.
అర్హులై ఉండీ, ఈసారి లక్షల్లో వోటర్లు తమ వోటు హక్కు కోల్పోబోతున్నారు… పక్కా… ప్రత్యేకించి ఒంటరి వృద్ధులు, చదువు రానివాళ్లు, అటూ ఇటూ అద్దెకు తిరిగేవాళ్లు… అంతేకాదు, అన్నీ తెలిసిన తోపుల వోటు హక్కు కూడా గల్లంతు కాబోతోంది… ఇప్పటికీ నా డిమాండ్ మీద నిలబడే ఉన్నా… చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్‌రెడ్డికి కనీసం పద్మశ్రీ దక్కాల్సిందే…
ఎవరూ మీడియాలో వచ్చే స్టీరియోఫోనిక్ చెత్తాను చదివి మోసపోకండి… ఆ రాసేవాడికి ఫీల్డ్ రియాలిటీ తెలియదు… దీన్నే స్క్రాప్ జర్నలిజం అంటున్నారు… 2002 మ్యాపింగు, అప్పటి వోటర్ల లిస్టులో ఉన్నవాళ్లు ఆ వివరాలు ఇస్తేనే వోటు హక్కు అన్నారు కదా… అసలు ఆ లిస్టు ఎలా చూసుకోవాలో తెలియదు, అప్పటి నుంచి చాలాసార్లు చాలా నియోజకవర్గాలు, చాలా బూత్‌లు మారి ఉంటాం, మరెలా..,? ఎవడూ బీఎల్ఓ ఇంటికి రారు, రాలేదు…
Ads
చివరకు మీ-సేవ, జిరాక్స్ సెంటర్ల వాళ్లు కూడా చేతులెత్తేశారు… వృత్తి కార్మికులు, నెట్‌తో పరిచయం లేనివాళ్లు, పేదలు, నిరక్షరాస్యులు, పనివాళ్లు ఏమీ అర్థం గాక వదిలేశారు చాలామంది… పోలింగ్‌కు ముందు ఒక్కొక్క వోటు వేల రూపాయలు ఇస్తూ, మధ్యలో దళారులు దండుకుంటూ ఉంటారు కదా… ఒక్కడంటే ఒక్క పార్టీ బీఎల్ఏ కనిపిస్తే ఒట్టు…
అందరిలోనూ ఓ భ్రమ… ఇదంతా బీజేపీ కోసం ఉద్దేశించిన ప్రక్రియ అని… చెత్తా అవగాహన… మంచి బేస్ ఉన్న హైదరాబాదులో ఈ కంగాళీ ప్రక్రియ, పార్టీ నిర్లక్ష్యం కారణంగా బాగా నష్టపోబోతున్నది ఆ పార్టీయే… తరువాత బీఆర్ఎస్, కాంగ్రెస్… ఇన్ని లక్షల వోట్లు పోతాయా అని మీనాక్షి నటరాజన్ ఆశ్చర్యపోయినంత మాత్రాన పరిస్థితి ఏమీ మారదు… గతంలో ఇలాంటి సందర్భాల్లో కనిపించే లెఫ్ట్ కూడా హేండ్సప్…
ఇప్పుడు డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు కదా… మనమే చెక్ చేసుకోవాలి… ఎవడూ ఇంటికి నోటీసు ఇవ్వడానికి రాడు, ఏ వినాయక మంటపంలోనో, ఏ కమ్యూనిటీ హాల్లోనో కూర్చుంటారు, తెలిస్తే వెళ్లి అడగాలి, వాడి దయ, మన ప్రాప్తం… అక్షరాలా నా అనుభవం నా ఎదుట 800 నోటీసులున్న కట్టలు ఇచ్చి చెక్ చేసుకొమ్మని చెప్పాడు…
ఇక్కడ ఓ ట్విస్టు… డ్రాఫ్టులో పేరుంటే ఇక మన వోటు ఎటూ పోదు అని భ్రమపడకండి… మీకూ నోటీసు వస్తుంది, 2002తో మ్యాపింగ్ కానివాళ్లకు కంపల్సరీ నోటీసు… మళ్లీ ఏదో ధ్రువీకరణ, వీలైనంతవరకూ బర్త్ సర్టిఫికెట్, టెన్త్ మెమో లేదా పాస్‌పోర్టు ఎట్సెట్రా… గుర్తుంచుకొండి, ఆధార్ కార్డు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు ఈ ప్రక్రియలో…
సరే, ఏదో ఇచ్చాం, కానీ లక్షల వోట్లు ASDD లిస్టులో పడ్డాయి… అది చెక్ చేసుకోవడంకన్నా ఆయుత చండీయాగం సులభం… అంటే చనిపోయినవాళ్లు, అడ్రెస్ మారినవాళ్లు, వలసపోయినవాళ్లు ఎట్సెట్రా లిస్టు… ఇందులో ఉంటే మరో పారం ఇస్తారు, నింపి ఇవ్వాలి, ఇంకా ట్విస్టు ఏమిటంటే..? లక్షల మంది డ్రాఫ్టులో లేరు, ఈ ఏఎస్‌డీడీ లిస్టులోనూ లేరు… డిలిటెడ్… Not Found అని వస్తుంది మీరెన్నిసార్లు చెక్ చేసినా..!
మరేం చేయాలని అడిగితే… ఫారమ్ 6 ఇస్తాడు… అంటే కొత్తగా వోటు హక్కు కోసం దరఖాస్తు… అడ్రెస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ కంపల్సరీ… బర్త్ సర్టిఫికెట్, టెన్త్ మెమో, కరెంట్ బిల్లు, పాస్‌పోర్టు గట్రా ఇవ్వాలి… ఐనా లిస్టులోకి వస్తామా అనేది మళ్లీ సుదర్శన్ రెడ్డి దయ, మన ప్రాప్తం…
ఇంకా ఉంది… చాలామంది విదేశాలకు వెళ్లారు కొలువుల కోసం… వాళ్లు ఏం చేయాలో చెప్పేవాడు ఉండడు… ఆన్లైన్లో చేసుకొండి అని చెబుతారు… అంతకుముందు ఏ పోలింగ్ బూతో తెలియదు, అవి తరచూ మారుతూ ఉంటాయి.,. ఆ లిస్టుల్లో చెక్ చేసుకోవడంకన్నా రాజశ్యామలయాగం సులభం… పైగా వోటరుగా ఉండకపోతే రేప్పొద్దున భారతీయ పౌరుడివే కావు సుమా అనే దుష్ప్రచారాలు…
ఎస్, వోటర్ల లిస్టుల ప్రక్షాళన కంపల్సరీ జరగాల్సిందే… కానీ ఇంత సంక్లిష్టంగా, ఇంత దరిద్రంగా ఉండకూడదు… నాముందు ఒకాయన వచ్చాడు, నేను లాయర్‌ను, సతాయిస్తే కేసు పెడతాను అన్నాడు… బీఎల్ఓకు తిక్కరేగింది, అసలే చెత్తా ప్రక్రియతో రోజూ వాళ్లకు తలనొప్పి… అక్కడ మమత స్వయంగా కేసు వాదిస్తేనే సుప్రీంకోర్టు ఫోఫోవమ్మా అనేసింది, వెళ్లి సుప్రీంలో కేసు పెట్టుకో, నా నంబర్ ఇదీ, నా పేరు ఇదీ అని వ్యంగ్యం దట్టించి కొట్టాడు… సదరు లాయరుడు కిక్కుమంటే ఒట్టు… ఇదండీ ఓ బేకార్ ప్రక్రియ తీరూతెన్నూ..!!
Share this Article