దేశంలో బీజేపీని నిలువరించడానికి ఓ బలమైన ప్రతిపక్షం కావాలి… కాంగ్రెస్ పార్టీ ఆ అవసరానికి తగినట్టుగా ఎదిగే సిట్యుయేషన్ లేకపోవడంతోనే సంకుచిత, ప్రాంతీయ, కుటుంబ, అవినీతి పార్టీల నేతలు కూడా తొడలు కొడుతున్నారు… అన్నీ ఒక్కచోట కుట్టేసి, ఓ బలమైన బొంత తయారు చేసి, కుర్చీ ఎక్కాలనే ఆశలు, ప్రయత్నాలు సాగుతున్నయ్… ఈ కప్పలతక్కెడ పార్టీల కూటములు గతంలో ఈ దేశాన్ని ఏ స్థితుల్లోకి నెట్టేశాయో చూశాం… ఆ పతనావస్థలో చంద్రబాబు కూడా పాత్రధారే… దాన్నలా వదిలేద్దాం…
నిజానికి ఎప్పుడైతే పార్టీలు తమ సొంత సిద్ధాంతకర్తలు, వ్యూహకర్తలు, మెచ్యూర్డ్ ప్రయత్నాల్ని విఫలం చేసుకున్నాయో, అప్పుడే ప్రశాంత్ కిషోర్ వంటి వోట్ల దళారులు, మానిప్యులేటర్స్ రంగంలోకి వచ్చారు… పోనీ, రాహుల్ గాంధీ చుట్టూ ఉండే కోటరీకి ఆ సోయి ఉండాలి కదా… వాళ్లే అసలు సమస్య… రాహుల్‌ను తమకు ఇష్టమైన ఎజెండా వైపు నెట్టుకుపోతున్నారు… దీనికితోడు కాంగ్రెస్ సీనియర్లు సైలెంటుగా ఉన్నారు… ప్రస్తుతం పార్టీలతో మాట్లాడి, లౌక్యంగా ఓ బలమైన కూటమిని నిర్మించే కేరక్టర్లు లేరు…
అన్నింటికన్నా ప్రధానలోపం రాహుల్ అపరిపక్వత… ప్లస్ అహం… ప్రస్తుత అస్సోం సీఎం హిమంతవిశ్వ శర్మ గతంలో కాంగ్రెసే… చేజేతులా రాహుల్ తన అహంతో దూరం చేసుకున్నాడు, అస్సోంలో కాంగ్రెస్‌ను బొందపెట్టింది అదే… సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా వంటి నవతరం నేతల్ని కూడా కాన్ఫిడెన్స్‌లోకి తీసుకోలేక… తనకంటూ ఓ ఎజెండా లేక… ఏం మాట్లాడాలో తెలియక కిందామీద పడుతున్న సీన్లు కనిపిస్తున్నయ్… పంజాబ్ కూడా ఇప్పుడు చేజారే దురవస్థ కనిపిస్తోంది…
Ads
నిన్న పార్లమెంటులో మాట్లాడుతూ అపరిపక్వ వ్యాఖ్యలకు దిగాడు… అఫ్‌కోర్స్, గతంలోనూ చేశాడు… చైనా, పాకిస్థాన్ దగ్గర కావడానికి మోడీయే కారణమని నిందించాడు… ఓ చిన్న పాయింట్, మనలోమనకు లక్ష ఉండవచ్చుగాక, దేశసమగ్రత, దేశ రక్షణ విషయంలో వ్యాఖ్యల దగ్గర సంయమనం అవసరం… సరిగ్గా అదే లోపించింది రాహుల్‌లో… గతంలో చాలాసార్లు తన బాల్యావస్థను చాటుకున్నాడు… ఇప్పుడూ అంతే… ఈ దేశ ప్రధాన ప్రతిపక్షానికి మంచి నాయకత్వం లేకపోవడం ఈ దేశ వర్తమాన విషాదం…
తనకు తెలియనట్టుంది… గల్వాన్‌లో చైనా తన 40 మంది సైనికులను పోగొట్టుకుందని తాజాగా ఆస్ట్రేలియా పత్రిక ఒకటి పరిశోధనాత్మక కథనం ప్రచురించింది… ఆ అక్కసుతోనే గల్వాన్ సైనికుడిని వింటర్ ఒలింపిక్స్‌కు టార్చ్ బేరర్‌గా ఎన్నుకుంది చైనా… అందుకే స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్ని బహిష్కరించేందుకు ఇండియా ఆలోచిస్తోంది… అంతేకాదు, పాకిస్థాన్‌లో బెలూచ్ తీవ్రవాదులు సైనిక శిబిరాలపై దాడి చేసి దాదాపు వంద మందిని హతమార్చారు… చైనా షాక్ తిన్నది…
రకరకాల అంతర్జాతీయ పరిణామాల మీద నాయకుడికి జ్ఞానం ఉండాలని లేదు, కానీ కోటరీ బాగుండాలి… రాహుల్ దురదృష్టం ఏమిటంటే… మెచ్యూర్డ్ కోటరీ లేకపోవడం… ఇక రాహుల్ మీద నమ్మకాలు పోయాయి… అందుకే మమత, కేసీయార్ వంటి ప్రాంతీయ శక్తులు ఢిల్లీ అధికారంపై ఆశలు పెంచుకుంటున్నయ్… లెఫ్ట్‌కు ఆత్మసమీక్ష లేదు, దిద్దుబాటు లేదు, మారాలనే ధ్యాసే లేదు… అదిక కాలగతిలో కనుమరుగు కావల్సిందే అనేంత సీన్ ఇప్పటికైతే…
ములాయం, శరద్ పవార్, లాలూ వంటి నేతల పని ముగిసింది… ఆ సిద్ధాంతాలకూ కాలం చెల్లింది… యాంటీ బీజేపీ బలమైన కూటమి కావాలంటే కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదు, కాంగ్రెస్ స్థితి చూస్తేనేమో ఈ ఏడుపు… ఇదే వర్తమాన దేశ విషాదం… బలమైన ప్రతిపక్షం లేకపోవడంకన్నా ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రధాన నష్టం ఏముంటుంది..?
Share this Article