.
Gottimukkala Kamalakar ….. #కమ్తాయి = కమ్మీలు మరియు బత్తాయిల కలిసిపోయిన భావాలను అలిసిపోయేదాకా పులిసిపోయేలా వాడుకునే వెలిసిపోయిన వాడు.
ఒక్కోసారి అందరివాడు. చాలాసార్లు ఎవరికీ చెందని వాడు. అన్నీ ఎండలకీ ఒకే గొడుగు పనికిరాదనే కనీస పరిజ్ఞానం (ఆంగ్లమున మినిమమ్ కామన్ సెన్స్ అందురు) ఉన్నవాడు.
Ads
వామపక్షీయుల దగ్గర ఏంగెల్స్ గురించి, రామ్ గోపాల్ వర్మ దగ్గర ఆంగిల్స్ గురించి, విశ్వాసుల దగ్గర ఏంజెల్స్ గురించి, మహిళామణల దగ్గర బ్యాంగిల్స్ గురించి కూలంకషంగా చర్చించగల బతకనేర్చినోడు. మేడ్చల్ ఓఆరార్ మీద ఇస్కాన్ గురించి మాట్లాడకుండా మూస్కుంటాడు. కావలసిన దానిని చూస్కుంటాడు. అవసరమైన పని చేస్కుంటాడు.
వాడు “ఒకచో నేలను పవ్వళించు మరినొకచో నొప్పారు పూసజ్జపై బాపతు కార్య సాధకుడు..!” వాడు రోజులో సింహభాగం రావణాసురుడైనా, అవసరార్ధం అలవోకగా రామచంద్రుడి ధర్మపన్నాలు వల్లె వేయగలడు. వాడు భీష్ముడి, అర్జునుడి, కృష్ణుడి, శిఖండి పాత్రలలో ఏకకాలంలో ఒదిగిపోగల కపటనాటక పాత్రధారి.
అగ్రకులస్తులూ, సమాన ఆర్ధిక స్థాయిలో గలవారితో మాత్రమే సంబంధాలూ, స్నేహాలు కలుపుకుని బీసీ, మైనారిటీ, కార్మిక, కర్షక దళిత బహుజనోద్ధరణకు పాటుపడగలడు. జూబ్లీహిల్స్ క్లబ్బులో గ్లెన్ఫిడిక్ తాగుతూ గద్దర్ పాట పాడగలడు. వాడు యుక్తవయస్సులోనే కాపిటలిస్టైన అగ్రవర్ణాంతరంగపు విఠల్ రావు. బహిరంగ గద్దర్.
ఇక్కడ ఈ సమసమాజ స్వాప్నికుడు తనకో, తన వర్గానికో, ఆశ్రితులకో విబేధిస్తూ, వాడి పర్సనల్ ఎజెండాతో రాసేవాణ్ని నిషేధించాలంటూ పచ్చిబూతులు తిడతాడు.
బ్రాహ్మణీక భావజాలం ప్రత్యామ్నాయ భావజాలాన్ని శతాబ్దాలుగా అణగదొక్కిందంటూ విమర్శిస్తూనే, తమ భావజాలాన్ని అందరి మీదా బలవంతంగా రుద్దాలనుకునే అభినవ మనువు వీడు. వ్యక్తిగత కుతిని తీర్చుకోవడం కోసం మాత్రమే సహజీవనాలను సమర్ధిస్తాడు. వీడు బర్బరీకుడిలా నటించే శల్యుడూ, శకునీ…!
వీడి మనోభావాలు వసంతంలో వాడిపోవచ్చు; శిశిరంలో శిధిలమవ్వచ్చు..! వాటికి వీడు గ్యారంటీ ఇవ్వలేడు..!
వీడు మన సమకాలీనుడు. పాళ్ల బేధంతో వీడు మనందరిలో ఉంటాడు. వీడితో మనకు సహజీవనం తప్పదు.
పోస్టానంతర టపా: ఎవడైనా కనుక్కోకపోతే కొత్త పదాలెలా పుడతాయ్..! నాకో స్వీయ వీరతాడు..
Share this Article