.
ఠాట్, మేం అధికారంలోకి రాగానే, రేవంత్ రెడ్డి కలలు కంటున్నా ఆ ఫ్యూచర్ సిటీని రద్దు చేసి పారేస్తాం అన్నాడు కదా ముఖ్యమంత్రి కావాలనీ, తనదే నిర్ణయాధికారం కావాలని పదే పదే బలంగా కోరుకుంటున్న హరీష్ రావు…! జనానికి మొహం చూపించలేని కేసీయార్ స్థానంలో తన నిర్ణయాలే ఫైనల్ అనీ భావిస్తున్నట్టు ఉన్నాడు కదా..!
కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉన్న The Economist వంటి పత్రిక హరీష్ రావు ఆలోచించిన పేద్ద స్థాయిలో ఆలోచించలేదు కదా పాపం… అదేమో హైదరాబాద్ భావి ప్రణాళికలను ప్రశంసిస్తోంది… ప్చ్, తెలంగాణకు శాపమో వరమో గానీ ఒక కేసీయార్ పేద్ద ఇంజినీర్ అయిపోయి కాళేశ్వరం కట్టేస్తాడు, ఒక హరీష్ రావు పేద్ద ఎనకమిస్ట్ అయిపోయి ఫ్యూచర్ సిటీ రద్దు చేసేస్తానంటుంటాడు… మూసీకి, మెట్రో విస్తరణకూ అడ్డంకులే…
Ads
అసలు ది ఎకనమిస్ట్ పత్రిక ఏమంటున్నది..? రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ‘తెలంగాణ రైజింగు’కు ఓ అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందా..? ఓసారి వివరాల్లోకి వెళ్దాం.,. హరీష్ రావు చదివితే మరీ బెటర్… రేవంత్ రెడ్డి చదివి తన ప్రణాళికలకు మరింత బలంగా పదును పెట్టి, తన ఆలోచనలపై స్థిరంగా నిలబడితే మరీ మరీ బెటర్…

హైదరాబాద్ అభివృద్ధి గురించి రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రశ్నించొచ్చు. మెట్రో విస్తరణ సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తం చేయొచ్చు. ఫ్యూచర్ సిటీని రాజకీయ ప్రచారంగా కొట్టిపారేయొచ్చు. అవన్నీ ఒక ఎత్తు.
కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉన్న The Economist వంటి పత్రిక హైదరాబాద్ పట్టణాభివృద్ధి విధానాన్ని ప్రస్తావించి, ఇతర భారతీయ నగరాలు కూడా దాని నుంచి నేర్చుకోవచ్చని చెప్పడం మాత్రం మరో ఎత్తు. అందుకే ఇప్పుడు చర్చ మొదలైంది.
ఇంతకీ ది ఎకనమిస్ట్ హైదరాబాద్ గురించి ఏమంది?
రేవంత్ రెడ్డి దానిని ఎందుకు ఇంతగా ప్రస్తావిస్తున్నారు?
ఇది నిజంగా ‘తెలంగాణ రైజింగ్’కు అంతర్జాతీయ గుర్తింపేనా?
అసలు ది ఎకనమిస్ట్ చెప్పిన విషయం ఏమిటి? చాలా సింపుల్‌గా చెప్పాలంటే… నగరాలు పెరిగేకొద్దీ వాటికి ఒక సమస్య వస్తుంది. జనాభా పెరుగుతుంది. ఉద్యోగాలు పెరుగుతాయి. కంపెనీలు వస్తాయి. ఇళ్ల అవసరం పెరుగుతుంది. అప్పుడు నగరానికి రెండు మార్గాలుంటాయి.
ఒకటి – అడ్డంగా లేదా ఓ సర్కిల్లాగా విస్తరించడం, పెరగడం. నగరం చుట్టూ మరింత భూమిని ఆక్రమిస్తూ కొత్త కాలనీలు, కొత్త శివారు ప్రాంతాలు ఏర్పడతాయి. రెండోది – నిలువుగా పెరగడం. అదే భూమిలో ఎక్కువ మందికి నివాసం, కార్యాలయాలు కల్పించడానికి ఎత్తైన భవనాలు నిర్మించడం. ఇక్కడే FSI అనే విషయం వస్తుంది. అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్…
FSI అంటే ఒక స్థలంలో ఎంత ఫ్లోర్ స్పేస్ నిర్మాణం చేయడానికి అనుమతిస్తారన్నదానికి సంబంధించిన నిబంధన. FSI పరిమితులు తక్కువగా ఉంటే అదే స్థలంలో ఎక్కువ అంతస్తులు నిర్మించడం కష్టం. ఫలితంగా నగరం చుట్టూ మరింత విస్తరించాల్సి వస్తుంది.
అంటే… తక్కువ FSI – ఎక్కువ horizontal growth. ఎక్కువ నిర్మాణ అవకాశాలు – ఎక్కువ vertical growth. హైదరాబాద్ ఈ రెండో మార్గాన్ని ఎంచుకుంది. అందుకే ఇప్పుడు కోకాపేట, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు చూస్తే కనిపించే భారీ టవర్లు కేవలం రియల్ ఎస్టేట్ బూమ్ కాదు. ఒక పట్టణ విస్తరణ ప్రణాళికలు, విధానానికి కూడా అవి ఫలితం.
రేవంత్ రెడ్డి కూడా The Economist కథనాన్ని ప్రస్తావిస్తూ ఇదే విషయాన్ని చెబుతున్నాడు. హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అత్యంత ఆసక్తికరమైన నగరంగా పత్రిక పేర్కొన్నదని, ఇతర రాష్ట్రాలు కూడా హైదరాబాద్ అనుసరించిన విధానాల నుంచి నేర్చుకోవచ్చని అన్నాడు…

కానీ హైదరాబాద్ ఒక్క రోజులో ఇలా తయారైందా? ఇక్కడే అసలు రాజకీయ కథ మొదలవుతుంది. హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారు? ఈ ప్రశ్నకు తెలంగాణ రాజకీయాల్లో పార్టీని బట్టి వేర్వేరు సమాధానాలు వస్తాయి. కానీ నగర అభివృద్ధికి చరిత్రలో ఒక్క ప్రభుత్వానికే మొత్తం క్రెడిట్ ఇవ్వడం సాధ్యం కాదు.
హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి రెండు దశాబ్దాలుగా సాగిన అనేక నిర్ణయాలు కారణం. ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో చేపట్టిన కొన్ని భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు కొత్త హైదరాబాద్‌కు పునాదులు వేశాయి.
ఔటర్ రింగ్ రోడ్.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
ఐటీ రంగానికి విస్తరణ.
ఫార్మా పరిశ్రమల పెరుగుదల.
పట్టణ నిర్మాణ నిబంధనల్లో మార్పులు.
వీటిలో కొన్ని నిర్ణయాల ప్రభావం అప్పట్లో పూర్తిగా కనిపించకపోయినా, తర్వాతి సంవత్సరాల్లో వాటి విలువ బయటపడింది. రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పేది కూడా అదే.
“మా ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్‌కు కొన్ని పునాదులు వేశాయి. ఇప్పుడు మేము వాటిపై మరో దశ అభివృద్ధిని నిర్మిస్తున్నాం” అన్నది తన వాదన. తను ప్రస్తావించిన పాత నిర్ణయాల్లో ORR, FSI పరిమితుల తొలగింపు, విమానాశ్రయం, ఐటీ-ఫార్మా రంగాల అభివృద్ధి ఉన్నాయి. కొత్త దశగా మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, RRR వంటి ప్రాజెక్టులను తను అనుసంధానిస్తున్నాడు…
ఇందులో FSI ఎందుకు అంత ముఖ్యమైంది? ఇది సాధారణ పాఠకుడికి అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చాలు. ఒక నగరంలో ఉద్యోగాలు ఒకే ప్రాంతంలో పెరుగుతున్నాయనుకోండి. అక్కడ ఇళ్లు కట్టడానికి మాత్రం పరిమితి ఉంటే ఏం జరుగుతుంది? ప్రజలు నగరానికి బయటికి వెళ్లి ఇళ్లు కట్టుకుంటారు. ఉద్యోగానికి మాత్రం మళ్లీ నగరంలోకి రావాలి.
అంటే రోజూ ప్రయాణం. అక్కడి నుంచి ట్రాఫిక్. ట్రాఫిక్ నుంచి మరిన్ని రోడ్లు. రోడ్లతో పాటు డ్రైనేజీ. నీటి పైపులు. విద్యుత్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అన్నింటినీ మరింత దూరం వరకు తీసుకెళ్లాలి. అందుకే పట్టణ ప్రణాళికలో “నగరం ఎంత విస్తరించాలి?” అనే ప్రశ్నతో పాటు “ఇప్పటికే ఉన్న భూమిని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవాలి?” అనే ప్రశ్న కూడా చాలా ముఖ్యమైనది.
హైదరాబాద్ ఇక్కడ ఒక ప్రయోగం చేసింది. నగరాన్ని కేవలం అడ్డంగా కాకుండా నిలువుగా కూడా పెరగనిచ్చింది. దాని ఫలితమే ఇప్పుడు పశ్చిమ హైదరాబాద్ skyline. అయితే… ఎత్తైన భవనాలు ఉంటేనే ప్రపంచస్థాయి నగరమా? కచ్చితంగా కాదు. ఇదే అసలు మేటర్.
ఒక 60 అంతస్తుల భవనం నిర్మించడం నగర ఆర్థిక శక్తికి సూచిక కావచ్చు. కానీ ఆ భవనంలో నివసించే వ్యక్తి రోజూ ఆఫీసుకు వెళ్లడానికి రెండు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే? అది ప్రపంచ స్థాయి నగరం కాదు. వందల అపార్టుమెంట్లు కట్టారు. కానీ నీటి సరఫరా సరిపోకపోతే? అది sustainable growth కాదు.
కొత్త కొత్త టవర్లు వచ్చాయి. కానీ చెరువులు కాపాడలేకపోయి ప్రతి భారీ వర్షానికి కాలనీలు మునిగితే? ఆ skyline చూసి గర్వపడటానికి అర్థం ఉండదు. అందుకే హైదరాబాద్ ఇప్పుడు ఎదుర్కొంటున్న అసలు పరీక్ష ఎన్ని అంతస్తులు కట్టింది? అన్నది కాదు. ఎంత మంచి నగరాన్ని నిర్మించింది? అన్నదే.

ఇక్కడే రేవంత్ రెడ్డి ‘నెక్స్ట్ హైదరాబాద్’ గురించి మాట్లాడుతున్నాడు… రేవంత్ రెడ్డి తన ‘Telangana Rising’ విజన్‌లో హైదరాబాద్‌ను కేవలం రియల్ ఎస్టేట్ నగరంగా కాకుండా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని చెబుతున్నాడు…
తన మాటల్లో హైదరాబాద్ … Bluest. Greenest. Fastest. Healthiest. Sportiest. అంతేకాదు, ప్రపంచస్థాయి జ్ఞాన, విద్యా కేంద్రంగా కూడా ఎదగాలన్నది లక్ష్యం. అధికారిక ‘Hyderabad Rising’ విజన్‌లో హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ నగరాల సరసన నిలపడం, భారీ ఆర్థిక లక్ష్యాలు, Net Zero వంటి లక్ష్యాలను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇందులో మూసీ ఒక భాగం. మెట్రో విస్తరణ మరో భాగం. RRR మరో భాగం. ఫ్యూచర్ సిటీ మరో భాగం. అంటే ఒక్కో ప్రాజెక్టును విడివిడిగా చూడకుండా రాబోయే 20- 30 ఏళ్ల హైదరాబాద్‌ను ఇప్పుడే ప్లాన్ చేయాలన్నది ఈ ఆలోచనలోని ప్రధాన అంశం. చెరువుల రక్షణ- అభివృద్ధి, అక్రమ కట్టడాల కూల్చివేత, కాలుష్య పరిశ్రమల తరలింపు (హిల్ట్), మూసీ పునరుజ్జీవం, కొత్తగా భవిష్యత్తు ఆధునిక అవసరాల కోసం ఓ ఫ్యూచర్ సిటీ… అన్నీ ఓ సమగ్ర ప్రణాళికలో భాగాలే…
అయితే మూసీ సంగతేంటి? ఇక్కడ ప్రభుత్వానికి పెద్ద పరీక్ష ఉంది. మూసీ పునరుజ్జీవనం పేరుతో ప్రజలను తరలిస్తే వారికి న్యాయం జరగాలి. పునరావాసం సరిగ్గా ఉండాలి. పర్యావరణ ప్రమాణాలు పాటించాలి. ప్రజాధనం ఎక్కడ ఖర్చవుతోంది అన్నది పారదర్శకంగా ఉండాలి. అభివృద్ధి అంటే ప్రజలను పక్కకు నెట్టేయడం కాకూడదు.
ప్రజల కోసం చేసే అభివృద్ధిలో ప్రజలే నష్టపోతే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. అదే Future City విషయంలోనూ వర్తిస్తుంది. కొత్త నగరం నిర్మించడం గొప్ప ఆలోచనే కావచ్చు. కానీ అది ఎవరి కోసం? ఎలా? ఎంత ఖర్చుతో? ఎంత భూమిపై? ఎలాంటి పర్యావరణ ప్రమాణాలతో? ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తుంది? ప్రస్తుత హైదరాబాద్‌పై ఒత్తిడి ఎంత తగ్గిస్తుంది? ఇవన్నీ సమాధానం కావాల్సిన ప్రశ్నలు.

అందుకే ది ఎకనమిస్ట్ ప్రశంసను రెండు విధాలుగా చూడాలి… ఒకటి , ఇది హైదరాబాద్‌కు వచ్చిన మంచి అంతర్జాతీయ గుర్తింపు… రెండోది, అదే సమయంలో ఇది ఒక పెద్ద పరీక్ష కూడా. ఎందుకంటే ఎత్తైన భవనాలు కట్టడం సులభం కావచ్చు. ఒక నగరాన్ని నివసించడానికి మంచి నగరంగా మార్చడం మాత్రం అంత సులభం కాదు.
రోడ్లు ఉండాలి. మెట్రో ఉండాలి. నీరు ఉండాలి. డ్రైనేజీ ఉండాలి. చెరువులు ఉండాలి. పచ్చదనం ఉండాలి. ఉద్యోగాలు ఉండాలి. అందుబాటు ధరల్లో ఇళ్లు ఉండాలి. ప్రజా రవాణా బలంగా ఉండాలి. అన్నింటికంటే సాధారణ మనిషి జీవితం సులభం కావాలి. అదే నిజమైన నగరాభివృద్ధి.
హైదరాబాద్ ఎవరి ప్రభుత్వం వచ్చిందో దాని ప్రకారం ప్రతిరోజూ రూపం మార్చుకోదు. ఒక ప్రభుత్వం వేసిన పునాదులపై మరో ప్రభుత్వం నిర్మిస్తుంది. వైఎస్ తరువాత ఆగిపోయిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి మళ్లీ పట్టాలు ఎక్కిస్తున్నాడు… రేవంత్ రెడ్డి ఇప్పుడు చెబుతున్న ORR–Airport–IT–Pharma నుంచి Metro–Musi–RRR–Future City వరకు ఉన్న లింక్‌ను అర్థం చేసుకోవాలి…!!
... కేసీయార్‌ను వదిలేయండి... కానీ ఇదే కేటీయార్, ఇదే హరీష్ రావు, రాబోయే 20-30 ఏళ్ల కాలానికి నగరాభివృద్ధిపై తమ ఆలోచనలు, తమ ప్రణాళికలు ఏమిటో ఎప్పుడైనా చెప్పారా..? లేక రేవంత్ రెడ్డి కాళ్లల్లో కట్టెలు పెట్టడమే పనా..?!
Share this Article