‘‘దుర్మార్గమైన పాలన, జేసీబీ పాలన… అంతా రివర్స్, అభివృద్ధి రివర్స్… పంచుడు పథకాలు తప్ప, ఇంకేమీ లేదు… పోలవరం స్టాప్, అమరావతి స్టాప్… కోడికత్తి ముందుకు కదలదు, బాబాయ్ కేసు అసలే కదలదు… పైగా కిరస్తానీ సర్కారు, అన్యమత ద్రోహాలు… విపక్షంపై అక్రమ కేసులు, మడమ తిప్పే జగను…’’ సాధారణంగా ఆంధ్రజ్యోతి ఏం రాస్తుంది..? ఇదుగో ఈ అంశాల చుట్టే తిరుగుతూ ఉంటాయి కదా స్టోరీలు… తను వారం వారం రాసుకునే కొత్తపలుకు కూడా అలాగే ఉంటుంది… ఈసారీ అలాగే ఉన్నది… వోకే, ఓ ప్రతిపక్ష వాయిస్‌గా, తెలుగుదేశం వాయిస్‌గా అలా గాకుండా ఇంకెలా రాస్తాడులే అనుకుందాం… అయితే తెలంగాణకొచ్చేసరికి ఇక తెలంగాణను, కేసీయార్‌ను ఉద్దరించడం, మార్చడం నావల్ల కాదు అంటూ ఇక జైకేసీయార్ అంటే తప్ప తెలంగాణలో బతకలేం బాబూ అని ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి, మళ్లీ ఓ పాత గడీల పాలనలోకి వెళ్లిపోయాం, పాపం తెలంగాణ అని జాలిచూపించి, ఓ పెద్ద దండం పెట్టేశాడు రాధాకృష్ణ… ప్రత్యేకించి ఆర్టీసీ సమ్మె విషయంలో తను ఓ రాజకీయవేత్తగా ఎలా సక్సెసయ్యాడో, ఒకే దెబ్బకు పదిపిట్టలను కేసీయార్ ఎలా కొట్టాడో చెప్పి… వామ్మో, కేసీయార్‌తో వేగడం ఎవరి వల్లా కాదమ్మా అంటూ ఇక చాలించాడు… అయితే..?
తను ఏపీ జగన్ ఆరు నెలల పాలనను సమీక్షిస్తూ చాలా చెప్పాడు… వాటిల్లో కొన్ని అంగీకారయోగ్యం, కొన్ని మరీ తెలుగుదేశం పక్షపాతం… అయితే ఒకటి ఇంట్రస్టింగుగా ఉంది… అదేమిటంటే..? రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోతుంది, ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాల్సిన స్థితి తలెత్తవచ్చునని రిజర్వు బ్యాంకు అధికారులు కేంద్రానికి నివేదిక పంపినట్టు వార్తలు వస్తున్నాయి అని రాశాడు… ఇక్కడ కొన్ని ప్రశ్నలు…
- నిజంగా ఆర్బీఐ అంత సీరియస్ నివేదిక ఇచ్చిందా..? ఒకవేళ ఇచ్చిందే నిజమైతే అది ఆంధ్రజ్యోతికి బ్యానర్ స్టోరీ కదా… మరెందుకు వదిలేసినట్టు..? ఆ వార్తలు ఎందులో వచ్చాయో ఎందుకు చెప్పకూడదు..? పోనీ, ఆ వార్తల నిజానిజాలేమిటో తనెందుకు వెలికితీయకూడదు…?
- ఒక బ్యాంకు నీకు రుణం ఎందుకు ఇవ్వాలని లేఖ రాస్తుంది… ఏపీలో పీపీఏల పరిస్థితి పేర్కొంటూ, నీ దేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలంటూ ఒక దేశం కేంద్రానికి లేఖ రాస్తుంది… రిలయెన్స్ వెనక్కి… ఆదానీ వెనక్కి… పేపర్ పల్ప్ యూనిట్ వెనక్కి… లులూ గ్రూపు వెనక్కి… అందరూ వెనక్కి వెనక్కి తగ్గుతున్న వార్తల నేపథ్యంలో నిజంగా ఆర్బీఐ ఆ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీపై లేఖ రాస్తే అది చాలా సీరియస్ యవ్వారం…
- అదే నిజమైతే సదరు ఆర్బీఐ లేఖను ఏపీబీజేపీ ఎందుకు బయటపెట్టకూడదు..? టీడీపీని మించి జగన్ అప్పులు చేస్తున్నాడు అని టీడీపీ ఆరోపిస్తున్నది… ఆ లెక్కలేమిటో సవివరంగా ఎందుకు చెప్పకూడదు మరి..? నిజంగానే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు… కానీ దాన్ని ఎక్స్‌పోజ్ చేయడంలో విపక్షాలు ఫ్లాప్… యెల్లో మీడియాతో సహా..!! (అప్పుడప్పుడూ ప్రజాశక్తి వంటి పత్రికల్లో కొన్ని సీరియస్ కథనాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో…)
సరే, ఇప్పుడు తను కాస్త కాషాయం రంగు పులుముకుంటున్నాడు కాబట్టి… తనూ ఓ బీజేపీ నేతలాగే రాస్తున్నాడని అనుకుందాం… ఎందుకంటే..? నిన్న బీజేపీవాళ్ల ప్రెస్ మీట్ వార్త చూడండి…
సుజనా చౌదరి నివాసంలో భేటీ పెట్టుకుని సీరియస్‌గా ఏపీలో పార్టీని పెంచే అవకాశాల్ని చర్చించారట… అయితే వారి ఆగ్రహంలో ప్రధానమైంది పాస్టర్లు, ఇమామ్‌లకు దేవాదాయ శాఖ నుంచి నిధులు ఖర్చు పెడుతున్నారు, జెరూసలెం యాత్రకు అవే నిధులు అని ఓ విమర్శ… నిజంగా దేవాదాయ నిధుల నుంచి గనుక అన్యమతస్తులకు జీతాలు, యాత్రలకు సాయం అందుతుంటే అది సీరియస్ యవ్వారమే… మరి అది నిజమే అయితే ఆ జీవోలు లేదా సర్క్యులర్లను ఎందుకు బయటపెట్టకూడదు..? అసలే ఏపీలో క్రైస్తవ మతవ్యాప్తి మీద ఆందోళనలు పెరుగుతున్నాయి.,. ఇక గుళ్ల ఆదాయాన్ని కూడా చర్చిలు, మసీదుల్లో జీతాలకు వెచ్చించడం మొదలుపెడితే… గుళ్లలో ఒక రూపాయి వేసేముందు ఇకపై సగటు హిందూ భక్తుడు ఆలోచించే అగత్యం ఏర్పడుతుంది… ఇప్పటికే దేవాదాయ భూముల విక్రయానికి నోటిఫికేషన్లు స్టార్టయ్యాయి… హిందూ రక్షకుడి ఫోజు కొట్టే బీజేపీకి సాక్ష్యాధారాలతో అన్నీ ప్రజల ముందుకొచ్చే సోయి ఎందుకు లేదు..? సో, సగం తెలుగుదేశం సగం బీజేపీ నాయకులు సుజనా వంటి నేతలు… సేమ్, రాధాకృష్ణ కూడా..! మరి విమర్శలను, ఆరోపణలను కూడా ఇలా సగం సగం చేస్తే ఎలా..? సరైన సాక్ష్యాధారాలతో జగన్ నిర్వాకాన్ని ఎండగట్టండి… ఏపీ ప్రజలు వద్దన్నారా..?!
ప్రత్యేకించి తిరుపతి… మొన్న ఓ వార్త కనిపించింది… రోజూ 2 నుంచి 4 కోట్ల ఆదాయం సంపాదించి పెట్టే తిరుమల హుండీ స్టోరీ… ఆ హుండీపైన రోజూ ఓ కొత్త వస్త్రాన్ని తొడుగుతారు… ఆ కంట్రాక్టు పూర్తయ్యాక, ఇక పట్టించుకునేవాడు లేకపోతే, దాన్నే ఉతుకుతూ వాడేస్తున్నారు… ఆఫ్టరాల్ హుండీపై వస్త్రం గురించీ పట్టింపు లేదు… పాత ప్రభుత్వ జమానాలో వజ్రాలు, రత్నాలు, ఆభరణాలు, నేలమాళిగ, రహస్యసొరంగం, విదేశాలు దాటిన సంపద అంటూ బోలెడు ఆరోపణలు చేసింది వైసీపీ… సాయిరెడ్డి అయితే ఏకంగా చంద్రబాబు జుబ్లీహిల్స్ చంద్రభవనంలో వెతకండి దొరుకుతాయి అనేశాడు… మరి ఆరు నెలలైంది..? ఏమయ్యాయి ఆ ఆరోపణలన్నీ… ఏమోలెండి… ఎవరైనా అడిగితే… ఏ కొడాలి నానీయో ‘ఏం., నీ అమ్మ మొగుడు కట్టించాడా గుడిని..?’ అని బూతులతో సమాధానమిస్తాడు… సో, చివరాఖరుకు చెప్పేది ఏమిటయ్యా అంటే… బీజేపీ గానీ, టీడీపీ గానీ, ఈ రెండింటి అధికార ప్రతినిధులు ఆంధ్రజ్యోతి వంటి మీడియా గానీ విమర్శో, ఆరోపణో చేస్తే చేయండి… కానీ పర్‌ఫెక్టుగా చేయండి… లేఖలో, జీవోలో ప్రజలకు చూపండి… అదీ సంగతి…