ఈ దిక్కుమాలిన పాలిటిక్స్, సినిమాలు, టీవీలు, క్రికెట్, మందూ, మటనూ, మాల్దీవులు, నాయకభజనలు, పాదపూజలు… ఈ పల్లీబటానీ చాట్ ఎప్పుడూ ఉండేదే గానీ… అవే ఎందుకు గానీ కాస్త ఏదైనా కొత్త విశేషం ఏమైనా ఉంటే చెప్పు సోదరా అన్నాడు ఓ వినోదవిరాగి… నిజమే కదా… యాభై ఏళ్లపైబడి, అన్ని బాధ్యతలూ తీర్చేసుకున్న కొందరు ఈమధ్య కొత్త ట్రెండ్ కనబరుస్తున్నారు… చలో కాశి… ఒకప్పుడు కాశికి వెళ్లడమంటే కాటికి వెళ్లడం అన్నంత కష్టం… మరిప్పుడు..? అలా వెళ్లి, ఇలా వచ్చేయడమే… కానీ వీళ్లు అలాకాదు… పదకొండు రోజులు అక్కడే ఉండిపోవాలి… పొద్దున, సాయంత్రం శివార్చనకు గుడికి వెళ్లాలి… మిగతా సమయాల్లోనూ వీలైనంతసేపు ఫోన్ ఆపేసి, ఏ ఒత్తిళ్లూ లేకుండా ఘాట్ల వెంట తిరుగుతూ, ధ్యానం చేసుకుంటూ, గీతా పఠనం చేసుకుంటూ రోజులు గడిపేయాలి… సాత్వికాహారం, టైంకు నిద్ర… మొత్తం రీచార్జి అయి వచ్చేస్తున్నారు తిరిగి…
కొందరయితే అక్కడే ఉంటారు, అక్కడే మరణిస్తే దహనం చేసి, గంగలో కలిపేయడానికి ముందే ఏర్పాటు చేసుకుంటారు కూడా… కాశిలో మరణిస్తే పుణ్యం, గంగలో కలిసిపోతే పుణ్యం… చాలామందికి మరణం అంటేనే భయం… అలాంటిది మరణం కోసం ఎదురుచూస్తూ ఓచోట కాలం గడపడం భారతీయ సంస్కృతిలోనే కనిపించే విశేషమే… అంతకుమించిన మరో విశేషం చెప్పుకుందాం… ఓపట్టాన నమ్మబుద్ది కాదు…
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని తెలుసు కదా… అక్కడ మహాకాళేశ్వరాలయం ప్రసిద్ధం… అది జ్యోతిర్లింగం… వీటి జాబితా తెలుసు కదా… గుజరాత్ లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లిఖార్జునుదు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాలలోని కేదారనాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాశిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్ లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, ఔరంగాబాద్ లోని గ్రీష్మేశ్వరుడు...
ఉజ్జయిని కాళేశ్వరంలో మూడు అంతస్థుల్లో వేర్వేరు లింగాలుంటయ్… దిగువన భూగర్భగృహంలా కనిపించేది భస్మమందిరం… ఉదయం నాలుగు గంటలకు ఓ విశిష్ట హారతి శివుడికి… గోమయం పిడకల్ని విభూతిగా మార్చి, రెండు మూటల్లో నింపి, వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ, ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది… నాగసాధువులు నిర్వర్తిస్తారు ఇది… మహిళల్ని అనుమతించరు… సంప్రదాయ దుస్తులతో కొందరినే రానిస్తారు… ఆ హారతి సందర్భంగా భేరీలు, మృదంగనాదాలు, కమ్ముకునే విభూతి, మంత్రాలు… అందరినీ ఓ అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకుపోతుంది…
ఇక్కడ ఓ విశేషం ఉంది… కొందరు ముందే ఏర్పాట్లు చేసుకుంటారు… మరణాన్ని అక్కడే ఉంటూ పదే పదే సంకల్పిస్తారు… శివుడిలో ఐక్యం కావాలని కోరిక… ప్రగాఢ వాంఛ… వాళ్ల శవాల్ని కాల్చేశాక, ఆ భస్మాన్ని కూడా అప్పటికప్పుడు తీసుకొచ్చి ఈ భస్మ హారతి సందర్భంగా లింగానికి సమర్పిస్తారు… దేవుడిలో పరిపూర్ణంగా ఐక్యం కావాలనుకునేవారి కోరిక అది… అయితే రోజుకు ఒకరికే ఆ అవకాశం… అసలు భస్మహారతి దర్శనానికి చాలారోజుల ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది…
నిజానికి శివుడు లయకారుడు కదా… తన పూజలన్నీ స్మశానం, శవం, భస్మం తదితరాలతో కనిపిస్తాయి… అఘోరాలు, నాగసాధువుల పూజలు కూడా డిఫరెంటే… శివపూజలు ప్రధానంగా వైరాగ్య భావనలతో ఉంటయ్… సరే, ఇప్పుడు ఈ చర్చలోకి వద్దు గానీ… ఉజ్జయినిలో ఈ పూజలతో లింగం తరిగిపోతున్నదనే ఆందోళనల నడుమ సుప్రీంకోర్టు ఓ కమిటీ వేసి, దాని నివేదికల ప్రకారం కొన్ని షరతులు పెట్టింది… రివర్స్ ఆస్మాసిస్ ప్రక్రియలో శుద్ధిచేయబడిన అరలీటరు నీళ్లు మాత్రమే వాడాలి… పూజలు, అభిషేకాల వేళ వస్త్రాన్ని కప్పి ఉంచాలి… వాస్తవంగా ప్రతి జ్యోతిర్లింగం వద్ద అర్చనల్లో ప్రత్యేక రీతులుంటయ్… నాసిక్ త్రయంబకేశ్వరుడి దగ్గర పూజలు మరింత విభిన్నంగా ఉంటయ్… అవి అనేకానేక పితృకర్మల దోషాలను పరిహరించేవి… అవి మరెప్పుడైనా చెప్పుకుందాం…