Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జనానికి కాదమ్మా విజయమ్మా… నీ బిడ్డ షర్మిలకు కదా చెప్పాల్సింది…

October 29, 2024 by M S R

అమ్మా, విజయమ్మా… ఎప్పుడూ చేతిలో బైబిల్ పెట్టుకుని, దేవుడిని ప్రార్థిస్తూ కనిపించే నీ నుంచి చాలా విచిత్రమైన ఓ బహిరంగ లేఖ కనిపించడం ఆశ్చర్యంగా ఉంది…

నిజాయితీగా కొన్ని విషయాలు చెబితే బాగుండేది… పదే పదే వైఎస్ గురించి చెబుతున్న తమరు అదే వైఎస్ కనబరిచిన ఓపెన్ మెండెడ్‌నెస్ చూపించలేకపోయారు…

ఏ తెలంగాణనైతే విపరీతంగా ద్వేషించిందో అదే తెలంగాణను ఉద్దరిస్తానని నీ బిడ్డ షర్మిల బయల్దేరిందో అప్పుడే ఆమె, ఆమెకు మద్దతుగా ఉన్న తమరు తెలంగాణ జనంలో విశ్వసనీయతను, కాస్తో కూస్తో వైఎస్ కారణంగా మీమీద ఉన్న పాజిటివిటీని కోల్పోయారు…

Ads

చివరకు నీ మనమడు రాజారెడ్డి పెళ్లి తంతును పక్కాగా హిందూ పద్ధతిలో చేసి, తీరా ఏదో ప్రార్థనస్థలానికి వెళ్లి, అబ్బే, అక్కడ పుస్తె లేదు, మాంగల్యం లేదు, జస్ట్ క్రాస్ మాత్రమే మెడలో వేయించాం అని చెప్పినప్పుడు తెలుగు ప్రజానీకానికి తగిలిన షాక్ మామూలుది కాదు… మరెందుకు ఆ హిందూ తంతు నాటకం..?

చివరకు తెలంగాణను ఉద్దరించీ- రించీ ఆమె తన పార్టీని…. ఏ కాంగ్రెస్ అయితే నీ కుటుంబాన్ని బదనాం చేసిందో, నీ కొడుకును జైలుపాలు చేసిందో, నీ భర్త పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టిందో అదే కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసినప్పుడు నువ్వు వ్యతిరేకించలేదు కదా, అప్పుడు వైఎస్ తాలూకు గౌరవాన్ని కోల్పోయావు… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం…

బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్… అవును, నువ్వు కొత్తగా చెప్పనక్కర్లేదు… రేప్పొద్దున షర్మిల, జగన్ ఒక్కటవుతారు అంటున్నావు… మరి ఈ విభేదాల కథలో ఈరోజుకూ నువ్వు ఎందుకు కలగజేసుకోలేదు… షర్మిల జగన్‌ను బజారులో పెట్టి కడిగేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు..?

అయ్యో, మా కుటుంబం గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడకండీ అంటున్నావు సరే… మరి ఇప్పుడు విపరీతంగా నువ్వు నమ్మిన నీ బిడ్డ షర్మిలే చెబుతోంది… నువ్వు ఏడుస్తున్నావట… జగన్‌ను చిన్నప్పుడే చంపేసి ఉంటే బాగుండేది అని… నిజమా..? నీ బహిరంగ నిజాయితీ లేఖలో ఆ ప్రస్తావన లేదేమిటి..? నువ్వు ఎందుకు ఖండించవు…

నీ పిల్లలిద్దరూ నీకు సేమ్ అయినప్పుడు, వాళ్లిద్దరూ మళ్లీ రక్తబంధంతో ఒక్కటవుతారని చెబుతున్నావు గానీ… జగన్ మీద, అంటే నీ కొడుకు మీద నువ్వు అంత సీరియస్ కామెంట్లు చేస్తున్నావని నీ బిడ్డే చెబుతోంది… అదెందుకు ఆ లేఖలో చెప్పలేదు…

పోనీ, నీ కోడలు భారతితో ప్రాబ్లమా..? జగన్‌ను పూర్తిగా చెడగొట్టింది ఆమేనా..? అందుకే నువ్వు జగన్ కుటుంబంతో దూరమయ్యావా..? రాజారెడ్డికి అమ్మమ్మవు తప్ప, జగన్ పిల్లలకు నాన్నమ్మవు కావా..? పైగా ఈరోజుకూ జనం, వైఎస్, ప్రేమ అనే పడికట్టు పదాలు దేనికి..?

నువ్వు రోజూ చేతిలో పట్టుకుని తిరిగే బైబిల్ ఓ అద్భుతమైన నీతిబోధ చేస్తుంది… తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని… నీ లేఖలో ఆ నిజాయితీ ఏది..? ఆ నీతి ఏది…? ఎంతసేపూ నీ బిడ్డను వెనకేసుకు రావడం తప్ప నిజాయితీగా నిజాల్ని చెప్పిందెక్కడ..?

భర్తను కోల్పోయి పూర్తిగా దేవుడి ప్రార్థనల్లో మునిగినట్టు కనిపించే నీ లేఖలో నీ మాటల్లో ఒక బిడ్డ పట్ల పక్షపాతం, ఒక బిడ్డ పట్ల వ్యతిరేకత దేనికి..? వైవీ, సాయిరెడ్డి బయటికి వచ్చి ఏదో మాట్లాడాక నీకు అర్జెంటుగా దుఖం వస్తోంది గానీ… నీ బిడ్డ షర్మిల కొద్దిరోజులుగా జగన్‌ను చాకిరేవు పెడుతుంటే మాట్లాడలేదేం..?

వైఎస్ సీఎం గాకముందు ఆయన ఆస్తులెన్ని..? నీకు తెలియదా..? ఆయన ఏవేవో ఆస్తులు రాసిచ్చాడట పిల్లలకు..? జగన్ ఎంవోయూ అట… ఉల్లంఘించకూడదట… మరి ఇదే నిజాయితీ, ఇదే ప్రేమ షర్మిల నుంచి కొరవడింది దేనికి..? నువ్వు తల్లిగా పోషించిన పాత్ర ఏముంది..?

అమ్మా విజయమ్మా… జగన్ దుర్మార్గుడా..? షర్మిల దుర్మార్గురాలా..? జరుగుతున్న పరిణామాలను బట్టి జనం అంచనా వేసుకుంటారు… హఠాత్తుగా తెర మీదకు వచ్చి, అబ్బే, వాళ్లిద్దరూ ఒకటే, మీరెవరూ మాట్లాడకూడదు అంటే… అదెలా..? ఇద్దరూ రెండు పార్టీలకు ప్రెసిడెంట్లు… సంపాదించిన సొమ్ము ప్రజాధనమే… ఎవడూ మాట్లాడకూడదు అని నువ్వు నిర్దేశించడం ఏమిటి తల్లీ..!!

వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న నిన్ను తొలగించే సిట్యుయేషన్ ఎందుకొచ్చింది..? అది తెలుగు ప్రజానీకం అడుగుతున్న ప్రశ్న… అన్నింటికీ మించి జగన్‌ను చిన్నప్పుడే చంపేస్తే బాగుండేదని ఏడిచావా..? ఎందుకు..? నీ బిడ్డ షర్మిల చెప్పిన మాట నిజమేనా…? ఎవరిది తప్పు..? అదే ముందుగా చెప్పు..!!

బహిరంగంగా మాట్లాడకండి ప్లీజ్ అంటున్నావు కదా… ఎవరు మాట్లాడుతోంది..? నువ్వు వెంట ఉన్న నీ బిడ్డ షర్మిలే… జగన్‌ను కడిగేస్తోంది… నువ్వు ముందుగా జనానికి కాదు, నీ పిల్లలకు చెప్పు… ప్రత్యేకించి నీ బిడ్డ షర్మిలకు కదా చెప్పాల్సింది… ప్రజలకు పిలుపులు దేనికి..? బజారులోకి వచ్చాక జనం నానారకాలుగా చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు… పైగా అదంతా ప్రజల సొమ్ము… మాట్లాడకూడదంటే ఎలా తల్లీ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…
  • పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…
  • ‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’
  • మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…
  • అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…
  • ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…
  • మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
  • ‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
  • జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను రపారపా నమిలేశాడు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions