.
ముందుగా ఒక వార్త చదవండి… ‘‘ఈ డిజిటల్ యుగంలోనూ దేశంలో నగదు చలామణి పెరుగుతోంది. RBI లెక్కల ప్రకారం 10 ఏళ్లలో ఇది దాదాపు 3 రెట్లు పెరిగింది. 2017 FYలో ₹13 లక్షల కోట్లుగా ఉండగా, 2026 FY కల్లా ₹41 లక్షల కోట్లకు చేరింది. కానీ ATM నెట్‌వర్క్ మాత్రం కుంచించుకుపోతోంది. 2023లో 2.19 లక్షలకు పైగా మెషీన్లు ఉండగా, ప్రస్తుతం 2.09 లక్షలకు పడిపోవడం గమనార్హం. నగదు ఉపసంహరణలు కూడా ₹32.6 లక్షల కోట్ల నుంచి ₹28.6 లక్షల కోట్లకు తగ్గాయి’’
ఇదీ వార్త… ఒకవైపు డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి, మరోవైపు ఏటీఎంల వినియోగమూ తగ్గింది… అంటే నగదు లావాదేవీలు, చలామణీ తగ్గాలి కదా… పెరగడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది సహజంగానే… మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?
Ads
ఇది పైకి చూస్తే వైరుధ్యంలా కనిపిస్తుంది. “నగదు చలామణి పెరుగుతోంది, ATMలు తగ్గుతున్నాయి, ATMల నుంచి డబ్బు డ్రా చేయడమూ తగ్గుతోంది” అంటే ఏదో ఒకటి తప్పుగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ మూడు వేర్వేరు విషయాలను కలిపి చూస్తే అర్థమవుతుంది.
నగదు చలామణి పెరగడం అంటే? RBI చెప్పే “Currency in Circulation” అంటే ATMల్లో ప్రజలు తీసుకున్న డబ్బు మాత్రమే కాదు. ప్రజల చేతుల్లో, వ్యాపారాల వద్ద, బ్యాంకుల వెలుపల ఉన్న మొత్తం నగదు. అంటే…:
జీతాలు పెరిగాయి, ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగింది, ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ఎక్కువ నోట్ల అవసరం ఏర్పడింది, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నగదు ఆధారిత లావాదేవీలు కొనసాగుతున్నాయి, కాబట్టి చలామణిలో ఉన్న నగదు ₹13 లక్షల కోట్ల నుంచి ₹41 లక్షల కోట్లకు పెరగడం ఆశ్చర్యకరం కాదు…
మరి ATMల నుంచి డబ్బు డ్రా ఎందుకు తగ్గుతోంది? ఇక్కడే UPI ప్రభావం కనిపిస్తుంది. ఒకప్పుడు… కిరాణా షాపు, పెట్రోల్ బంకు, రెస్టారెంట్, టికెట్లు, బిల్లులు… అన్నింటికీ నగదు అవసరమయ్యేది. కానీ ఇప్పుడు
₹10 టీ తాగినా UPI
₹100 కూరగాయలు కొన్నా UPI
₹1000 షాపింగ్ చేసినా UPI
కాబట్టి ప్రజలు ఒకేసారి ₹10,000 లేదా ₹20,000 ATM నుంచి తీసుకుని వారమంతా ఖర్చు చేసే అవసరం తగ్గింది.
మరి ATMలు ఎందుకు తగ్గుతున్నాయి? ATM నిర్వహణ చౌక కాదు. అద్దె, విద్యుత్, నగదు నింపడం, భద్రత,
సర్వీసింగ్, ఇవన్నీ ఖర్చులు. మరోవైపు డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరగడంతో ATM లావాదేవీలు తగ్గాయి. ఫలితంగా బ్యాంకులు తక్కువ ఉపయోగంలో ఉన్న ATMలను మూసేస్తున్నాయి.
అసలు ట్విస్ట్ ఎక్కడుంది? నగదు అవసరం తగ్గలేదుగానీ, నగదు “వాడే విధానం” మారిపోయింది. ఉదాహరణకు…:
ఒక రైతు పంట అమ్మి నగదు దగ్గర ఉంచుకోవచ్చు.
ఒక చిన్న వ్యాపారి బ్యాంకులో వేయకుండా క్యాష్ రిజర్వ్‌గా ఉంచుకోవచ్చు.
పెళ్లిళ్లు, నిర్మాణ రంగం, వ్యవసాయం, చిన్న వ్యాపారాల్లో ఇప్పటికీ నగదు ప్రాధాన్యం ఉంది.
UPI రోజువారీ లావాదేవీలను స్వాధీనం చేసుకుంది. కానీ నగదును మాత్రం పూర్తిగా భర్తీ చేయలేకపోయింది. అందుకే చలామణిలో నగదు పెరుగుతుండగా, ATMల వినియోగం మరియు ATMల సంఖ్య తగ్గుతున్నాయి.
ఇది డిజిటల్ ఇండియా వైఫల్యం కాదు. అలాగే “క్యాష్‌లెస్ ఎకానమీ” వచ్చేసిందనడానికి కూడా నిదర్శనం కాదు. వాస్తవానికి భారత్ ఇప్పుడు “డిజిటల్ చెల్లింపులు + నగదు నిల్వలు” అనే రెండు వ్యవస్థలు ఒకేసారి నడుస్తున్న ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పవచ్చు.
జీరో మనీ, అంటే అకౌంట్ ఫర్ కాని మనీ ఎప్పుడూ నగదుగానే చలామణీ అవుతుంది… ప్రతి డిజిటల్ లావాదేవీ అకౌంట్ ఫర్ అయితే పన్ను ఎగవేతలు తగ్గుతాయనేది ప్రభుత్వ భావన… ఒకవైపు వేలు, లక్షల కోట్ల భారీ పన్ను ఎగవేతలు, రుణ చెల్లింపు ఎగవేతలు జరుగుతూ ఉంటే, దాన్ని అరికట్టలేని ప్రభుత్వం దీనిపై అధిక శ్రద్ధ చూపిస్తున్నదే విమర్శలు కూడా ఉన్నాయి… కానీ డిజిటల్ పేమెంట్స్ నిజానికి జనానికే మంచిది… చాలా కోణాల్లో… అది మరో పెద్ద సబ్జెక్టు…
Share this Article