.
( రమణ కొంటికర్ల 99126 99960 ) …. బయోవెపన్ లీక్ అయిందా? అధికారుల ప్రకటనలతోనైనా.. మిస్టరీ ఎందుకు వీడటం లేదు..? స్పష్టత ఎందుకు కొరవడింది..? మరో కరోనా కథేనా..?
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న ఓ ప్లేగూ పరిశోధనా కేంద్రానికి చెందిన యువ ల్యాబొరేటరీ ఉద్యోగి అనుమానాస్పదంగా న్యుమోనియాతో మరణించడం కలకలం రేపింది. ఆమె పనిచేసిన సంస్థలో ప్లేగూతో పాటు ఇతర ప్రమాదకరమైన అంటువ్యాధులపై పరిశోధనలు జరుగుతుండటంతో.. ఇప్పటికే కరోనా వైరస్ కాలాన్ని మర్చిపోలేకపోతున్న ప్రపంచానికి… తాజా ఘటనపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
Ads
అసలు ఆమెకు ప్లేగూ సోకిందా? ల్యాబోరేటరీలో ఏదైనా ప్రమాదం జరిగిందా? ఏదైనా బయోవెపన్ లీక్ అయిందా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చగా మారాయి. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధారాలు మాత్రం బయోవెపన్ లీకైనట్టుగా నిర్ధారించడం లేదు. కానీ, సందేహాలకు మాత్రం ఆస్కారం పెరుగుతోంది.
28 ఏళ్ల ల్యాబ్ ఉద్యోగి మృతి!
దర్యా షిపిలోవా అనే 28 ఏళ్ల మహిళ ఇర్కుట్స్క్‌లోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైబీరియా అండ్ ద ఫార్ ఈస్ట్ లో పనిచేస్తున్నారు. అక్టోబర్ 2న ఆమె తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమెకు వచ్చిన వ్యాధిని అధికారులు మొదట తెలియని కారణంతో వచ్చిన న్యుమోనియాగా పేర్కొన్నారు. అయితే ఆమె పనిచేసిన సంస్థ ప్లేగ్ వంటి ప్రమాదకరమైన వ్యాధి కారకాలను అధ్యయనం చేస్తుందన్న విషయం బయటకు రావడంతో అనుమానాలకు ఆస్కారమేర్పడింది.
పైగా ఆమె మరణించిన ఆసుపత్రిని ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్ చేయడం.. ఆమెతో సన్నిహితంగా ఉన్న దాదాపు 200 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం ఆ అనుమానాలకు బలం చేకూర్చింది.
ప్లేగ్ సోకిందా?
ఇప్పటివరకు కూడా ఆమె ప్లేగూతోనే మరణించిందని అధికారికంగా ఎక్కడా నిర్ధారణ కాలేదు. రష్యా ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ Rospotrebnadzor మాత్రం ఆమెకు తెలియని కారణంతో వచ్చిన న్యుమోనియా అని చెబుతోంది. ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించామని, ప్రమాదకరమైన వ్యాధికారకాలు ఎవరిలోనూ గుర్తించలేదని అధికారులు వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు రష్యా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇర్కుట్స్క్ నగరంలో ఇప్పటివరకు ప్లేగూ కేసు నమోదైనట్లు ఆధారాలు లేవు. WHO కూడా ఈ ఘటనపై రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
మరి ల్యాబ్ లీక్ కథేంటి..?
ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ల్యాబ్‌లో లైవ్ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పడిపోయిందని, దాంతో దర్యా షిపిలోవాకు ఇన్ఫెక్షన్ సోకిందని ఒక వాదన ప్రచారం జరిగింది. మరికొందరు ఆమె థాయ్‌లాండ్‌కు వెళ్లిన తర్వాత అనారోగ్యానికి గురైందని, ఇంకొందరు మంగోలియా సరిహద్దు ప్రాంతానికి వెళ్లిన తర్వాత అనారోగ్యానికి గురైందని చెప్పడంతో భిన్నరకాల కథనాలు ప్రచారంలోకొస్తున్నాయి.
గతంలో చైనా కూడా కరోనా సమయంలో ఇదే విధంగా అబ్బే ఏమీ లేదని చెప్పడం.. ప్రస్తుతం రష్యా ఆరోగ్య అధికారుల వాదనా అలాగే ఉండటంతో అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి.

ప్లేగ్ అంటే ఏమిటి..?
ప్లేగూకు కారణమయ్యే బ్యాక్టీరియా పేరు ఎర్సినియా పెస్టిస్. ఇది ప్రధానంగా చిన్న అడవి జంతువులు, వాటిపై వాలే ఈగల్లో కనిపిస్తుంది. మనుషులకు సాధారణంగా సోకిన ఈగ కాటు ద్వారా వ్యాధి వస్తుంది. ప్లేగ్లోని న్యుమోనిక్ ప్లేగూ అనే రూపం ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఇది శ్వాసకోశ బిందువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. ప్లేగూకు చికిత్స అందుబాటులో ఉంది. ముఖ్యంగా వ్యాధిని తొలిదశలో గుర్తించి యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తే కోలుకునే అవకాశాలూ ఉంటాయి.
బ్లాక్ డెత్ గుర్తుకొస్తోందా..?
ప్లేగూ పేరు వినగానే చరిత్రలోని బ్లాక్ డెత్ గుర్తుకు వస్తుంది. 14వ శతాబ్దంలో యూరప్‌ను వణికించిన ఆ మహమ్మారి.. కోట్లాది మంది ప్రాణాలను బలిగొంది. అయితే నేటి పరిస్థితి అప్పటితో పోల్చదగినది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక వైద్యం, యాంటీబయాటిక్స్, మెరుగైన పారిశుధ్యం, వ్యాధి నిర్ధారణ వ్యవస్థల కారణంగా ప్లేగ్‌ను నియంత్రించే సామర్థ్యం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందన్నది వైద్య నిపుణుల వాదన.
డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రస్తుత రష్యా ఘటన వల్ల రష్యా వెలుపల ప్రమాదం తక్కువ స్థాయిలోనే ఉందని పేర్కొంది.
మరి అమెరికాకు ఎందుకు ఆందోళన..?
ఈ ఘటనపై అమెరికా కూడా దృష్టి పెట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు అవసరమైతే సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం.. రష్యా మరింత సమాచారం ప్రపంచంతో పంచుకోవాలని కోరారు. అక్కడ పెద్ద సమస్య ఏమీ లేకపోవచ్చు. కానీ మనకు పూర్తిగా తెలియని పరిస్థితి కూడా కావచ్చు అన్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంటే రష్యాలో ఏదో తెలియంది జరుగుతోందన్నది అమెరికా అనుమానం.
మరి అసలు మిస్టరీ ఏంటి అన్నది తేలాల్సి ఉంది! ఉక్రెయిన్ మీద ప్రయోగించడానికి ఏమైనా బయోవెపన్ రెడీ చేసే క్రమంలో జరిగిన పొరపాటా..?
Share this Article