.
ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్టు ఎస్పీ అధినేత అఖిలేషుడు ప్రకటించాడు… కళ్లు తెరుచుకున్నాయి, తత్వం బోధపడింది… సోకాల్డ్ సోషల్ మీడియా మాఫియా ఏ పార్టీని గెలిపించలేదు, ఏ పార్టీని ఓడించలేదు అనే నిజం అర్థమైంది… అసలు ప్రశాంత్ కిషోర్ స్టార్ట్ చేసిన ఈ సోషల్ మాఫియా మొత్తం మన రాజకీయ వ్యవస్థకే ఓ పెద్ద కోవిడ్ వైరస్ అనే నిజం అందరికీ అర్థమవుతోంది కూడా… శుభం…
2027 ఎన్నికల్లో ఐ-ప్యాక్ సహకరిస్తే యోగిని దింపేసి, మళ్లీ మాఫియా గూండారాజ్ స్థాపించుకోవచ్చునని అనుకున్నాడు పాపం… కానీ ఎప్పుడైతే బెంగాల్ తాటకి దారుణంగా ఓడిపోయిందో… ఎప్పుడైతే తమిళనాడులో డీఎంకే ఓడిపోయిందో అఖిలేషుడికి హఠాత్తుగా జ్ఞానోదయం అయిపోయింది…
Ads
పైగా ఈ సోషల్ గ్యాంగులను మేపడం మామూలు విషయం కాదు… జగన్‌ను అడిగినా చెప్పేవాడు… రిషి అనే కేరక్టర్ సోషల్ మీడియా, వ్యూహకర్త పేరిట జగన్‌ను నానారకాలుగా మభ్యపెట్టి, తప్పుడు నివేదికలు ఇచ్చి నిండా ముంచాడని వైసీపీ కేడరే మొత్తుకుంటోంది… మమత బెనర్జీ అయితే కోల్ స్కామ్ డబ్బులు కోట్లకుకోట్లు కట్టబెట్టింది ఆ ప్రతీక్ జైన్ అనే గ్యాంగ్ లీడర్‌కు…
ఆయన కూడా తన ఐప్యాక్ ఆఫీసును మమత గ్యాంగులు, అక్రమాల ఫైళ్లకు అడ్డాగా మార్చేశాడు… (ఈడీ దాడి చేసినప్పుడు ఆ ఆఫీసు నుంచి మమత ఎత్తుకొచ్చుకున్న ఫైళ్లలో దాగిన నిజాలెన్నో)… నిజానికి ఈ సోషల్ గ్యాంగులు చేసేది ఒకటే… తాము కంట్రాక్టు తీసుకున్న పార్టీ గెలిస్తే క్రెడిట్ తీసుకోవడం, మరిన్ని కోట్ల రేటు పెంచుకోవడం…
వాస్తవానికి సోషల్ వ్యూహాలు ఫీల్డులో ఏమీ పనిచేయవు… ఈ ఐ-ప్యాక్‌ను మించి ఎన్నోరెట్ల నెగెటివ్ క్యాంపెయిన్, కోట్లకుకోట్ల ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు మరి..? వ్యతిరేకత ప్రబలుతున్న కేసీయార్‌కు ఉపయోగపడే వీసమెత్తు పాజిటివిటీని ఎందుకు పెంచలేకపోయింది..? జనం రీల్స్ చూస్తారు, షార్ట్స్ చూస్తారు, ఈ సోషల్ గ్యాంగుల ప్రచారమూ చూస్తారు… తమ నిర్ణయం తాము తీసుకుంటారు…
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడినట్టు… ఇదే ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో సొంతంగా ఓ పార్టీ పెట్టి, ఏవో వ్యూహాలు రచించి, పాదయాత్రలు చేసి, నానా తిప్పలూ పడినా… జనం అడ్డంగా తిరస్కరించారు… ఎహె పోవోయ్ అన్నారు… మరి ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చిన ఆ మహా మెరిట్ తనకు ఎందుకు పనిచేయలేదు..?
మమత అరాచక పాలనపై జనంలో పెరిగిన వ్యతిరేకత ఎంత అంటే… ఐప్యాక్‌లు వంద కష్టపడినా ఆమె గెలవలేకపోయేది… ఏతావాతా చెప్పొచ్చేదేమిటయ్యా అంటే… జనం విచక్షణ అపారం… ఎవరిని దింపాలో, ఎవరిని ఎక్కించాలో వాళ్లు నిర్ణయించుకోగలరు… వాళ్లే నిర్ణయించుకోగలరు..!! సోషల్ మాఫియాపై రాజకీయ పార్టీల భ్రమలు తొలగిపోతున్న తీరు ఈ దేశ ప్రజాస్వామ్యానికే మంచిది..!!
Share this Article