.
మొన్నటి వరకు ఇది కేవలం భక్తి వ్యవహారంగా కనిపించింది. కానీ గత రెండు వారాల్లో జరిగిన రెండు పరిణామాలు మళ్లీ ఈ చర్చను తెరపైకి తెచ్చాయి. మాజీ తమిళనాడు సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ కర్ణాటకలోని నిమిషాంబ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఉడుపి జిల్లాలోని కొల్లూరు మూకాంబిక ఆలయానికి వెళ్తున్నారు.
ఇది యాదృచ్ఛికమా? లేక తమిళ రాజకీయాలకు, కర్ణాటక శక్తి పీఠాలకు మధ్య ఏదైనా ప్రత్యేక అనుబంధం ఉందా?
Ads
మూకాంబిక… తమిళుల “రాజకీయ అమ్మవారు”…
కర్ణాటకలోని ఉడుపి జిల్లా కొల్లూరులో ఉన్న Kollur Mookambika Temple దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. తమిళ సినీ, రాజకీయ రంగాలతో ఈ ఆలయానికి దశాబ్దాల అనుబంధం ఉంది.
మాజీ సీఎం J. Jayalalithaa 2004లో ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు విజయ్ వెళ్తున్నాడు, జయలలిత తర్వాత ఈ ఆలయాన్ని సందర్శిస్తున్న రెండో తమిళనాడు సీఎంగా నిలుస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు Ilaiyaraaja ఈ దేవిపై అపారమైన భక్తి కలవారిగా పేరొందారు. ఆలయానికి కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు కూడా సమర్పించారు.
తమిళ సినీ ప్రముఖుల్లో చాలామంది తమ పిల్లల విద్య, రాజకీయ భవిష్యత్తు, ఎన్నికల విజయాల కోసం ఇక్కడ మొక్కులు పెట్టడం కొత్త విషయం కాదు.
మూకాంబికను సరస్వతి, లక్ష్మి, పార్వతి త్రిశక్తుల సమ్మేళనంగా భావిస్తారు. అందుకే “విద్య, అధికారం, ఐశ్వర్యం” కోరుకునే వారి మొదటి గమ్యంగా ఈ ఆలయం మారింది.
నిమిషాంబ… కోరికలను “నిమిషంలో” తీర్చే అమ్మవారు….
మాండ్యా జిల్లా శ్రీరంగపట్టణ సమీపంలోని Sri Nimishamba Temple కూడా తమిళ రాజకీయ కుటుంబాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
దుర్గా స్టాలిన్ ఇటీవల ఇక్కడికి వచ్చి “ఉడి సేవೆ”తో పాటు ప్రత్యేక పూజలు చేశారు. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ పేర్లతో అర్చనలు కూడా నిర్వహించారు.
స్థానిక విశ్వాసం ప్రకారం: అమ్మవారు భక్తుల కోరికలను “నిమిషంలో” నెరవేరుస్తారట. అందుకే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇక్కడికి తరచూ వస్తుంటారు.
చాముండేశ్వరి కూడా అదే జాబితాలో…
దుర్గా స్టాలిన్ నిమిషాంబ దర్శనం తర్వాత మైసూరు కొండపై ఉన్న Chamundeshwari Temple ను కూడా సందర్శించారు. మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి చెందిన చాముండేశ్వరి దేవి కర్ణాటక రాజవంశాల కులదేవతగా పరిగణించబడుతుంది. అధికారంలో ఉన్నవారు, అధికారాన్ని కోరుకునేవారు ఇక్కడకు రావడం చాలాకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం.
తమిళనాడులో దేవాలయాలు లేవా?… అసలు ప్రశ్న ఇదే. మీనాక్షి, కామాక్షి, కన్యాకుమారి భగవతి వంటి మహాక్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. అయినా కర్ణాటక ఆలయాలపై ప్రత్యేక ఆకర్షణకు మూడు కారణాలు కనిపిస్తాయి….
1. రాజకీయ సంప్రదాయం… ఎంజీఆర్ కాలం నుంచి జయలలిత వరకు అనేక ప్రముఖులు కర్ణాటక శక్తి పీఠాలను సందర్శించారు. ఒకసారి రాజకీయ వర్గాల్లో ఏదైనా క్షేత్రం “సెంటిమెంట్”గా మారితే అది తరతరాలకు కొనసాగుతుంది.
2. గోప్యత… చెన్నైలోని ప్రముఖ ఆలయాలకు వెళ్తే భారీ రాజకీయ సందేశాలు వెళ్తాయి. కర్ణాటకలోని ఆలయాల్లో కొంత ప్రశాంతంగా, మీడియా హడావుడి లేకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
3. శక్తి పీఠాల విశ్వాసం… మూకాంబిక, నిమిషాంబ, చాముండేశ్వరి వంటి దేవాలయాలు “విజయం”, “అధికారం”, “విద్య”, “రక్షణ”కు సంబంధించిన విశ్వాసాలతో ప్రసిద్ధి చెందాయి. రాజకీయ నాయకులను ఇవి సహజంగానే ఆకర్షిస్తాయి.
విజయ్ పర్యటన కేవలం భక్తి యాత్రేనా?
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి మూకాంబిక దర్శనం. ఢిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన అనంతరం ఈ పర్యటన జరుగుతుండటం కూడా ఆసక్తికరమే. అధికారికంగా ఇది ఆధ్యాత్మిక యాత్రగానే చెబుతున్నప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిని “సెంటిమెంట్ పాలిటిక్స్” కోణంలో కూడా చూస్తున్నారు.
తమిళ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహాలు, కుల సమీకరణలు, సినిమా ప్రభావం ఎంత ముఖ్యమో… సెంటిమెంట్లు కూడా అంతే ముఖ్యమైనవి. ఆ సెంటిమెంట్ల జాబితాలో కర్ణాటక అమ్మవార్లు చాలాకాలంగా ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి. స్టాలిన్ కుటుంబం నిమిషాంబను ఆశ్రయిస్తే, విజయ్ మూకాంబికను దర్శిస్తున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా… కర్ణాటక శక్తి పీఠాలపై తమిళ రాజకీయాల విశ్వాసం మాత్రం తగ్గేలా కనిపించడం లేదు…
ఇక్కడ గమనించాల్సింది ప్రధానంగా వేరే... సీఎం జోసెఫ్ విజయ్ క్రిస్టియన్... కానీ హిందూ గుళ్లపై, దేవతలపై తనకు నమ్మకం ఉంది, దాన్ని ఏమీ దాచుకోడు... మూకాంబిక దర్శనం కూడా అదే... ఎస్, తను ఉదయనిధి స్టాలిన్ అసలే కాదు..!!
Share this Article