.
కారకులు ఎవరైనా, కారణాలు ఏమైనా సరే… రేవంత్ రెడ్డిని బలహీనపరచడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ చేజేతులా ఒక రాష్ట్రాన్ని కోల్పోయే పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటోందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది…
– రేవంత్ రెడ్డికి ఫ్రీహ్యాండ్ ఇవ్వకపోతే రానున్న కీలకమైన రెండు సంవత్సరాల్లో పార్టీ ఇంకా నష్టపోవడం ఖాయం… ఒక మంత్రిపై యాక్షన్‌కు ఇన్ని మీనమేషాలు, ఇంత తర్జనభర్జన… పైగా ఇంత జాప్యం… ఢిల్లీకి పిలిపించి ‘రాజీనామా చేసెయ్, మరో పదవి ఇస్తాం కేబినెట్ హోదాతో’ అని బుజ్జగింపులు, సంప్రదింపులు…
Ads
– ఒక చిన్నారెడ్డి, ఒక రాజగోపాలరెడ్డి, ఒక పోచారం, ఒక గుత్తా, ఒక దానం, ఒక మహిపాల్, ఒక అనిరుధ్… సురేఖపై కఠినంగా వ్యవహరించకపోతే ఈ లిస్టు ఇంకా పెరుగుతుంది… రాజగోపాలరెడ్డి అయితే నాలుగు అడుగులు ముందుకేసి నా కార్యాచరణ ఇంకా సీరియస్‌గా ఉండబోతోందంటూ హెచ్చరిక…
– ఇక రేప్పొద్దున ప్రతి ఒక్కరూ గొంతు విప్పుతారు, సీఎంను నేరుగా టార్గెట్ చేసినా మాకేమీ కాదు అనే భరోసా గనుక పార్టీ శ్రేణుల్లో ఏర్పడితే… అది మరింతగా పార్టీని బలహీనపరుస్తుంది… ఇప్పటికే సీఎం ఏం చేసినా పార్టీ అనుమతి తీసుకోవాలంటూ ఓ హైలెవల్ కమిటీ వేసి ఓ తప్పుటడుగు వేసింది ఎఐసీసీ…
– కొన్ని శాఖల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆంక్షలు పెట్టడం మరో బ్లండర్… ఇలాంటి నిర్ణయాలతో సీఎం ప్రభుత్వపరంగా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేడు… రాబోయే రెండేళ్లు చాలా కీలకం… బీఆర్ఎస్, బీజేపీ కలిసి సవాల్ చేస్తాయి కాంగ్రెస్‌ను…
– ఈ స్థితిలో రేవంత్ రెడ్డి కాళ్లల్లో అధిష్టానమే కట్టెలు పెడితే ఇక పార్టీని ఓ జోష్‌తో ముందుకు తీసుకెళ్లేది ఎలా..? పోనీ, సీఎంను మించి ఎవరైనా మాస్ లీడర్, క్రౌడ్ పుల్లర్ ఉన్నారా..? ఎవరూ లేరు… గత ఎన్నికల్లో కేసీయార్‌కు బలమైన సవాళ్లు విసిరి, నిలబడి, కేడర్‌లో విశ్వాసం కలిగించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డే… కేసీయార్ మీద జనంలో ప్రబలిన వ్యతిరేకత కూడా కలిసొచ్చింది…

– ఇప్పటికే బడ్జెట్ సహకరించకపోయినా, ఖజానా వట్టిపోయినా… కాంగ్రెస్ హామీ ఇచ్చిన అనేక బరువైన సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నాడు… ఆ పాజిటివిటీని కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో వోట్ల పంట దాకా తీసుకెళ్లాలి, అది జరగాలంటే పార్టీలో క్రమశిక్షణ, సీఎంకు ఫ్రీహ్యాండ్ కావాలి…
– నో, నో, ఇది కాంగ్రెస్ పార్టీ, అలా కుదరదు, మేమిలాగే చేస్తాం అని భీష్మించుకుంటే… నష్టం పార్టీకే… ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు… రేవంత్ రెడ్డి తన సహజమైన దూకుడు ధోరణికి భిన్నంగా సైలెంటుగా, గుంభనంగా, ఎవరి మీద ఏ కామెంట్ చేయకుండా వ్యవహరిస్తున్నాడు… ఎక్కడ స్విచ్చులు నొక్కాలో తెలిసి, బాగా తగ్గి, పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు…
– ఈ మొత్తం వార్తల నడుమ ఆసక్తికరంగా అనిపించింది మరో వార్త… రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షికి పంజాబ్ పంపించేయబోతున్నారు అని..! ఆమె వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే… ఆమెకు రాష్ట్రంలో సొంత పాపులారిటీ దేనికి..? పాదయాత్ర ఎందుకు చేసినట్టు..? ఆమె ఏం నివేదికలు పంపిస్తున్నదో ఆమెకే తెలియాలి…
చివరకు ఆమె రాజ్యసభ సభ్యత్వానికి కూడా తెలంగాణ నుంచే ఎసరు పెట్టబడింది… అదీ ఆమె సంపాదించుకున్న మంచి పేరు..!! పంజాబ్‌లో కూడా ఇన్చార్జిగా ఉండబోవడం లేదు ఆమె… పార్టీ వ్యవహారాల్ని చూసే తాత్కాలిక త్రీమెన్ కమిటీలో ఒక మెంబర్ అట… ఐతే పంజాబ్ నేతలు తెలంగాణ నేతల్లాగా సాఫ్ట్ కాదు..!
సో, కొంత పెయిన్ ఉన్నా సరే… ఏతా వాతా జరిగేవన్నీ అంతిమంగా రేవంత్ రెడ్డికి ఒకరకంగా పాజిటివ్‌గా మారతాయనే కేడర్ ఆశలకు ఇదొక సంకేతం కావచ్చు బహుశా !! అవి రాబోయే మంత్రివర్గ విస్తరణలో మరింత బలంగా ప్రదర్శితం కావచ్చు కూడా..!!
Share this Article