Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాహుల్ రొట్టె విరుస్తాడు… అది మోడీ చేతి నేతి గిన్నెలో పడుతుంది…

March 20, 2024 by M S R

రాహుల్ సెల్ఫ్ గోల్ ‘శక్తి’ … మోడీ ప్రచారాస్త్ర ‘శక్తి’

మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా; పశ్యంతి, మాధ్యమా, వైఖరి అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి ఆధారం. మొత్తంగా వాక్కు అగ్ని రూపం.
పెదవి దాటిన మాట వైఖరి- ఎదుటివారికి వినపడుతుంది. మిగతా మూడు దశల వాక్కు గొంతులో, మనసులో, నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటి వారికి వినపడదు.
మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల పదాలు, వాక్యాలు, భావాల భాష పరా పశ్యంతి మధ్యమ దాకా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి శరీర అవయవాల్లో భాష లేదా ధ్వనులు పుట్టి…మారి…బయటికి వినిపించడాన్ని ఇంత శాస్త్రీయంగా దర్శించిన పురాతన సమాజం ప్రపంచంలో బహుశా మనది తప్ప ఇంకేదీ ఉండకపోవచ్చు.

మెదడులో ఇదివరకే రికార్డ్ అయి ఉన్న మాటలను భావానికి అనుగుణంగా శబ్దం లేదా మాటగా తీసుకురావడం సెకనులో వెయ్యో వంతు సమయంలో ఆటోమేటిగ్గా జరిగినట్లు అనిపిస్తుంది కానీ- ఆటోమేటిగ్గా జరగదు. మన ప్రయత్నంతోనే శబ్దం బయటికి వస్తుంది. ఆలోచన మెదడుది. మాటలు అందించేది మెదడు. శబ్దం వినపడేలా చేసేది మన ఊపిరితిత్తుల్లోని గాలి. నాభి దగ్గర పైకి ప్రయాణించే గాలి గొంతులో స్వర పేటికలో తంత్రుల దగ్గర మూర్ఛనలు పోతుంది. ఆపై నోట్లో అనేక భాగాల కదలికలతో ఒక్కో అక్షరం పలుకుతుంది.

Ads

హనుమంతుడి మాటల నేర్పు
————————-

ఎక్కడ , ఎవరితో , ఏమి , ఎలా , ఎందుకు మాట్లాడుతున్నామో స్పృహ కలిగి ఉండడం చాలా అవసరం. రామాయణమంతా వేద సారం. మంత్రమయం. అందులో సుందరకాండ మరీ ప్రత్యేకం.

హనుమ నవ వ్యాకరణ పండితుడు . సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు . తపస్వి . సుగ్రీవుడి మంత్రి . భక్తుడు . సేవకుడు . రాయబారి . కార్యసాధకుడు . యోధుడు . పరాక్రమశాలి . అన్నిటికీ మించి వినయ సంపన్నుడు . గొప్ప వాక్కు అలంకారంగా కలిగినవాడు – వాగ్విదాం వరం – అని వాల్మీకి వేనోళ్ల పొగిడాడు.

పదినెలల అశోకవనవాసం సీతమ్మను ఎంత కుంగదీసిందంటే – హనుమ రావడం రెండు నిముషాలు ఆలస్యమయితే ఆత్మహత్య చేసుకునేది . అలాంటి సంక్షుభిత ఉద్విగ్న సమయాల్లో హనుమ మాట్లాడిన తీరు అనన్యసామాన్యం . బహుశా అలా మాట్లాడాలంటే దేవుడే దిగి రావాలి .

తెల్లవారక ముందే రావణుడు వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు . పక్కనే నరమాంస భక్షకులయిన ఆడ రాక్షసుల గుచ్చుకునే మాటలు మరో వైపు .

ఇంతదాకా సంస్కృతంలో రావణుడు అఘోరించి వెళ్ళాడు – కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ రావణుడి మాయలే అనుకుంటుంది . అనేక భాషలు తెలిసినవాడే భాష ఎంపిక గురించి ఆలోచించగలడు . సీతమ్మ సొంత ఊరు మిథిలా నగరవాసులు అయోధ్యలో మాట్లాడే ప్రాకృత(బహుశా అవధి లేదా అవధి యాసతో మరో మాండలికం) భాషలో వారి యాసతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు . అంటే సీతమ్మ మెట్టినింటి భాష నేర్చుకుంది . కానీ మిథిల యాస పోలేదు. ఒకరకంగా తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారు మనం కనిపిస్తే తమిళయాసలో తెలుగు మాట్లాడినట్లు అనుకోవచ్చు . పూర్తిగా మన ఊరివారెవరో మాట్లాడుతున్నారని మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందాలి . ఆతరువాత ఏమి చెబితే ఆమె ఇంకా నమ్ముతుంది ? శాంతిస్తుంది ? రామకథనే ఎంచుకున్నాడు . అంతే తన మాండలికంలో రామకథను వినగానే సీతమ్మకు పోయిన ప్రాణం తిరిగివచ్చింది .

క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడగమన్నాడు – అన్నాడు హనుమ . అంటే ఆమె అడగకుండానే రాముడు క్షేమంగా ఉన్నాడని , ఆయనే తనను పంపాడని విన్నవించాడు . నువ్వెక్కడున్నావో తెలిసింది ఇక వెంటనే రాముడు వస్తాడు – అని అభయమిచ్చాడు .

ఏమో నువ్వంటే రాగలిగావు కానీ , ఇంత దూరం , ఇంత దుర్భేద్యమయిన లంక – అని సీతమ్మ నిట్టూరుస్తుంది .
తల్లీ పోస్టు మ్యాన్ పనికి అందరిలోకి చిన్నవాడిని , ఏమీ చేతగానివాడిని ఎంపిక చేస్తారు . అలా నన్ను నీ దగ్గరికి పంపారు . మా సుగ్రీవుడి దగ్గర అందరూ నాకంటే గొప్పవారు , నాతో సమానులే ఉన్నారు తల్లీ – సందేహించకు అని వినయంగా వివరణ ఇచ్చాడు . ఆపై రాముడి ఉంగరమిచ్చాడు . ఆమె శిరసు మాణిక్యం తీసుకున్నాడు . మిగిలిన కథ తెలిసిందే .

మంచి మాటే అలంకారం
———————-

“కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥”

“భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్”

కేయూరాణి సంస్కృత శ్లోకం భర్తృహరి సుభాషితంలోనిది. భూషలుగావు తెలుగు పద్యం దానికి మన ఏనుగు లక్ష్మణ కవి అనువాదం.
మాట ఒక్కటే మనిషికి మంచి ఆభరణం తప్ప…భుజకీర్తులు, దండ కడియాలు, చంద్రుడి కాంతితో ప్రకాశించే ముత్యాల హారాలు, పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల మైపూతలు, పూల హారాలు, కేశాలంకారాలు, స్వర్ణాభరణాలు కావు. పైపై మెరుగుల ఈ అలంకారాలన్నీ ఒక పూటకో, ఒక రోజుకో, కొంత కాలానికో వాడిపోయేవే. కరిగిపోయేవే. వన్నె తరిగి విలువ కోల్పోయేవే. మనిషికి ఎప్పటికీ వన్నె తగ్గని ఆభరణం మంచి మాట ఒక్కటే.

నాలుగయిదు దశాబ్దాలుగా ఆకాశవాణిలో సంస్కృత అధ్యయన పాఠానికి ముందు వచ్చే సిగ్నేచర్ ట్యూన్ గా కేయూరాణి శ్లోకం లోకానికి పరిచయం.

ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధాని కావాలని వైరాగ్య పథంలో పయనిస్తూ…దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఇవన్నీ ఎవరయినా చెబితే బాగుండేది. ఆయన ఎక్కడ ఏమి మాట్లాడకూడదో కచ్చితంగా అదే మాట్లాడతారు. ఏది మాట్లాడితే సెల్ఫ్ గోల్ అవుతుందో కచ్చితంగా అదే మాట్లాడతారు. ఏది మాట్లాడితే మోడీ రొట్టె విరిగి నేతిలో పడుతుందో అదే మాట్లాడతారు. ఏది మాట్లాడితే కాంగ్రెస్ కు హిందువులు మరింత దూరమై…బి జె పి కి మరింత దగ్గరవుతారో అదే మాట్లాడతారు. సరిగ్గా ఎన్నికల కురుక్షేత్రంలో రెండు సేనలు ఎదురెదురుగా మొహరించిన వేళ శత్రువు చేతికి తనే కత్తి స్వయంగా నూరి…బాగా పదును తేలిందో లేదో పరీక్షించి…ఎదుటి వాడి చేతిలో పెట్టి వస్తారు.

ఆయన అలా అనుకుని టైమింగ్ చూసి సెల్ఫ్ గోల్ ఉద్దేశపూర్వకంగానే వేసుకుంటున్నారేమో అని ఆయన అభిమానులు తరచు జాలిపడి…ఒక నిట్టూర్పు విడుస్తూ ఉంటారు.

తాజాగా ప్రధాని మోడీని తిట్టబోయి “శక్తి”ని ప్రస్తావించారు. అది కాస్తా యావత్ మహిళా శక్తి; ఆధ్యాత్మిక కాళీ శక్తికి అన్వయమయ్యే సరికి మోడీ అందుకుని బహిరంగసభల్లో రాహుల్ ను ఉతికి ఆరేయడం మొదలుపెట్టారు.

“హిందుత్వంలో ఒక “శక్తి(కాళీమాత) ఉంది. మేము విపక్షాల ఇండియా కూటమి ఒక శక్తితో పోరాడుతున్నాము” అన్నది రాహుల్ అన్న మాట. ఇక్కడ ఆయన పోరాటం మోడీ శక్తి(పవర్) మీద అన్నది ఆయన కవి హృదయం అని తరువాత వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఇండియా కూటమి హిందుత్వానికి, హిందువులకు వ్యతిరేకం అనడానికి ఇదిగో రాహుల్ “శక్తి” ప్రసంగాలు, అధిక ప్రసంగాలే తాజా రుజువులు అన్న మోడీ మాటలు రికార్డ్ అయినట్లు…రాహుల్ వివరణలు, సంజాయిషీలు, సవరణలు రికార్డ్ కావు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

కాళీ శక్తి; మోడీ శక్తి కంటే ముందు రాహుల్ మాటల శక్తి, టైమింగ్ శక్తి గురించి చాలా తెలుసుకోవాలి. రాహుల్ మెదడులో అనుకున్నది పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరులు నాలుగు దశల్లో ఏకరూపత, స్పష్టత కోసం అభ్యంతరం లేకపోతే కాశ్మీర సరస్వతిని ధ్యానించాలి. అసందిగ్ధత లేకుండా తన మాట లక్ష్యాన్ని సాధించడానికి కావాలనుకుంటే శృంగేరి శారదను, బాసర- వర్గల్ సరస్వతులను పూజించాలి. ఇంకా మెరుగైన ఫలితాల కోసం రోజూ ఉదయాన్నే “సరస్వతీ నమస్తుభ్యం” శ్లోకాన్ని మూడు సార్లు జపించాలి. ఇవన్నీ అయ్యే పనులు కావనుకుంటే హిందుత్వ గురించి ఏమి మాట్లాడితే తను ఆత్మరక్షణలో పడి; బి జె పి కి పై చేయి అవుతోందో గ్రహించి…మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి.

సరిగ్గా ఎవరూ గమనించలేదు కానీ…ఎలెక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీం కోర్టు ఎస్ బి ఐ కాలర్ పట్టుకుని బోనులో నిలబెడితే…బి జె పి ఆత్మరక్షణలో పడాలి. ఈలోపు రాహుల్ శక్తి, అంతకు ముందు లాలూ చేసిన మోడీ కుటుంబ ప్రస్తావనలు బి జె పి కి అయాచిత వరాల్లా దొరికాయి. “దేశమంతా నా కుటుంబం” అన్న మోడీ తిరుగులేని ప్రకటనలకు ఆధారం, స్ఫూర్తి, కారణం, మూలం సర్వం ఇండియా కూటమి విమర్శలే. “నీ కుటుంబమేది?” అన్న లాలూ విమర్శను మోడీ తిరుగులేని ఆయుధంగా, ప్రచారాస్త్రంగా మలచుకున్నారు.

మోడీ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సందర్భంలో ఇలా ఆదుకోవడానికి ఇండియా కూటమి అందుబాటులో ఉండగా ఈసారి బి జె పి నాలుగు వందల మార్క్ సాధిస్తుందా అన్న సందేహం దేశప్రజలకు ఏకోశానా ఉండాల్సిన పనే లేదు!  -పమిడికాల్వ మధుసూదన్    9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions