అంతటి చిరంజీవి ముఖ్య అతిథి…. అంతటి నాగార్జున హోస్టు… వీళ్లకుతోడుగా శ్రీకాంత్, అంజలి, నిధి అగర్వాల్, కేథరిన్… వందరోజుల పైబడి సాగుతున్న బిగ్‌బాస్ మూడో సీజన్ గ్రాండ్ ఫినాలె… క్లైమాక్స్… విజేత ఎవరో ముందే నెటిజన్లకు తెలిసిపోయినా సరే, జనంలో ఇంకా మిగిలే ఉన్న ఆసక్తి… మొత్తం హాజరైన కంటెస్టెంట్లు, రీఎంట్రీలు, వైల్డ్ కార్డులు సహా… వాళ్లందరికీ వోట్లేసిన అభిమానజనం టీవీల ఎదుట… టీఆర్పీలు దుమ్ము లేచిపోవాలి కదా… సహజంగానే..! ఆ లెక్కలూ వచ్చేశాయి… హుర్రే… అంటూ ఈ బిగ్‌బాస్ నిర్మాతలైన ఎండెమాల్ షైన్ ఇండియా సంస్థ ఆనందంతో గంతులేసింది… స్టార్ మాటీవీ సంబరపడిపోయింది… ఎందుకంటే..? ఏకంగా 18.3 టీఆర్పీలు నమోదయ్యాయి, దేశంలో ఏ బిగ్‌బాస్ షోకూ రానంత భారీ టీఆర్పీలు ఈ బిగ్‌బాస్-3 ఫినాలె రికార్డు చేసుకుందని వారి ఆనందం… (Urban- 15+ కేటగిరీ… 45 వారం)
గుడ్… నిజానికి ఆ ఫినాలెకు అన్ని విశేషాలు కదా… కనీసం 20 టీఆర్పీలు దాటిపోవాలని అనుకున్నారు ఈ రేటింగ్స్ మీద అంచనా ఉన్నోళ్లు… ఆదివారం, మంచి ప్రైమ్ టైమ్… నాలుగున్నర గంటలపాటు కలర్‌ఫుల్‌గా సాగిన షో… పైగా జనం సెలబ్రిటీలు పాల్గొనే లైవ్ షోలు చూడటానికి బాగా అలవాటు పడుతున్నారు… సో, ఏరకంగా చూసినా ఈ షోకు 18.3 రేటింగ్స్ తక్కువే అనిపిస్తున్నది… పైగా దేశంలోనే ఒక బిగ్‌బాస్ షోకు ఇంత టీఆర్పీలు రావడం గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్టు అనే విశేషణాలూ అక్కర్లేదు… (జూనియర్ ఎన్టీయార్ హోస్టు చేసిన మొదటి సీజన్ ఫినాలెకు 14.13 టీఆర్పీలు, నాని హోస్టు చేసిన రెండో సీజన్ ఫినాలెకు 15.05 టీఆర్పీలు వచ్చాయి…)
మరి బిగ్‌బాస్ గురించి చెబుతూ ఆ కార్తీక దీపం సీరియల్ వంటలక్క ఫోటో ఎందుకు మధ్యలో అనేదేనా మీ డౌటు..? చెప్పుకుందాం…
బిగ్‌బాస్ ఫినాలెకు ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో చెప్పుకున్నాం కదా… దానికి 18.3 వస్తే… కార్తీకదీపం 17.8 రేటింగ్స్… అంటే ఆ ఫినాలె రేటింగ్స్ కాస్త ఇటూఅటూ… (ఈ చిరంజీవిలు, ఈ నాగార్జునలూ గెస్టులుగా వస్తుంటారు పోతుంటారు… కానీ తెలుగు ఏమాత్రం రాని ఈ కార్తీకదీపం హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క తెలుగునాట ఇంటింటి మనిషి… అనుకోవాలేమో…) సీరియళ్ల ప్రమోషన్లలో కొంత మాయామర్మం ఉంటుంది గానీ… స్థూలంగా ఒక షో ఆదరణను కొలిచేది ఇప్పటికీ ఈ బార్క్ రేటింగ్సే… సో, ఈ వారం టీవీ ప్రోగ్రాముల్లోనే ‘నిజమైన బిగ్ బాసిణి’ ఈ కార్తీకదీపం హీరోయినే… ఇప్పటికీ తెలుగు టీవీ ప్రేక్షకులను ఆమె హిప్నొటైజ్ చేస్తూ, టీవీలకు కట్టిపడేస్తూనే ఉన్నది కాబట్టి..! ఇంతగా సాగదీస్తున్నా సరే, ఇంత సుదీర్ఘంగా సాగుతున్నా సరే… ఇప్పటికీ అదే రేంజ్ రేటింగ్స్ సాధిస్తున్నందుకు ఆశ్చర్యాభినందనలు చెప్పాల్సిందే…
ఓవరాల్ ట్రెండ్ చూస్తే… ఈసారి వినోద చానెళ్లలో ఈటీవీ పరిస్థితి మరింత దిగజారిపోయింది ఫాఫం… పేలవమైన ప్రోగ్రాములతో జెమిని నాలుగో స్థానంలో చేరి, ఇప్పటికీ అక్కడే కొట్టుమిట్టాడుతూ, ఇప్పుడు ఏకంగా 14 శాతం మైనస్‌తో 453 రేటింగ్స్‌తో ఉండగా… దానికి కాస్త ఎగువన ఈటీవీ అదే 14 శాతం మైనస్‌తో 556 రేటింగ్స్ దగ్గర ఆగింది… సీరియళ్లలో కాస్త మెరుగు అనిపించుకునే జీ తెలుగు కూడా 8 శాతం మైనస్‌తో 580 పాయింట్స్ దగ్గర నిలిచింది… అదే స్టార్ మాటీవీ మాత్రం తన హిట్ సీరియళ్ల పుణ్యమాని 2 రెండు శాతం ప్లస్‌తో 1089 దగ్గర నిలబడింది… ఇక జబర్దస్త్, పటాస్, ఢీ చాంపియన్స్ నుంచి ప్రధాన హోస్టులు, యాంకర్లు, జడ్జిలు, చివరకు ప్రోగ్రామ్ డైరెక్టర్లు కూడా వెళ్లిపోయినందున… ఇకపై ఈటీవీ పరిస్థితి ఏమిటో చూడాలి… బిగ్‌బాస్ ఫినాలె ప్రసారం అయిన ఆదివారం ఈటీవీ మరీ ఘోరమైన టీఆర్పీలతో నాలుగో ప్లేసు…
ఇవన్నీ సరే… సుమ అంటే వెరీ వెరీ పాపులర్ యాంకర్ కదా… ఆమె షో చేస్తుంటే చాలామంది చూస్తుంటారు కదా… ఆమె చేస్తున్న ఎఫ్3 (ఫ్యామిలీ, ఫన్, ఫ్రస్ట్రేషన్) హిట్టా… ఫ్లాపా..? ఈ ప్రశ్నకు సమాధానం… అది ఎఫ్4… అంటే ఫ్యామిలీ, ఫన్, ఫ్రస్ట్రేషన్, ఫ్లాప్… అవే చిన్న చిన్న సెలబ్రిటీలు, అవే చిన్న చిన్న ఆటలు, అవే సోది ప్రశ్నలు… ఇంకెంతకాలం సుమా..? కాస్త రూటు మార్చు… లేకపోతే ఎఫ్5 అయిపోతుంది… అంటే ఫ్యామిలీ, ఫన్, ఫ్రస్ట్రేషన్, ఫ్లాప్, ఫసాక్…
అప్‌డేట్………… ఇదండీ అసలు కథ…. అసలు బిగ్ బాస్ ఫినాలె ఓవరాల్ కేటగిరీల టీఆర్పీలు కేవలం 11.50 మాత్రమే … జస్ట్ 11.50… ఈమాత్రం దానికి రికార్డు అంటూ ఫేక్ గొప్పలు చెప్పుకుంటున్నది నిర్మాణసంస్థ…. అదే కార్తీకదీపం శుక్రవారం 18.43…. మంగళవారం 18.05 రేటింగ్స్…. అర్థమైంది కదా అసలు బండారం…. ఇక మూసుకొండి బాసూ …..