.
బీఆర్ఎస్ పేరుకు ఓ జాతీయ పార్టీ… కానీ ప్రస్తుతం దేశ రాజకీయాల దశను మార్చేయబోయే మోడీ మార్క్ 3 బిల్లులపై కనీస స్పందన లేదు దానికి..! అసలు ఈ కీలకాంశాలపై ఓ క్లియర్ స్టాండ్ లేదు… ఓ సిద్ధాంత దారిద్య్రం… Ideological Vacuum… చిన్నాచితకా పార్టీలకు సైతం కీలక జాతీయ అంశాలపై ఓ పొలిటికల్ వైఖరి ఉంటుంది… ఉండాలి… కానీ బీఆర్ఎస్ అటూఇటూ కాని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది…
ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, తనలోని తెలంగాణ ఆత్మను చంపేసుకుని… ఏమో, గుర్రమెగురావచ్చు అనే ధోరణిలో… ప్రధాని పదవికే గురిపెట్టి… భారత రాష్ట్ర సమితిగా మార్చేయబడింది… అది తెలంగాణ సమాజానికే నచ్చలేదు, దాంతో చివరకు ప్రాంతీయ పార్టీగా కూడా కుదేలైంది… ఇక పార్టీ టైటిల్‌లో మాత్రమే ‘జాతీయత’ మిగిలింది…
Ads
ఒకప్పుడు… ఇదే కేసీయార్ బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడేవాడు… చైనావాళ్లు సరిహద్దుల్లో దంచుతున్నారు… సర్టికల్ స్ట్రయిక్స్ ఆధారాలు అడిగితే తప్పేముంది వంటి వ్యాఖ్యానాలకూ దిగాడు… తరువాత ఫామ్ హౌజులో బందీ అయిపోయాడు… జాతీయ అంశాలు కాదు కదా… రాష్ట్రం సమస్యల మీద కూడా కిక్కుమనడం లేదు… ఒకరకంగా తను జనానికి, ప్రజాజీవితానికీ దూరమైపోయాడు… (కేసీయార్ బిడ్డ కవిత గతంలో ఢిల్లీలో మహిళ రిజర్వేషన్ల మీద ధర్నా కూడా చేసింది, అప్పుడామె బీఆర్ఎస్ పార్టీయే)…
రోజూ రెండుమూడు అంశాలపై స్పందించి ఏదో ఒకటి మాట్లాడే హరీష్ రావు, కేటీయార్ కూడా వర్తమాన జాతీయ రాజకీయాంశాలపై పార్టీ స్టాండ్ ఏమిటో స్పష్టంగా ఏదీ చెప్పలేని దురవస్థ… 1) డీలిమిటేషన్ 2) మహిళా రిజర్వేషన్లు 3) జమిలి ఎన్నికలు… ఈ మూడు బిల్లులూ దేశ రాజకీయాల స్థితిగతులను, దిశను మార్చేసేవి… ఎన్డీయే ప్రభుత్వం ఓ బృహత్తర వ్యూహంతో ముందుకు పోతోంది…

- సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ స్టాండ్‌తో ఉన్నాడు… ప్రత్యేకించి డీలిమిటేషన్ తీరును వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాయడమే కాదు… స్టాలిన్, పినరై విజయన్, సిద్ధరామయ్య (ముగ్గురు సౌత్ సీఎంలు)లకు కూడా లేఖలు రాసి ‘దక్షిణాదికి అన్యాయం’ అని పోరాడుతున్నాడు… హైబ్రీడ్ మోడల్ డీలిమిటేషన్ ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చాడు… కాంగ్రెస్ జాతీయ ముఖ్యులకన్నా దూకుడుగా వెళ్తున్నాడు… ‘దక్షిణాది గళం’ (South Vaoice) అనే స్పేస్‌ను రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా ఆక్రమిస్తున్నాడు… కానీ బీఆర్ఎస్ సైలంట్… ఎందుకు..?
పరోక్షంగానో, ప్రత్యక్షంగానో తన భవిష్యత్తు బీజేపీతో ముడిపడి ఉంది కాబట్టి..! మెడపై కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా వన్ కత్తులు కూడా వేలాడే ప్రమాదం ఉంది కాబట్టి…! పొత్తో, అవగాహనో, విలీనమో అవసరమని భావిస్తున్నది కాబట్టి..! ప్రొరేటా ప్రకారం ప్రతి రాష్ట్రంలోని ఎంపీ సీట్లను 50 శాతం పెంచాలనే మోదీ మార్క్ నిర్ణయానికి బీఆర్ఎస్ మద్దతునిస్తుందా..? దాంతో దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరిగినా పర్లేదనే ధోరణా..? జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లినా పర్లేదనే వైఖరా..? (ఆమధ్య స్టాలిన్ పిలిస్తే వెళ్లిన కేటీయార్ భారీ ఉపన్యాసం ఇచ్చినట్టు గుర్తు… మరి ఇప్పుడు..?)

నిజానికి అన్నాడీఎంకే, టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయేలో ఉన్నాయి… సో, బీజేపీ చెప్పిందే రైట్ అంటాయి, అనకతప్పదు… తమ ప్రజలకు ఏదో చెప్పుకుంటాయి… కేరళలో లెఫ్ట్, యూడీఎఫ్ ఎలాగూ యాంటీ బీజేపీయే… ఇండి కూటమి… ఏపీని వదిలేస్తే సౌత్ లోని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి…
- బీఆర్ఎస్‌తో ఉన్నట్టే వైసీపీతో కూడా బీజేపీ రహస్య దోస్తీయే కాబట్టి రెండు కీలక బిల్లుల ఆమోదానికి ఆ పార్టీల మద్దతు తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది… బీఆర్ఎస్‌కు పార్లమెంటులో పెద్ద సీన్ లేకపోయినా వైసీపీకి కాస్త చెప్పుకోదగిన నంబర్ ఉంది… సౌత్‌లోని ప్రతి పార్టీకి ఓ క్లియర్ పొలిటికల్ స్టాండ్ ఉంది… ఎటొచ్చీ ఎన్డీయేలో లేకపోయినా సరే, వైసీపీ- బీఆర్ఎస్ పార్టీలే మోడీ ప్రభుత్వ బిల్లుల్ని సమర్థించలేవు, వ్యతిరేకించలేవు… మాట్లాడలేవు… అసలు జాతీయ అంశాలపై ఓ స్పష్టమైన వైఖరే లేదు..!!
ఈ విమర్శలు వస్తాయనే సందేహంతో కావాలని ఓ వార్త వదిలారు… అదేమంటే.., హరీష్ రావు, కేటీయార్‌లతో కేసీయార్ భేటీ అయ్యాడనీ… మహిళ రిజర్వేషన్లకు మద్దతు పలకాలనీ, దక్షిణాదికి ఒకవేళ డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరిగే పక్షంలో, బిల్లు అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుందామని చెప్పాడట… కేసీయార్ ఎలాగూ మాట్లాడడు… మరి ఆ భేటీలో ఈ కీలక విషయాలు చర్చిస్తే హరీష్ రావు గానీ, కేటీయార్ గానీ ఎందుకు మాట్లాడలేదు… ఏదో ఈ అంశాలు చర్చించినట్టుగా మీడియాకు ఏదో సమాచారం వదలడం తప్ప..!!
Share this Article