నవీన్ పట్నాయక్‌ను అభినందించాలి… కాదు, ఆయన్ని ఆ కుర్చీ మీద అలాగే కొనసాగిస్తున్న ఒరిస్సా ప్రజల్ని అభినందించాలి… ఒక్క పొల్లు మాట లేదు, ప్రచార కండూతి లేదు, అబద్ధాలు లేవు, మాట తప్పడాలు లేవు, జనాకర్షక పథకాలు లేవు, కుటుంబ పాలన లేదు, తనకు అవినీతి అంటనివ్వడు… అసలు ఇవి కాదు, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా ఏ ఎస్ అయినా సరే, దొరికితే కేసులు పెట్టేయడం, వదిలించుకోవడం… కొడితే ఆ తిమింగిలాల్ని కొట్టాలి… చిన్న చిన్న చేపల్ని పట్టుకుని, పత్రికల్లో ఫోటోలు వేయించి, వార్తలు రాయించి, అదే ఘనతగా కాలర్లు ఎగరేయడం కాదు…
రాజకీయ నాయకులకన్నా, అక్రమ వ్యాపారులకన్నా, మాఫియా లీడర్లకన్నా… కేంద్ర సర్వీసుల అధికారులు సొసైటీకి ఎలా ప్రమాదకరంగా మారారో చాలా ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం కదా… సంపద అప్పనంగా వచ్చిపడుతోంది… నవీన్ తను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అవినీతి మీద స్థిరవైఖరే కనబరుస్తున్నాడు… (ఐనా తగ్గదు, అది ఇంకిపోయింది…) తాజాగా ఓ ఐఏఎస్ అధికారిని వదిలించుకున్నాడు…
బినోద్ కుమార్… అప్పట్లో ఓ సూపర్ సైక్లోన్ ఒరిస్సాను అతలాకుతలం చేసిన సంగతి తెలుసు కదా, ఆ సమయంలో రూరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బాధ్యతల్లో ఉన్న ఈయన పునర్నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున దండుకున్నాడు… అసలు తుపాన్ పునర్నిర్మాణం, పరిహారం విధులంటేనే అడుగడుగునా అవినీతి, అక్రమం… ఈయనపై విజిలెన్స్ కేసులు పెట్టింది… ఒకటి కాదు, రెండు కాదు, 27 కేసులు… కానీ మన వ్యవస్థలో ఒక ఐఏఎస్‌ను ఫిక్స్ చేయడం అంటే అంత వీజీ కాదు కదా…
Ads
సంవత్సరాలు దొర్లిపోతూనే ఉన్నయ్… 2018లో రెండు కోసుల్లో విజిలెన్స్ కోర్టు ఆయన్ని దోషిగా నిర్ధారించింది… మూడేళ్ల జైలు శిక్ష కూడా ఖరారు చేసింది… ప్రభుత్వం సస్పెండ్ చేసింది… మిగతా కేసులు నడుస్తున్నయ్… ఇప్పుడిక కోర్టు కూడా దోషి అనడంతో నవీన్ పట్నాయక్ కేంద్రానికి సిఫారసు చేశాడు… కేంద్రం వోకే అంది… ఆయన్ని కొలువు నుంచి తొలగించారు…
నిజానికి ఇలాంటి చాలామందిని సర్వీస్ నుంచి పంపించేస్తున్నది మోడీ ప్రభుత్వం… ఈయన్ని కూడా కంపల్సరీ రిటైర్‌మెంట్ కింద పంపించే పని స్టార్టయింది… ఒరిస్సాలోనే అభయ్‌కాంత్ పాఠక్ అనే ఐఎఫ్ఎస్ అధికారిని డిస్మిస్ చేశారు… కేసులు నడుస్తున్నయ్… కొన్నేళ్లలో బోలెడుమంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మీద కేసులు పెట్టాడు నవీన్… మేం అన్నింటికీ అతీతులం, ఈ వ్యవస్థ మమ్మల్ని ఏమీ చేయలేదు అనే కేంద్ర సర్వీసు అవినీతి అధికారుల మీద కొరడా ఝలిపిస్తున్న తీరే అబ్బురంగా ఉంది…!!
Share this Article