేశాను. నిజానికి శాస్త్రం ప్రకారం తండ్రికి అంత్యక్రియలు, అపర కర్మలు చేసే అధికారం పెద్ద కొడుకుకే ఉంటుంది.

నిన్న ఉదయం కాశీలో కేదార్ ఘాట్ వద్ద శిరోముండనం చేసుకుని, గంగలో స్నానం ఆచరించి, వేద పండితుడి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా మా తండ్రికి పెద్దకర్మ నిర్వహించాను. మొత్తం క్రతువు పూర్తి చేయడానికి 4- 5 గంటల సమయం పట్టింది. నేను ఇదివరకే గరుడ పురాణం చదివి ఉండటం వలన మరణాంతరం ప్రేతానికి ఎదురయ్యే అనుభవాల గురించి అవగాహన ఉన్నప్పటికీ, పండితులను మంత్రాలు చదువుతున్నప్పుడు, క్రతువులు చేస్తున్నప్పుడు వాటి అర్థం, ఎందుకు చేస్తున్నాం, ఫలితం ఏమిటి అనేది వివరిస్తూ చేయించమని కోరాను.

  • జీవుడు మరణాంతరం బొటనవేలు పరిమాణంలో ఉన్న సూక్ష్మ శరీరం ధరిస్తాడు. దీనినే ప్రేత శరీరం అని  కూడా అంటారు. ఈ శరీరం సహాయంతోనే 12 రోజుల ప్రయాణంతో వైతరణి నది దాటి యమపురి చేరుకుంటుంది. జీవుడు భూమి మీద జీవించి ఉన్నప్పుడు చేసిన పాపపుణ్యాల ఆధారంగానే జీవుడికి స్వర్గం, నరకం వంటివి ప్రాప్తిస్తాయి. అయితే ఈ కర్మకాండలు, పిండ ప్రదానం వంటి క్రియలు గతించినవారికి వైతరణి నది దాటడానికి సహాయపడతాయి కానీ శాశ్వత స్వర్గలోకాలను ఇవ్వదు.

Final funeral in Varanasi

మా క్రతువు మొదలవడానికి ముందు ఒక విదేశీ వనిత ఇప్పుడు చేస్తున్నది ఏమిటని నన్ను అడిగింది. మరణాంతరం గతించిన వారికి చేసే అపర కర్మలు అని చెప్పాను. విదేశీ మత విశ్వాసం ప్రకారం ఎన్ని పాపాలు చేసినా కేవలం ఒక ప్రభువునో, ప్రవక్తనో నమ్ముకుంటే చాలు స్వర్గం గ్యారంటీ అంటారు. మరి చేసిన పాపాలకు ఫలితం గురించిన శిక్షల గురించిన భయం లేదు. కానీ హిందూ మతంలో ఏ మనిషైనా చేసిన పుణ్యం, పాపం వలన ఏర్పడే ఫలితాన్ని అనుభవించాలి.

కర్మ క్షయం అనేది అనుభవించడం ద్వారా లేదా గురు కృప ద్వారా మాత్రమే క్షయం అవుతుంది. చేసిన పాపపుణ్యాల ఆధారంగా అందుకు తగినంత కాలం స్వర్గంలో నరకంలో గడపాల్సి ఉంటుందని విదేశీ వనితకు చెప్పాను. చాలా క్లిష్ణమైన విషయాన్ని సులభంగా వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసి తన కెమెరాలో నా ఫోటో, నా పిల్లల ఫోటోలు తీసుకుంది.

ఇక క్రతువు విషయానికి వస్తే మరణించిన పెద్దలను మూడు రకాలుగా విభజించారు. వసువు, రుద్ర, ఆదిత్య. అందుకే అమావాస్య నాడు పెద్దలకు భోజనం పెట్టేప్పుడు వసురాయ, రుద్రాయ, ఆదిత్యాయ అని స్మరిస్తూ నమస్కరిస్తారు. ప్రస్తుతం గతించిన పెద్దలు ప్రేత రూపంలో ఉంటారు. ఈ అపర క్రియలు చేయడం ద్వారా వారికి ప్రేత రూపం నుండి విముక్తి లభించి వసు రూపం లభిస్తుంది. అలాగే అంతకు ముందు మరణించిన పెద్దలు వసు రూపం నుండి రుద్ర రూపంలోకి, రుద్ర రూపం వాళ్ళు ఆదిత్య రూపంలోకి వెళ్తారు.

పిండ ప్రదానం కొరకు నా చేతనే అన్నం వండించారు, కేశవ నామాలతో, తిలోదకాలతో ప్రేతాన్ని శిలలోకి ఆవాహన చేసి, నా తండ్రికి ప్రేత రూపం నుండి విముక్తి కలిగించి, వసు రూపంలోకి వెళ్ళేలా చేసే క్రతువు చేయించారు. దీనినే ప్రేత విమోచన క్రతువు అంటారు. అలాగే తాతకు, ముత్తాతకు, వారి తండ్రికి వసు రూపం నుండి రుద్ర, ఆదిత్య రూపాలకు మారే క్రియలు కూడా నిర్వర్తించారు. స్వయంపాకంగా వండిన అన్నంతో నా పూర్వీకులందరికీ పేరు పేరునా పిండ ప్రదానం చేయించి సద్గతులు కలగాలని అపర క్రియలు చేయించారు.

ఇక మా తండ్రికి వచ్చే 12 నెలలకు గాను నెల మాసికాలు, వాటికి సంబంధించిన స్నానాలు, పిండ ప్రదానాలు చేయించి బ్రాహ్మణులకు దానాలు, పేదలకు అన్న ప్రసాద వితరణ చేయించి, మొత్తం క్రతువును పూర్తి చేయించారు. ఇంటికి పెద్ద కొడుకుగా నేను ఈ అపర క్రియలు చేయడంతో నా పూర్వీకులకు ఉత్తమ లోకాలు, సద్గతులు కలగడమే కాకుండా నా తర్వాత పుట్టిన సోదరులు, కుమారులకు పితృదోష నివారణ జరిగింది.

ప్రస్తుతం ఇంకా మరణ శౌచం ఉన్నందున అపర క్రియల అనంతరం కూడా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునే భాగ్యం లేదు. సాయంత్రం కుటుంబ సమేతంగా అస్సి ఘాట్ లో నిర్వహించిన గంగా హారతి చూడటంతో మా కాశీ యాత్ర పూర్తయ్యింది…. – నాగరాజు మున్నూరు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వారణాసిలో పెద్ద కర్మ ! తంతు అల్లాటప్పా ఏమీ కాదు, అదొక పరీక్ష !!
  • ఇప్పుడు చెప్పండి… ఎవరు ఒప్పో… ఎవరు తప్పో… మీవల్ల కాదు !!
  • నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు ! ఈ సుందరి ఏమన్నదో తెలుసా ?
  • ఏయ్, తప్పు..! సాదిక్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేయకూడదు !!
  • నిజమే అనసూయా… అసలే సోషల్ మీడియాలో బికినీల కాలమిది !!
  • కంగనా అంటే అంతే ! Who Cares అంటూ రోజుకొకరికి ఇచ్చి పడేస్తోంది !
  • ఓహో… వన్ గ్రామ్ ఫ్రీ ఉంగరంపై మేనమామ రూపం అట !
  • ఆమె ఆమే ! రంభను తీసుకొచ్చినా రీప్లేస్ చేయలేరు ! అదే జరిగింది !!
  • యశస్వి జైస్వాల్ కథ కంచికేనా ? మీడియాలో బోలెడన్ని తీర్పులు !!
  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions