.
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చారిత్రక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి… హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో జోధ్‌పూర్‌తో హైదరాబాద్‌కు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించిన షెకావత్.. నిజాం వ్యతిరేక పోరాటం, హైదరాబాద్ విమోచనంలో తమ సైన్యం పాత్ర గురించి మాట్లాడాడు.
హైదరాబాద్ విముక్తి పోరాటంలో తమకూ భాగం ఉందనీ, ఆ ప్రతినిధిగానే ఇక్కడికి హాజరయ్యాననీ చెప్పుకొచ్చాడు… తెలంగాణ సాయుధ పోరాటంలో జోధ్‌పూర్ సైనికుల పాత్ర ఏమిటబ్బా అని కాసేపు అర్థం కాలేదు… తన మాటల్లోని అంతరార్థం వేరని తరువాత తెలిసింది… హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన ఆపరేషన్ పోలోలో జోధ్‌పూర్ సైన్యం కూడా పాల్గొంది అని..! (జోధ్‌పూర్ ప్రతినిధిని అని చెప్పుకున్నాడు కదా, ఆయన జోధ్‌పూర్ ఎంపీ… అదీ ఈ లింకు)…
Ads
రెండు వేర్వేరు పోరాటాలను విడదీయాలి… తెలంగాణ సాయుధ పోరాటం వేరు.. ఆపరేషన్ పోలో వేరు… తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానంగా 1946 నుంచి 1951 వరకు సాగిన రైతాంగ సాయుధ ఉద్యమం… నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన రైతాంగ సాయుధ తిరుగుబాటు అది… గ్రామాల్లో గెరిల్లా దళాలు ఏర్పడి, నిజాం సైన్యం, రజాకార్లతో పాటు దోపిడీ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం సాగింది…
ఇక ఆపరేషన్ పోలో పూర్తిగా వేరే పరిణామం… భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం వెంటనే భారత యూనియన్‌లో విలీనం కాలేదు… నిజాం హైదరాబాద్‌ను స్వతంత్రంగా కొనసాగించాలనే ప్రయత్నం చేశాడు…
రజాకార్ల కార్యకలాపాలు, అంతర్గత అశాంతి, భారత యూనియన్‌లో విలీనం ప్రశ్నపై ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో ప్రారంభించింది… సెప్టెంబర్ 17న నిజాం కాల్పుల విరమణ ప్రకటించగా, సెప్టెంబర్ 18న హైదరాబాద్ సైన్యాధిపతి మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ భారత సైన్యానికి లొంగిపోయాడు…
అంటే తెలంగాణ సాయుధ పోరాటం 1946లోనే మొదలైంది… ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్‌లో జరిగింది… రెండింటి లక్ష్యాలు, నాయకత్వం, స్వరూపం కూడా ఒకటే కావు…
మరి జోధ్‌పూర్ సైన్యం ఎక్కడ వచ్చింది? ఇక్కడే షెకావత్ వ్యాఖ్యకు చారిత్రక ఆధారం కనిపిస్తుంది… ఆపరేషన్ పోలోలో భారత సైన్యం హైదరాబాద్‌ను నాలుగు వైపుల నుంచి ముట్టడించింది… పశ్చిమం నుంచి ప్రధాన దాడి జరగగా, ఉత్తరం, తూర్పు, దక్షిణం వైపుల నుంచి కూడా దళాలు ముందుకు కదిలాయి…
ఉత్తర దిశ నుంచి హైదరాబాద్ వైపు కదిలిన దళాల్లో 18 Cavalry తో పాటు 2 Jodhpur, 7/2 Punjab, 3 Sikh దళాలు ఉన్నాయి… ఇది సాధారణ ఊహ కాదు… ఆపరేషన్ పోలోపై వివరించిన సైనిక రికార్డుల్లో నమోదైన విషయం…

ఇంకా ఆసక్తికరమైన విషయం జల్నా వద్ద జరిగింది… అక్కడ 3 Sikh, 2 Jodhpur Infantry కి చెందిన ఒక కంపెనీ, 18 Cavalry కి చెందిన ట్యాంకులు కలిసి హైదరాబాద్ దళాల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి… అంటే జోధ్‌పూర్‌కు చెందిన సైనికులు కేవలం పేరుకే ఆపరేషన్‌లో ఉన్నారనడం కూడా సరైంది కాదు… వారు సైనిక చర్యలో భాగంగా ఉన్నారు…
కానీ ఇక్కడ మరో గందరగోళం ఉంది! షెకావత్ తన ప్రసంగంలో జోధ్‌పూర్ లాన్సర్స్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు… హైదరాబాద్ విమోచన పోరాటంలో జోధ్‌పూర్ లాన్సర్స్ సైనికుల ధైర్యసాహసాలను ఆయన గుర్తు చేసినట్టుంది… కానీ..?
చరిత్రలో ప్రసిద్ధి చెందిన Jodhpur Lancers కు ఉన్న గొప్ప సైనిక వారసత్వం ప్రధానంగా మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించినది… 1918లో పాలస్తీనాలో జరిగిన హైఫా యుద్ధంలో జోధ్‌పూర్ లాన్సర్స్ కీలక పాత్ర పోషించారు… స్వాతంత్ర్యం తర్వాత పాత సంస్థానాల దళాలు పునర్వ్యవస్థీకరించబడగా, జోధ్‌పూర్, మైసూర్, హైదరాబాద్, గ్వాలియర్ తదితర సంస్థానాల కవల్రీ సంప్రదాయాలు తరువాత 61st Cavalry లో కలిశాయి…
అందువల్ల “Jodhpur Lancers” అనే పేరును 1948 ఆపరేషన్ పోలోలో పాల్గొన్న “2 Jodhpur Infantry”తో నేరుగా సమానం చేయడం సరికాదు… ఇది చాలా ముఖ్యమైన తేడా… ఆపరేషన్ పోలోలో ఇండియన్ ఆర్మీలోని చాలా దళాలు పాల్గొన్నాయి… ఉత్తరం నుంచి 18 Cavalry, 2 Jodhpur, 7/2 Punjab, 3 Sikh.. తూర్పు నుంచి 2/5 Gorkha Rifles, 6 JAT, 6 Kumaon తదితర దళాలు.. దక్షిణం నుంచి 5/5 Gorkha Rifles, Mysore Lancers, 1 Mysore Infantry ముందుకు కదిలాయి…
భారత సైనిక చర్యలో జోధ్‌పూర్ దళం కూడా ఒక భాగం… అంతే… హైదరాబాద్ విమోచన చరిత్రలో జోధ్‌పూర్‌కు ఒక అధ్యాయం ఉంది… కానీ ఆ అధ్యాయం పేరు తెలంగాణ సాయుధ పోరాటం కాదు — ఆపరేషన్ పోలో…
Share this Article