.
చందాల చోరీతో అప్రతిష్ట పాలైన అయోధ్య రామమందిరం నిర్వహణ, పాలనను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది… కీలకమైన మార్పు ఆ ట్రస్టుకు కొత్త సీఈవోగా నియామకం… రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపిక చాలామందిని ఆశ్చర్యపరిచింది… కానీ తన నియామకం చాలా వడబోతలు, పరీక్షల నడుమ సాగింది…
5,585 మందిలో ఒకరు… రామమందిరం తొలి CEOగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎందుకు? అయోధ్య రామమందిరం అంటే కేవలం ఓ ఆలయం కాదు.
రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చే ప్రదేశం. ఓ జాతి విశ్వాసం కొలువైన గుడి… వేల కోట్ల రూపాయల విరాళాలు, విస్తరిస్తున్న ఆలయ ప్రాంగణం, భద్రత, సిబ్బంది, వీఐపీల రాకపోకలు, ధార్మిక కార్యక్రమాలు, అంతర్జాతీయ అతిథులు… ఇవన్నీ ఒకేసారి నిర్వహించాల్సిన వ్యవస్థ.
Ads
అందుకే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తొలిసారి పూర్తిస్థాయి CEOని నియమించాలనుకున్నప్పుడు… ఏదో ఒక రిటైర్డ్ అధికారి పేరును తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. దేశవ్యాప్తంగా ఒక భారీ ఎంపిక ప్రక్రియ చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులు. అక్కడి నుంచి మొదలైన వడపోత చివరకు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా దగ్గర ఆగింది. సెప్టెంబర్ 2న ట్రస్టు ఆయన పేరును ఖరారు చేసింది.
5,585 నుంచి ఒకరి వరకు… అసలు ఏం జరిగింది? ఇదే ఈ నియామకంలో ఆసక్తికరమైన అంశం. తొలి దశలో 5,585 దరఖాస్తులు వచ్చాయి. అందులో 3,877 మంది తమ పూర్తి CVలు సమర్పించారు. అభ్యర్థుల నిర్వహణ సామర్థ్యం, పెద్ద సంస్థలు,పెద్ద కార్యక్రమాలను నిర్వహించిన అనుభవం, వ్యక్తిగత ప్రతిభ, భాషా ప్రావీణ్యం, భవిష్యత్ విజన్, వ్యూహాత్మక ఆలోచన వంటి అంశాలపై పరిశీలన జరిగింది.
తర్వాత దాదాపు 111 మందిని ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌కు పిలిచారు. ఆ వడపోతలో చివరకు 16 మంది వ్యక్తిగత ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. ఆగస్టు 11, 12 తేదీల్లో అయోధ్యలోని రామమందిరం ప్రాంగణంలో వారిని ఇంటర్వ్యూ చేశారు.
ఇక్కడ మరో విశేషం ఉంది… ఈ ఎంపికను పరిశీలించిన సెర్చ్ కమిటీలో రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వీకే చతుర్వేది, న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ సురేశ్ హవ్రే ఉన్నారు. అంటే కేవలం బ్యూరోక్రాటిక్ అనుభవం చూసే కమిటీ కాదు; న్యాయ, రక్షణ, సాంకేతిక రంగాల అనుభవం కలగలిపిన బృందం.
ఆ తర్వాత ముగ్గురితో కూడిన తుది ప్యానెల్‌ను ట్రస్టుకు పంపారు. ఆ ముగ్గురి పేర్లను అధికారికంగా బయటపెట్టలేదు. సెప్టెంబర్ 2న ట్రస్టు తుది నిర్ణయం తీసుకుని జితేంద్ర మిశ్రాను తొలి CEOగా ఎంపిక చేసింది.
అంటే… 5,585 → 3,877 → 111 → 16 → 3 → 1 … ఇదీ రామమందిరం తొలి CEO ఎంపిక ప్రయాణం.

మరి జితేంద్ర మిశ్రాలో అంత ప్రత్యేకత ఏమిటి? ఇక్కడే అసలు కథ ఉంది. జితేంద్ర మిశ్రా సాధారణ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి కాదు. ఆయన భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా 1986 డిసెంబర్ 6న చేరారు. దాదాపు 38 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అత్యంత కీలకమైన కమాండ్, స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు.
3,000 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం. ఫైటర్ కాంబాట్ లీడర్. ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్. ఫైటర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్. రెండు ఫ్రంట్‌లైన్ ఎయిర్‌బేస్‌ల ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్. Aircraft and Systems Testing Establishment (ASTE)లో చీఫ్ టెస్ట్ పైలట్, తర్వాత కమాండెంట్. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌లో కీలక బాధ్యతలు. ఆ తర్వాత Deputy Chief of Integrated Defence Staff (Operations).
2025 జనవరి 1న ఆయన భారత వైమానిక దళంలోని అత్యంత కీలకమైన Western Air Command కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కమాండ్ పరిధిలో దేశంలోని అత్యంత సున్నితమైన గగనతల ప్రాంతాలు ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు…
అంతేకాదు… ఆయనకు అతి విశిష్ట సేవా పతకం (AVSM), విశిష్ట సేవా పతకం (VSM) లభించాయి. అంటే 5,585 మంది దరఖాస్తుదారుల మధ్య నిలబెట్టినప్పుడు… ఆయన CVలో కేవలం ఉద్యోగాల జాబితా లేదు. దశాబ్దాల కమాండ్, ఆపరేషనల్ డెసిషన్ మేకింగ్, పెద్ద వ్యవస్థల నిర్వహణ, సంక్షోభ పరిస్థితుల్లో నాయకత్వం ఉన్నాయి.
రామమందిరానికి సరిగ్గా ఇవే ఎందుకు అవసరం? ఇదే జితేంద్ర మిశ్రా ఎంపికకు ఉన్న బలమైన కారణంగా చూడాలి. రామమందిరం CEO పని కేవలం ఆఫీసులో కూర్చుని ఫైళ్లపై సంతకాలు చేయడం కాదు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తుల రద్దీని నిర్వహించాలి. భద్రతా సంస్థలతో సమన్వయం చేయాలి. వేలాది సిబ్బంది, వాలంటీర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు పనిచేసే వ్యవస్థను నడపాలి.
వీఐపీలు, వీవీఐపీలు, సాధువులు, ధార్మిక ప్రముఖులు, దేశవిదేశాల నుంచి వచ్చే అతిథులతో వ్యవహరించాలి. ఆలయ ఆచారాలు, పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, భక్తుల సౌకర్యాలు, ఇవన్నీ ఒకే వ్యవస్థలో సమన్వయం చేయాలి.
మరీ ముఖ్యంగా… వచ్చే కాలంలో రామమందిరం మరింత భారీ సంస్థగా మారబోతోంది. అలాంటి వ్యవస్థకు కేవలం ఫైళ్లు నడిపే అధికారి కంటే, పెద్ద వ్యవస్థను కమాండ్ చేయగల వ్యక్తి అవసరం. మిశ్రా కెరీర్ చూస్తే ఆ అనుభవం కనిపిస్తుంది.
మరో కీలకమైన విషయం—ఆపరేషన్ సిందూర్… జితేంద్ర మిశ్రా పేరు ఇటీవలి కాలంలో మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణం కూడా ఇదే. ఆయన Western Air Commandకు నాయకత్వం వహించిన సమయంలోనే ఆపరేషన్ సిందూర్ జరిగింది.
ఆ ఆపరేషన్‌కు సంబంధించిన అనుభవాలపై ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా వార్తల్లో నిలిచాయి. S-400 వ్యవస్థ పనితీరు, పాకిస్థాన్ దాని స్థానాన్ని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలపై ఆయన పలు విషయాలు వెల్లడించారు.
మొత్తంగా సర్వీసులో ఆయన నిబద్ధత, సాహసం, నిజాయితీ వంటి చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారు… అయోధ్యకు ఓ మిలిటరీ పర్సనాలిటీ నేతృత్వం కావాలనే భావనతో ఈయన్ని ఎంపిక చేశారు… నిర్మాణం నుంచి ఇప్పుడు నిర్వహణ దశలోకి వచ్చింది గుడి… ఇప్పుడే సరైన లీడర్ అవసరం… ఆలస్యమైనా సరైన ఎంపికే జరిగింది…
Share this Article