Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!

October 9, 2026 by M S R

.

మీకో సీన్ గుర్తుందా..? రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం ప్రకాశ్ రాజ్‌ను గూబ గుయ్‌మనిపిస్తాడు… నువ్వొక చెత్త నటుడివిరా, మనిషిగా అంతకన్నా నీచుడివిరా… అంటాడు కోపంతో… ఇదెందుకు గుర్తొచ్చిందంటే…. నానా పటేకర్ మరణం తరువాత అనేక కథనాలు చదువుతుంటే…

ఒక ఓంపురి, ఒక నసీరుద్దీన్ షా, ఒక నానా పటేకర్… ఇలా బాలీవుడ్‌లో నటనను కొత్త ఎత్తులకు తీసుకుపోయిన నటులున్నారు… కానీ సౌత్‌లో..? లేరని కాదు, కానీ బాలీవుడ్ అలాంటి నటులకు తగిన పాత్రలిచ్చింది… వాడుకుంది… వాళ్ల నుంచి నటనను పిండుకుంది… కానీ మనం..?

Ads

వాళ్లతో పోలిస్తే దిగదుడుపు నటులను నెత్తిన మోశాం, కిరీటాలు పెట్టాం అనిపిస్తుంది… అందులో ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నాడు… ఎస్, ప్రకాశ్ రాజ్ వ్యక్తిగా ఏమిటనేది పక్కన పెడితే, నటుడిగా కాస్త మెరిట్ ఉన్నవాడే… డౌట్ లేదు, కానీ పైన చెప్పిన ఉదాహరణలతో పోలిస్తే..? ప్చ్, దిగదుడుపే… అంతెందుకు..? నానా పటేకర్‌తోనే పోలిస్తే… రెండు సినిమాలు- రెండు పాత్రలు… నానా పటేకర్ ఎదుట ప్రకాశ్ రాజ్ తేలిపోతాడు, కాదు, తేలిపోయాడు…

నటుడు అంటే ఎవరు? నాలుగు డైలాగులు గంభీరంగా చెప్పాలి.. కళ్లలో నీళ్లు తెప్పించాలి.. కోపం వస్తే గట్టిగా అరిచేయాలి.. అంతేనా? అలా అయితే మన దగ్గర గొప్ప నటులకు కొదవే ఉండదు! కానీ ఒకసారి మన ప్రాంతీయ అభిమానాన్ని పక్కనపెట్టి.. భారతీయ నటన మొత్తాన్ని ఒకే త్రాసులో వేసి చూస్తే మాత్రం అసలు లెక్క కొంచెం వేరుగా కనిపిస్తుంది.

ఓంపురి.. నసీరుద్దీన్ షా.. నానా పాటేకర్… వీళ్లను చూసిన తర్వాత నాకు తరచూ ఒక అనుమానం వస్తుంది… మన వాళ్లను మనమే కాస్త ఎక్కువగా లేపేశామేమో!

ప్రకాశ్ రాజ్ మంచి నటుడు కాదని నేను చెప్పడం లేదు… ఎన్నో పాత్రలు బాగానే చేశాడు… కానీ మరీ మనం మోసినంత, మోస్తున్నంత గొప్పగా ఏమీ కాదు… చాలా డైలాగుల డెలివరీలో మొనాటనీ ఉంటుంది… ఇది నా అభిప్రాయం… ఎవరైనా ఒప్పుకోవచ్చు… ఒప్పుకోకపోవచ్చు… కానీ నా అభిప్రాయానికి రెండు సినిమాలు బలమైన ఉదాహరణలు…

‘రంగమార్తాండ’లోనే తేడా కనిపించింది! మరాఠీలో నానా పటేకర్ చేసిన ‘నటసమ్రాట్’ పాత్రను తెలుగులో ప్రకాశ్ రాజ్ చేశాడు… ప్రకాశ్ రాజ్ బాగానే చేశాడు… కానీ ముందుగా నానా పటేకర్ చేసిన నటసమ్రాట్‌ను చూసినవాళ్లకు మాత్రం ఒక ఇబ్బంది ఉంటుంది… ప్రకాశ్ రాజ్ నటన స్థాయి నానా పటేకర్ నటన ఎదుట వెలవెలబోతుంది…

ఎందుకంటే నానా పటేకర్ అక్కడ నటించలేదు. ఆ వృద్ధ నటుడిగా బతికేశాడు. గొంతులో వణుకు.. కళ్లలో వెలితి.. తన వాళ్లే తనను పట్టించుకోని దుఃఖం.. గౌరవం కోసం తపించే ఆత్మగౌరవం.. చివరికి అన్నీ కోల్పోయిన మనిషి నిస్సహాయత.. నానా ఇవన్నీ చూపించడు. మనకు అనుభవింపజేస్తాడు.

ప్రకాశ్ రాజ్ పాత్రలో నటించాడు… కానీ నానా పటేకర్ ఆ పాత్రలో కలిసిపోయాడు… పరకాయ ప్రవేశం చేశాడు… జీవించాడు… అక్కడే తేడా…

prakash raj

‘అంతఃపురం’కు ‘శక్తి’ అద్దం పట్టినప్పుడు… ఇది ఇంకా పెద్ద ఉదాహరణ… ‘అంతఃపురం’లో ప్రకాశ్ రాజ్ చేసిన శివాజీ పాత్ర ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయి. ఆ పాత్రకు ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు… కానీ అదే పాత్రను హిందీలో ‘శక్తి’లో నానా పటేకర్ చేసిన తీరు చూస్తే… అబ్బురం…

ప్రకాశ్ రాజ్ దగ్గర విలనిజం ఉంది… నానా పటేకర్ దగ్గర విలనిజంతో పాటు ఒక రకమైన భయంకరమైన పిచ్చి ఉంది… ప్రకాశ్ రాజ్ కోపంగా చూస్తే విలన్ కనిపిస్తాడు. నానా పటేకర్ నిశ్శబ్దంగా చూస్తేనే.. “ఇతను ఏం చేయబోతున్నాడో?” అనే భయం మొదలవుతుంది. అదే అసలు నటనా తీవ్రత. నానా పటేకర్ అరుపు కూడా ఒక ఆయుధమే. ఆయన కళ్ల చూపు మరో ఆయుధం. ఆయన బాడీ లాంగ్వేజ్ ఇంకో ఆయుధం.

ఆయన ఎప్పుడు పేలుతాడో ప్రేక్షకుడికే కాదు.. సన్నివేశంలో ఉన్న మనిషికీ తెలియదు. అలాంటి అనిశ్చితిని సృష్టించడం అంత సులభం కాదు. ఓంపురి, నసీరుద్దీన్ దగ్గర ఇంకో మాయ ఉంటుంది.. ఓంపురిని చూస్తే ఆయన నటిస్తున్నాడనే విషయం మర్చిపోతాం. నసీరుద్దీన్ షాను చూస్తే “ఈ సీన్‌ను ఎలా చేశాడో!” అనే ఆలోచన కంటే.. “ఆ మనిషి ఇలానే ఉంటాడేమో!” అనిపిస్తుంది.

అదే లెజెండరీ నటుడి లక్షణం. నటుడు కనిపించకూడదు. పాత్ర కనిపించాలి. మన దగ్గర మాత్రం ఒక్కోసారి నటుడు పాత్ర కంటే పెద్దవాడైపోతాడు. “అబ్బా.. ప్రకాశ్ రాజ్ ఎంత బాగా చేశాడు!” అనే ఆలోచన మనకు వస్తుంది. కానీ ఓంపురి, నసీరుద్దీన్, నానా పటేకర్‌ల దగ్గర.. “అతను నటిస్తున్నాడు” అనే ఆలోచనే రాదు. అక్కడ మనం పాత్రను చూస్తాం. మనిషిని చూస్తాం. అతని బాధను చూస్తాం. అతని భయాన్ని అనుభవిస్తాం.

అదే తేడా. మనం ‘ఇంటెన్స్’ అనే పదాన్ని కూడా చౌక చేసేశామా? ఇప్పుడెవరైనా గట్టిగా అరుస్తే.. “వావ్.. ఏ ఇంటెన్స్ యాక్టింగ్!” అంటాం. కళ్లను పెద్దవి చేసి చూస్తే.. “అబ్బా.. ఎంత ఇంటెన్సిటీ!” అంటాం. కానీ ఇంటెన్సిటీ అంటే అరుపు కాదు.

అరుపు లేకుండా భయపెట్టడం ఇంటెన్సిటీ.
కన్నీళ్లు లేకుండా ఏడిపించడం ఇంటెన్సిటీ.
డైలాగ్ లేకుండా పాత్రను మాట్లాడించడం ఇంటెన్సిటీ.

అది ఓంపురి దగ్గర ఉంది. నసీరుద్దీన్ దగ్గర ఉంది. నానా పటేకర్ దగ్గర అయితే అది ఇంకో స్థాయిలో ఉంది. అందుకే వీళ్లను చూసిన తర్వాత.. మనం గొప్ప నటులుగా భావించే కొంతమంది నటులను మళ్లీ చూస్తే.. కొంచెం సాధారణంగానే అనిపిస్తారు..!!

అబ్బే, ఎవరి నటన ప్రతిభ వాళ్లదే అంటారా..? పోలిక అనవసరం అంటారా..? కాదు, ఒకే పాత్రను వేర్వేరు భాషల్లో వేర్వేరు నటులు పోషించినప్పుడు పోలిక వస్తుంది, మనవైన అభిప్రాయాలూ ఉంటాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!
  • ఇదొక ‘PRESS’ దందా ! ఐడీ కార్డులిస్తారట – స్టిక్కర్లు కూడా ఇస్తారట !!
  • ఎలన్ మస్క్ Vs ముఖేష్ అంబానీ ! స్టార్‌లింక్‌ అడ్డుకునే ఆలిగార్కులు !!
  • తన స్టెప్పులతో రష్యన్లను మరోసారి షేక్ చేసిన డిస్కో డ్యాన్సర్!
  • బిగ్గర్ దేన్ హీరో ! అందుకే హీరోలు తన పక్కన చేయడానికి భయపడతారు !!
  • Evil Dead – నానా పటేకర్ మృతిపై ఓ చేదు స్పందన – ఎవరామె? ఏంటీ కథ?
  • నానా పేర్లన్నీ ఒకవైపు – నానా పేరొకవైపు..! వీరుడా సెల్యూట్ !!
  • … కల్కి భక్తులు రెచ్చిపోయి వార్త ఆఫీసులపై దాడులు చేశారు !!
  • పోలీసులే కాపాడారు… పోలీసులే ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు!!
  • ఆ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ 5 కోట్లు ఫీజు..? అదీ వ్యాపారమేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions