.
కృష్ణుడిని దేవుడిగా కాకుండా… ఒక మనిషిగా చూస్తే..! ఏదో డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద ఆసక్తికరమైన చర్చ కనిపించింది. కృష్ణుడిని దేవుడిగా కాకుండా, కేవలం ఒక మనిషిగా చూస్తే… అతని జీవితం ప్రస్తుత భారతదేశ చరిత్రలాగే కనిపిస్తుందని!
అంతర్గత కుట్రలు. బయటి నుంచి దాడులు. అనేక భాషలు, జాతులు, సంస్కృతులు, వైరుధ్యాలు. అంతే సంఖ్యలో దేశహితానికి వ్యతిరేకంగా సాగే కుట్రలు. అయినా నిలబడటం. అయినా ముందుకు నడవడం.
Ads
సరే… ఒక్కసారి కృష్ణుడిని దేవుడిగా కాదు, ఒక మానవమాత్రుడిగా చూద్దాం. దురదృష్టానికి ఒక రూపం ఉంటే… అది కృష్ణుడే కదా!
జైలు గదిలో జన్మించాడు.
తండ్రి కాళ్లకు సంకెళ్లు.
భయంలో మూర్ఛిల్లిన తల్లి.
చల్లని గోడలు.
చుట్టూ భయం.
పుట్టిన క్షణం నుంచే అతని తలపై మరణశాసనం వేలాడుతోంది.
అతని సొంత మేనమామే అతన్ని చంపాలని ఎదురుచూశాడు.
తల్లి పాలు కూడా తాగలేదు.
పుట్టిన కొద్ది గంటల్లోనే భారీ వర్షంలో యమున దాటించబడ్డాడు.
పైన వర్షం.
వెనక మరణం.
చుట్టూ చీకటి.
రాజకుమారుడిగా పుట్టాడు.
గొల్లబిడ్డగా పెరిగాడు.
మాటలు కూడా సరిగా రాకముందే పూతన వచ్చింది.
తర్వాత శకటాసురుడు.
తర్వాత తృణావర్తుడు.
తర్వాత కాళీయుడు.
ఒక్కరి తర్వాత ఒకరు.
విధి అతన్ని ప్రత్యేకంగా ద్వేషించినట్టే అనిపిస్తుంది.
అయినా…
అతను నవ్వుతూనే ఉన్నాడు.
పెద్దవాడయ్యేదాకా రాజవిద్యలు లేవు.
గోకాపరిగా జీవితం.
తర్వాత ఆ బృందావనం కూడా దూరమైంది.
రాధతో సహా.
అవును… ఆమె కూడా.
అతని అత్యంత సన్నిహిత మిత్రుడు సుదాముడు జీవితాంతం పేదరికంలోనే జీవించాడు.
తాను ప్రేమించిన వారందరినీ కృష్ణుడు కాపాడలేకపోయాడు.
శిశుపాలుడు అందరి ముందు అతన్ని పదేపదే అవమానించాడు.
రాజుల సభలోనే.
కృష్ణుడు ప్రశాంతంగా విన్నాడు.
తర్వాత జరాసంధుడు వచ్చాడు.
ఒక్కసారి కాదు.
రెండుసార్లు కాదు.
పదిహేడు సార్లు.
మథుర మళ్లీ మళ్లీ అగ్నికి ఆహుతైంది.
ఆ తర్వాత వచ్చింది…
అత్యంత పెద్ద విషాదం.
కురుక్షేత్రం.
దాన్ని ఆపడానికి కృష్ణుడు తన వంతు ప్రయత్నం చేశాడు.
స్వయంగా వెళ్లాడు.
దుర్యోధనుడి ముందు కూర్చున్నాడు.
శాంతి కోరాడు.
కేవలం ఐదు గ్రామాలైనా ఇవ్వమన్నాడు.
దుర్యోధనుడు నిరాకరించాడు.
పద్దెనిమిది రోజుల తర్వాత…
నదులు రక్తాన్ని మోశాయి.
లక్షలాది ప్రాణాలు నేలరాలాయి.
ఒక మహా నాగరికత ఖననం అయింది.
దహనం అయింది.
ఆ నిశ్శబ్దాన్ని…
ఆ నిందను…
ఆ బాధను…
కృష్ణుడే మోశాడు.
విధిని నిందించలేదు.
ఆకాశాన్ని ప్రశ్నించలేదు.
కేవలం నిశ్శబ్దం.
ఆ తర్వాత గాంధారి శపించింది.
దుఃఖంతో కుమిలిపోయిన తల్లి తన బాధకు అతడినే కారణమని నిందించింది.
కృష్ణుడు ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు.
అదే ఆధ్యాత్మిక బలం.
తర్వాత చివరి పతనం వచ్చింది.
అతని సొంత వంశమే తనను తాను నాశనం చేసుకుంది.
మద్యం.
హింస.
ఉన్మాదం.
యాదవులు ఒకరినొకరు చంపుకున్నారు.
ఆ కల్లోలంలో అతని కుమారుడు కూడా మరణించాడు.
కృష్ణుడు చూస్తూ ఉండిపోయాడు.
ఎందుకంటే…
కొన్ని ముగింపులను ఎవరూ ఆపలేరు.
తర్వాత ద్వారక మునిగిపోయింది.
అతని నగరం.
అతని కల.
అతని జీవితసాధన.
అన్నీ సముద్రంలో కలిసిపోయాయి.
చివరకు…
రాజులు భయపడిన వ్యూహకర్త.
ఋషులు ఆరాధించిన మహనీయుడు.
ఒక అడవిలో ఒంటరిగా మరణించాడు.
ఒక బాణం.
ఒక వేటగాడి పొరపాటు.
సింహాసనం లేదు.
సైన్యం లేదు.
వీడ్కోలు సభ లేదు.
చెట్ల నీడలో నిశ్శబ్దం మాత్రమే.
అయినా…
అతడే “పూర్ణ పురుషుడు”.
ఎందుకంటే జీవితం అతనిపై కరుణ చూపిందని కాదు.
బాధ అతని మనసును విషపూరితం చేయలేకపోయింది కాబట్టి.
అదే కృష్ణుని మహత్తు.
అద్భుతాలు కాదు.
అలౌకిక శక్తులు కాదు.
పురాణ గాథలు కాదు.
జీవితం అతనికి బాధను ఇచ్చింది.
అతను ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చాడు.
జీవితం అతనికి ద్రోహాన్ని ఇచ్చింది.
అతను మానవాళికి గీతను ఇచ్చాడు.
జీవితం అతనికి యుద్ధాన్ని ఇచ్చింది.
అతను ప్రపంచానికి వైరాగ్యాన్ని నేర్పాడు.
ఆ గందరగోళం మధ్యలో…
అతను మనకు ఒక శాశ్వత సత్యాన్ని వదిలి వెళ్లాడు.
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.”
నీ అధికారం కర్మపై మాత్రమే.
ఫలితంపై కాదు.
కృష్ణుడు పారిపోవడం నేర్పలేదు.
భరించడం నేర్పాడు.
కృత్రిమ సానుకూలతను బోధించలేదు.
బాధ్యతను బోధించాడు.
నరకం మధ్యలో నిలబడి…
నువ్వే నరకంగా మారకుండా ఎలా ఉండాలో నేర్పాడు.
అందుకే కృష్ణుడు ఇప్పటికీ నవ్వుతూనే ఉంటాడు….
బహుశా… అందుకే భారత్ కూడా ఇప్పటికీ నిలబడి ఉంది. ఆ నందగోపాలుడు చూపిన బాటలో నడుస్తూ…”
Share this Article