.
చాన్నాళ్ల క్రితం దర్శకుడు మహా వెంకటేష్ ‘కేరాఫ్ కంచపాలెం’ సినిమా తీశాడు… డిఫరెంటుగా ఉంది, బాగుంది అని ప్రేక్షకలోకం ఎవరబ్బా ఈ వెంకటేషు అని ఆసక్తిగా చూసింది… తెలివైనవాడు, సినిమా మీద ప్రేమ ఉన్నవాడు, ప్రయోగాాలు, లోతైన సబ్జెక్టుల మీద అవగాహన ఉన్నవాడు… కానీ వచ్చే చిక్కు ఏమిటంటే… ప్రేక్షకుడిని ఓ మలయాళ దర్శకుడిలాగా తన ఆలోచనధోరణిలోకి లాక్కురాలేడు… ఈరోజురిలీజైన రావు బహదూర్ సినిమా కూడా అంతే…
హీరో సత్యదేవ్… మంచి మెరిట్ ఉన్న నటుడు… సరైన పాత్ర పడాలేగానీ దున్నేయగలడు… నిజంగానే తన నటనకు జనం చప్పట్లు కొట్టే సక్సెస్‌ఫుల్ పాత్ర ఈరోజుకూ తనకు రాలేదు… ఈ కథేమో ఎవరికీ అర్థం కాదు… ఇదొక మానసిక వైకల్యం బాపతు కథ… సోది, రొటీన్, ఫార్ములా సినిమాలతో చెడిపోయిన తెలుగు ప్రేక్షకుల బుర్రలకు ఎలా ఎక్కాలి..? అదే జరగలేదు…
Ads
మరి దీన్ని మహేశ్‌బాబు, నమ్రత ఎలా అంగీకరించారు..? అదే పెద్ద ప్రశ్న… సాధారణంగా మహేశ్ బాబు కమర్షియల్ కోణంలో ఆలోచించాలి… నమ్రత మరీ కమర్షియల్… మరెలా మహా వెంకటేశ్ కథకు వోకే చెప్పి డబ్బులు పెట్టారు..? వాళ్లది కూడా ఈ సినిమాలో కథానాయకుడిలాగా స్ప్లిట్ పర్సనాలిటీయేనా ఫాఫం..!!
మనకు రీల్స్‌లో, సోషల్ పోస్టుల్లో పదే పదే గుర్తొచ్చే ఓ సెటైర్… ‘ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి’ అని… ఈ రావు బహదూర్ అర్థం కావాలంటే డిగ్రీలు కాదు, పీహెచ్డీలు కావాలి… మాస్టర్స్ కావాలి… కరుకుగా, కటువుగా, పరుషంగా ఉన్నా నిజం మాత్రం ఇదే… సినిమా మధ్యలోనే కొందరు ప్రేక్షకులు థియేటర్ వదిలి వెళ్లిపోయారు అంటేనే, దీని భవిష్యత్తు ఏమిటో అర్థమవుతోంది… ఇదీ దాని సమీక్ష…

‘రావు బహదూర్’ – అంతుచిక్కని అగమ్యగోచరం!
కథాంశం: ఈ సినిమా కథంతా ‘రామప్ప’ (సత్యదేవ్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. రామప్ప 8 ఏళ్లుగా తన రాజభవనంలోని ఒక గదికే పరిమితమై ఉంటాడు. అతని భార్య రేణుక (దీపా థామస్) మరో గదిలో ఉంటుంది. అసలు రామప్ప ఎందుకు బయటకు రాడు? ఎందుకు భార్యకు దూరంగా ఉంటాడు?
అంటే.. తన కొడుకు కుసుమప్ప కొలనులో పడి చనిపోయాడన్న బాధ ఒకటి, రెండోది తన కొడుకు తన సొంత బిడ్డ కాదేమోనన్న ‘అనుమానం’ అనే పెనుభూతం. ఈ అనుమానం తీరే వరకు తన ఆత్మ శాంతించదని, మృత్యువు దగ్గరకొచ్చినా వెనక్కి వచ్చేస్తానని ఆచారి (వైద్యుడు/స్నేహితుడు)తో చెబుతుంటాడు. ఆ రామప్ప అనుమానం తీరిందా? అసలు ఆ గతం ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథ.
విశ్లేషణ – ఎలా ఉందంటే:
వెంకటేష్ మహా ఒక సింపుల్ పాయింట్‌ను తీసుకుని, దానిని మరీ లోతుల్లోకి తీసుకెళ్లి గందరగోళానికి గురిచేశారు. మెరిసేదంతా బంగారం కాదు, వ్యక్తులను నలుపు- తెలుపుగా చూడకూడదు అనే మంచి సందేశాన్ని చెప్పాలని అనుకున్నారు. కానీ, ఆ ప్రయత్నంలో కథనానికి (Screenplay) మించిన మేధస్సును జోడించడం వల్ల, సామాన్య ప్రేక్షకుడికి అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడమే ఒక పెద్ద ప్రహసనంగా మారుతుంది.
ఫస్ట్ హాఫ్: రామప్ప ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, ఏమవుతోంది అని అర్థం కాక ప్రేక్షకులకు చిరాకు వచ్చే అవకాశం ఉంది. ఫ్లాష్‌బ్యాక్, వర్తమానం అంటూ సీన్లు మారుతుంటే కొంత ఆసక్తి ఉన్నా, మొత్తంగా చూస్తే గందరగోళంగానే సాగుతుంది.
సెకండ్ హాఫ్: ఇక్కడైనా కథ వేగవంతం అవుతుందనుకుంటే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలయ్యే వరకు అలాగే ఉంటుంది. కానీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి. ఆ చివరి పది నిమిషాలు చూశాక, అప్పటి వరకు ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డామా అని అనిపించక మానదు.
నటీనటుల పనితీరు: ఈ సినిమాకు అసలైన బలం సత్యదేవ్. ఆయనది వన్ మెన్ షో అని చెప్పొచ్చు. గెటప్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వేరియేషన్ చూపిస్తూ సినిమాను తన భుజాలపై మోశాడు. ఇక రేణుక పాత్రలో దీపా థామస్ ఉన్నంతలో ఓకే. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేరకు నటించాయి.
ఒకే లోకేషన్ (రాజభవనం)లో తీసినా, చాలా కొత్తగా చూపించారు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. నేపథ్య సంగీతం బాగుంది. కానీ మధ్య మధ్యలో వచ్చే పాటలు కథను డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా ఓకే.
ముచ్చట తుది మాట (Verdict): వెంకటేష్ మహా ఒక వినూత్న ప్రయోగానికి ప్రయత్నించాడు. భ్రమలు, భయాలు, అనుమానాల చుట్టూ అల్లిన ఈ కథ, ఒక పీహెచ్‌డీ స్థాయి మేధస్సును డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఓపిక ఉన్న ప్రేక్షకులైతే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టుల కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. కానీ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించే ప్రేక్షకులకు మాత్రం ఇది చాలా కష్టమైన సినిమా…
Share this Article