Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?

June 20, 2026 by M S R

.

ఎలా స్పందించాలో, ఏమని విశ్లేషించాలో కూడా అర్థం కావడం లేదు… ఈ అకృత్యానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు… ముందుగా ‘ఆంధ్రజ్యోతి’ కవర్ చేసిన ఓ వార్త సారాంశం చదవండి… ఇందులో ఆకలి ఉంది, పేదరికం ఉంది, వలస వెత ఉంది, ఆకలి పురిగొల్పిన నేరం ఉంది, ఆ నేరంలో కన్నబిడ్డను అంగడి సరుకును చేసిన నిస్సహాయత కూడా ఉంది… ఇది అక్షరాలా సరోగసీ కాదు, ఇది వ్యభిచారం అసలే కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా కాదు… మరేమిటి..?

అసోం, పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది నిరుపేదలు పటాన్‌చెరు, రుద్రారం పారిశ్రామికవాడల్లో పని చేసుకుంటున్నారు! వీరినే లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా శిశు విక్రయాలకు తెరలేపింది! విచిత్రంగా… ఈ ముఠా కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిందే!

Ads

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద గర్భిణులను ఈ ముఠా ముందుగా గుర్తిస్తుంది! గర్భంతో ఉండగానే వారితో ఒప్పందం కుదుర్చుకుంటుంది! ఆస్పత్రి ఖర్చులు భరిస్తుంది! బిడ్డ పుట్టిన తర్వాత కన్నవారి మనసు మారిపోతుందనే భయంతో… పొత్తిళ్లలో ఉండగానే శిశువును తీసుకుని సరిహద్దులు దాటించేస్తుంది!

పశ్చిమ బెంగాల్‌, అసోం, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలతోపాటు వాటి సరిహద్దుల్లోని బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాల నుంచీ అక్రమ వలసదారులు ఇక్కడికి వస్తారు. బార్డర్‌ దాటిన తర్వాత అక్కడి రాష్ట్రాల్లోనే ఆధార్‌ కార్డులు తయారు చేసుకుంటున్నారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి పటాన్‌చెరు, రుద్రారం పారిశ్రామికవాడలకు చేరుకుంటున్నారు…

ఓ ముఠా శిశు విక్రయాల దందా చేస్తోంది వీళ్లతో. రుద్రారం, ఇస్నాపూర్‌, చిట్కుల్‌, ముత్తంగి, పటాన్‌చెరు ప్రాంతాల్లోని ప్రవేటు క్లినిక్‌లతో ఆ ముఠా కుమ్మక్కు. పుట్టిన పిల్లలను విక్రయిస్తే లక్షన్నర నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చేలా ఒప్పందాలు… అడ్వాన్స్‌ రూ.10వేల నుంచి రూ.50 వేల వరకు…పుట్టిన వెంటనే శిశువును స్వాధీనం చేసుకుని, మిగిలిన డబ్బులు చెల్లించి దేశ సరిహద్దులకు తరలిస్తారు.

రుద్రారం గ్రామంలో ఓ 17 ఏళ్ల బాలిక (మైనర్) కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమె వద్ద అసోంలో జారీ చేసిన ఆధార్‌ కార్డు ఉంది. ఇటీవల ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ఆమె గర్భిణిగా ఉన్నప్పుడే తల్లి, భర్త శిశు విక్రయాల ముఠాతో ఒప్పందం చేసుకున్నారు.

కానీ, పుట్టిన తర్వాత బిడ్డను ఇవ్వడానికి ఆ తల్లి ఒప్పుకోలేదు. అడ్వాన్స్‌ ఇచ్చిన ముఠా సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టి హింసించారు. దీంతో, ఆ మైనర్‌ తల్లి సాయం కోసం చుట్టుపక్కల వారిని వేడుకుంది. రక్షణ కోసం ఆమె స్వయంగా 100 నంబర్‌కు ఫోన్‌ చేసింది…

ఇదీ మొదటి వార్త… మరుసటి రోజు ఫాలో అప్ న్యూస్ ఏమిటంటే..? శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పలు విభాగాల అధికారుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

  • బిడ్డను విక్రయించేందుకు చివరి నిమిషంలో నిరాకరించిన ఆ బాలిక వివాహం కాకుండానే తల్లి అయినట్లు గుర్తించారు. ఆమెకు పుట్టే బిడ్డను విక్రయించేందుకు ఆ బాలిక తల్లి ఇద్దరు వ్యక్తులను ఆమెతో సంబంధానికి పురికొల్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుమారు ఏడు నెలలపాటు ఒకరు.. ఆ తర్వాత మరొకరు ఆ బాలికతో కలిసి ఉన్నట్లు గుర్తించారు.

బాలికను తల్లిని చేసిన వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వినాయకరావు తెలిపారు. అలాగే, బిడ్డను విక్రయించేందుకు తొలుత అంగీకరించినందుకు ఆ బాలికపైనా కేసు నమోదు చేస్తామని చెప్పారు.

బాధితులు ఎవరు? నిందితులు ఎవరు? ఇందులో నేరం ఏమిటి? సమాజం చూపే పరిష్కారం ఏమిటి? అన్నీ ప్రశ్నలే… తల్లి స్వయంగా తన బిడ్డ గర్భం కోసం ఇద్దరితో నెలల తరబడీ పండబెట్టడం ఏమిటి..? (ఈ పదం కటువుగా ఉన్నా నిజం మాత్రం అదే- ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం) దానికి ముందే శిశు విక్రయానికి ఒప్పందం ఏమిటి..? ఈ నేరం పేరేమిటి..?

సరే, మైనర్ కాబట్టి, శిశువును పుట్టించడానికి ఆమెతో ‘సంబంధం నెరిపిన’ వారి నేరాన్ని ఏమనాలి..? పోక్సో వర్తిస్తుంది కాబట్టి పెట్టేశారు, మరి తల్లి నేరం మాటేమిటి..? ఏతావాతా ఆ బాలిక కూడా నేరస్థురాలైపోయింది ఇందులో… ఆమె బాధితురాలా..? నిందితురాలా..? ఇలాంటి ఒప్పందాలతో, అకృత్యాలతో పుట్టబడిన ఆ శిశువు ఏం పాపం చేసుకుందో కదా..!!

చివరగా… ఓ నాయకుడి కొడుక్కి ఎవరితోనో సంబంధం… అందులో రాజకీయాలు వేలుపెట్టాయి… రచ్చ చేశాయి… రెండు ప్రధాన పార్టీల్లోని ముఖ్యులు గాయిగత్తర లేపారు… పోక్సో కేసు పెట్టబడింది… ఈ ప్రైవేటు ఎఫయిర్స్ పట్టి, రోజూ దానిమీదే గొంతు చించుకునే గొట్టాలు, గళాలు రుద్రారంపై కదా ఫోకస్  పెట్టాల్సింది… నేరం గురించి కాదు (అసలది నేరమేనా) ఆ నేరానికి పురిగొల్పే ఆ బతుకుల్లోని నిస్సహాయతపై కదా..!!! ఇది ఒక “సామాజిక విపత్తు” (Societal Catastrophe)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?
  • కొత్త స్కూల్ కిట్..! యాభై ఏళ్ల క్రితం కథ… నేటికి నేరవేరిన ఓ కల..!
  • Ban on Cough Syrup – డాక్టర్ చీటి రాసిస్తే ఆ విషం తాగొచ్చా..?!
  • ‘మా ఇంటి బంగారం – సమంతకన్నా మంజూష ఎక్కువ మెరిసింది
  • అప్పట్లో ‘స్వాతి’ – తరువాత ‘మా నాన్నకు పెళ్లి’ – ఇప్పుడు ‘వంద దేవుళ్లు’
  • Iran War – కాగితాలపైనే శాంతి ఒప్పందాలు – తొలగని యుద్ధ మేఘాలు
  • యూట్యూబ్ స్టార్ నాగదుర్గ- మూవీల్లో క్లిక్కయితే మరో సాయిపల్లవి…
  • Ira Aery… ఓ ఫిమేల్ వైభవ్ ..! హఠాత్తుగా క్రికెట్ క్రష్ అయిపోయింది..!!
  • సింగిల్ మాల్ట్ Vs బ్లెండెడ్… స్కాచ్ రకాలపై అపోహలు- నిజాలు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions