రూపాంతీకరణ… ఎస్, అదే కరెక్టు పదం… కాంగ్రెస్ నుంచి జనాన్ని చేర్చుకునీ, చేర్చుకునీ… తెలుగుదేశం పార్టీ తనదైన అస్థిత్వాన్ని కోల్పోయి మరో కాంగ్రెస్ పార్టీలా మారిపోతున్నది… నిజమే… కేవలం మహానాడు సందర్భంగా నిద్రపోతున్న ఈ నాయకులను చూసి అనడం లేదు ఈ మాట..,.
వ్యక్తిపూజ, సిద్ధాంతరాహిత్యం, భజన, నామమాత్ర ప్లీనరీ, ఊకదంపుడు ఉపన్యాసాలు, జనానికి పట్టని తీర్మానాలు, కార్యకర్తలకే నచ్చని చర్చలు, అల్లాటప్పా కార్యక్రమాలు, పక్కా దిశారహిత పార్టీ కార్యాచరణ… ఎస్, కాంగ్రెస్ పార్టీగా వేగంగా టీడీపీ రూపాంతీకరణ చెందుతున్నది…
ఇప్పుడు టీడీపీకి తనదైన సిద్ధాంతాలేమీ లేవు… అధికారంపై యావ తప్ప…
ఇప్పుడు టీడీపీకి సొంతమైన అస్థిత్వమేమీ లేదు… అంతా కలగూర గంప తప్ప…
ఇప్పుడు టీడీపీకి పాత తరం సూత్రాలేమీ పట్టవు… అంతా హైబ్రీడ్ కల్చర్ తప్ప…
ఇప్పుడు టీడీపీకి ఎన్టీయార్ నాటి డిసిప్లిన్ లేదు… అంతా కాంగ్రెస్ మార్కు అనార్కీ తప్ప…
ఇప్పుడు టీడీపీ అంటూ వేరే పార్టీ లేనే లేదు… కాంగ్రెస్ పార్టీకి మరో రూపం తప్ప…
వచ్చీపోయే నాయకులతో పార్టీ ఎందుకు మారదు మరి? మారుతుంది… ఇలాగే నిద్రపోతున్నట్టు… ఇలాగే కునికిపాట్లు పడుతున్నట్టు… ఇలాగే మత్తులో జోగుతున్నట్టు… ఇలాగే నామ్ కే వాస్తే పార్టీ అన్నట్టు… వేగంగా, శరవేగంగా… టీడీపీ కాంగ్రెస్ పార్టికి మరో రూపంగా రూపాంతరం చెందుతున్నది…
ఒక్కసారి పదవులు, నిధులు, కంట్రాక్టులు, అవకాశాలు అని గట్టిగా మాట్లాడండి చంద్రబాబు గారూ.,.. అందరి మత్తూ ఎగిరిపోతుంది… మన అల్టిమేట్ సిద్ధాంతాలు, పార్టీ కార్యాచరణ, పార్టీ లక్ష్యాలు, ఆచరణ అదే కదా… పర్లేదు… అందరినీ నిద్రలేపండి బాబు గారూ…