Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!

September 3, 2026 by M S R

.

జాతిరత్నాలు అనే సినిమాలో హీరో పాత్ర కోర్టులో చెబుతుంటుంది… ‘‘నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి యువరానర్’’ అని… గూస్ బంప్స్‌కు ఓ పేరడీ సెటైర్… దీన్ని తెలుగులో చెప్పాలంటే రోమాంచితం… అంటే, రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని… తీవ్ర భావోద్వేగాల్లో మన శరీరం ప్రదర్శించే ఫీల్ అది… స్కిన్ మీద రోమాలు నిక్కబొడుచుకోవడం…

మరి ది గ్రేట్ వంగ సందీప్ రెడ్డి అనే సినీమేధావికి రోమాంచకం అనే తెలుగు పదం ఎక్కడ దొరికిందో తెలియదు, కథ, టేకింగ్ గట్రా అన్నీ తేడానే కదా, ఇదీ అంతే… ఈ సినిమాకు తనే నిర్మాత అట… అదొక్కటి తప్ప ఈ సినిమాకు వేరే హుక్ పాయింట్ లేదు… అటూఇటూ కాని కథాకథనాలతో ఒక్కటంటే ఒక్క రోమమూ నిక్కబొడుచుకోదు సరికదా, మత్తుగా నిద్దరబోతాయి…

Ads



‘రోమాంచకం’… పేరుతోనే మొదలైన గందరగోళం! ప్రేమ లేదూ… రోమాంచం లేదూ… వంగా పేరు మాత్రం ఉంది!

ఒక సినిమా చిన్నదే కావచ్చు. కొత్తవాళ్లతో తీసిందే కావచ్చు. పెద్ద హీరోలు లేకపోవచ్చు. కానీ కథకు ఒక లాజిక్, పాత్రలకు ఒక ప్రవర్తనా తీరు, ప్రేమకథ అయితే ప్రేమకు ఒక బలమైన కారణం ఉండాలి. అవి లేకపోతే సినిమా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపించినా చివరికి ప్రేక్షకుడికి మిగిలేది ఒక్కటే… ‘ఇదంతా ఎందుకు చూశాం?’ అనే ప్రశ్న. ‘రోమాంచికం’ విషయంలో అదే సమస్య.

ఈ సినిమాకు నిర్మాతగా సందీప్ రెడ్డి వంగా పేరు వినిపించడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాల వెనుక ఉన్న వ్యక్తి ఓ చిన్న ప్రేమకథను నిర్మిస్తున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉంటుందని అనుకోవడం సహజం. అందుకు తగ్గట్టే విజయ్ దేవరకొండ, ప్రభాస్‌లను తీసుకొచ్చి ప్రమోషన్స్ కూడా చేశారు. ( వంగా వారి ఆస్థాన విద్వాంసులు, నిలయ కథానాయకులు కదా)… కానీ సినిమా చూస్తే మాత్రం… వంగా సినిమాలకు పది ఆమడల దూరంలో నిలబడి, ‘అది వేరే విషయం… ఇది జెన్ జీ లవ్ స్టోరీ’ అన్నట్టుగా ఉంది.

అసలు జెన్ జీ అంటే డేటింగ్ యాప్స్, ఫోన్ కాల్స్, పార్టీలు, రిలేషన్‌షిప్ కన్ఫ్యూజన్ మాత్రమేనా? జెన్ జీ జీవితంలో ప్రేమ, కెరీర్, కమిట్‌మెంట్, సోషల్ మీడియా ప్రభావం, భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు లాంటివి ఉండవా? ఇక్కడ మాత్రం డేటింగ్ యాప్‌లో అబ్బాయి, అమ్మాయి పరిచయం అవ్వడం, ఫోన్లలో మాట్లాడుకోవడం చూపిస్తే చాలు… అదే జెన్ జీ లవ్ స్టోరీ అయిపోయిందన్నట్టుగా ఉంది.

కథలోకి వస్తే అన్వేష్ డేటింగ్ యాప్ స్టార్టప్ పెట్టాలని ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయత్నిస్తుంటాడు. అమ్మాయిలను అర్థం చేసుకోవడం కోసం మరో డేటింగ్ యాప్‌లో మైథిలిని పరిచయం చేసుకుంటాడు. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ స్నేహితులవుతారు. క్రమంగా దగ్గరవుతారు. మైథిలి పుట్టినరోజున ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వడానికి చెన్నై వెళ్తాడు. హోటల్ దగ్గరకు రమ్మని చెప్పగానే మైథిలి అతడిని బ్లాక్ చేసేస్తుంది. ఇక్కడ నిజంగానే ఆసక్తి మొదలవుతుంది. అసలు ఎందుకు బ్లాక్ చేసింది? వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? అనే ప్రశ్నలు వస్తాయి.

కానీ ఆ ప్రశ్నను పట్టుకుని కథ ముందుకు వెళ్లదు. కొంతమంది ఫ్రెండ్స్, పార్టీలు, పాటలు అంటూ సినిమా మళ్లీ అటూ ఇటూ తిరుగుతుంది. తర్వాత సడన్‌గా మైథిలి హైదరాబాద్ వస్తున్నానని హీరోకి ఫోన్ చేస్తుంది. రెండు రోజులు అతనితో ఉంటానంటుంది. హీరో ఆమెను ఫ్రెండ్ మామ ఫ్లాట్‌కి తీసుకెళ్తాడు. హీరో బయటకు వెళ్లొచ్చేసరికి ఆమె అక్కడ ఉండదు. అక్కడి నుంచి ఆమె కోసం వెతకడం మొదలవుతుంది. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఆసక్తి పెరుగుతుంది. అసలు మైథిలి ఏమైంది? ఎందుకు వచ్చింది? ఎందుకు వెళ్లిపోయింది? అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది.

ఇక్కడి వరకు బాగానే ఉంది. అసలు సమస్య మాత్రం హీరో, హీరోయిన్ మధ్య ప్రేమలో ఉంది. ఇది ప్రేమకథ అని సినిమా చెబుతోంది కానీ ప్రేక్షకుడికి మాత్రం వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారనే భావన ఎక్కడా కలగదు. ఫోన్‌లో మాట్లాడుకున్నారు. స్నేహం పెరిగింది. దగ్గరయ్యారు. అంతే. ప్రేమ ఎప్పుడు పుట్టింది? ఎవరు ఎవరికి చెప్పారు? హీరో ఎందుకు ఆమె కోసం ఇంతలా తల్లడిల్లుతున్నాడు? హీరోయిన్‌కి హీరో మీద నిజంగా ఎలాంటి భావన ఉంది? ఈ ప్రశ్నలకు సినిమా సరైన సమాధానం ఇవ్వదు.

ముఖ్యంగా మైథిలి పాత్ర రాసిన విధానం మరింత గందరగోళంగా ఉంది. హీరో చెన్నైకి వస్తే బ్లాక్ చేస్తుంది. తర్వాత తానే హైదరాబాద్ వస్తుంది. రెండు రోజులు ఉంటానంటుంది. మళ్లీ వెళ్లిపోతుంది. ఎందుకు వెళ్లిపోయిందో ఒక కారణం చెబుతుంది. కానీ ఆ కారణం కూడా పూర్తిగా కన్విన్స్ అయ్యేలా ఉండదు. హీరోతో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వదు. చివరికి హీరోనే తనను అర్థం చేసుకోలేదని అంటుంది. కానీ ఆమెను అర్థం చేసుకునే అవకాశం హీరోకి ఎక్కడ ఇచ్చారన్నదే అసలు ప్రశ్న.

పాత్ర రహస్యంగా ఉండటం వేరు. పాత్ర గందరగోళంగా ఉండటం వేరు. ఇక్కడ హీరోయిన్ పాత్ర గందరగోళంగా మారింది. ఆమె ఎక్కడా హీరోని ప్రేమిస్తున్నట్టు చెప్పదు. హీరోపై తనకున్న భావనను స్పష్టంగా వ్యక్తం చేయదు. అయినా చివర్లో ప్రేమను అర్థం చేసుకోవడం గురించి పెద్ద డైలాగులు వస్తాయి. సినిమా పేరులో ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’ అని పెట్టారు. హాస్యం ఉంది. ఉత్కంఠను క్రియేట్ చేసే ప్రయత్నం ఉంది. కానీ ప్రేమ మాత్రం మిస్సింగ్.

హీరోయిన్ చేసే తప్పులన్నీ ప్రేక్షకుడికి కనిపిస్తాయి. హీరోని చెన్నైకి పిలిచి బ్లాక్ చేయడం, హైదరాబాద్ వచ్చి మళ్లీ వెళ్లిపోవడం, హీరో మాట వినకపోవడం… ఇవన్నీ ఆమె పాత్రలోనే జరుగుతాయి. అయినా చివరికి హీరోనే వెళ్లి ఆమెను బతిమాలుకోవాలి. ఇది కథలోని భావోద్వేగ సమతుల్యతను దెబ్బతీసింది. ప్రేమకథలో ఇద్దరి మధ్య సంఘర్షణ ఉండొచ్చు. అపార్థాలు ఉండొచ్చు. కానీ ప్రేక్షకుడు కనీసం ఎవరి బాధ ఏంటో అర్థం చేసుకునేలా పాత్రలను రాయాలి.

సెకండ్ హాఫ్‌లో హీరో, అతని ఫ్రెండ్స్ మైథిలి కోసం వెతకడం, ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నాలు, మధ్యలో ఫ్రెండ్స్ చేసే కామెడీతో సినిమా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు నవ్వించే విఫల ప్రయత్నం చేస్తాయి. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ ‘అసలు ఈ వెతుకులాట వెనుక ఉన్న ఎమోషన్ ఏంటి?’ అనే ప్రశ్న కూడా వస్తుంది. మధ్యలో ఉపేంద్ర లిమయే పోలీస్ పాత్రతో కామెడీ చేయడానికి ప్రయత్నించినా అంతగా పండలేదు. క్లైమాక్స్ మాత్రం మళ్లీ నవ్వించే ప్రయత్నం చేస్తుంది. చివర్లో వచ్చే ట్విస్ట్‌ను కూడా పెద్దగా కష్టపడకుండా ఊహించేయొచ్చు.

సినిమాలో మధ్య మధ్యలో మహిళల కష్టాలు, మహిళలపై సమాజం పెట్టే పరిమితుల గురించి కొన్ని డైలాగులు వస్తాయి. అవి చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ కథతో వాటికి సంబంధం ఏమిటన్నదే అర్థం కాదు. ఒక సన్నివేశంలో కథకు అవసరం లేకుండా ఒక సామాజిక సందేశం చెప్పడం వల్ల ఆ సన్నివేశం బలపడదు. పైగా ప్రేక్షకుడికి సినిమా అసలు ఏం చెప్పాలనుకుంటుందో మరింత కన్ఫ్యూజన్ వస్తుంది.

‘ప్రీ వెడ్డింగ్ షూట్’లో మెప్పించిన నాగేంద్ర ఈ సినిమాలో కూడా తన టైమింగ్‌తో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. హీరోతో ఫ్రెండ్స్ సీన్స్, ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం నవ్విస్తుంది.  దర్శకుడు అనుదీప్ గెస్ట్ పాత్రలో కనిపించి మరోసారి నవ్వించడానికి చాలా కష్టపడ్డాడు పాపం.

సుమంత్ ప్రభాస్, అనంతిక జంట మాత్రం చాలా ఫ్రెష్‌గా, క్యూట్‌గా కనిపించింది. జెన్ జీ పాత్రలకు ఇద్దరూ బాగా సెట్ అయ్యారు. అనంతిక సినిమా అంతా క్యూట్‌గా కనిపిస్తూ అమాయకమైన మైథిలి పాత్రలో ఆకట్టుకుంది. సమస్య నటనలో కాదు… ఆ పాత్రలను రాసిన విధానంలోనే ఉంది.

దర్శకుడు అనుదీప్ కథలో కొత్తదనం కంటే కామెడీ, సస్పెన్స్ కలిపి సినిమాను నడిపించాలనుకున్నాడు. కొన్ని చోట్ల ఆ ప్రయత్నం పనిచేసింది. కానీ కథలోని ప్రాథమిక లోపాలను మాత్రం ఆ కామెడీ పూర్తిగా కప్పిపుచ్చలేకపోయింది.

ఇది మంచి లవ్ స్టోరీ అని చెప్పడం కష్టం. ఎందుకంటే సినిమా చెప్పే ప్రేమను ప్రేక్షకుడు అనుభవించడు. జెన్ జీ కథ అని చెప్పుకోవడానికి డేటింగ్ యాప్ తప్ప మరే కొత్తదనం కనిపించదు. కథ, పాత్రలు, సంఘటనల మధ్య లాజిక్‌ను ఎక్కువగా వెతికితే నిరాశే మిగులుతుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!
  • యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !
  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !
  • బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…
  • ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు..!
  • మెలితిరిగిన మీసాల తెలుగు ముఖ్యమంత్రి… ఓ సరదా కథనం…
  • జితేంద్ర మిశ్రా ! ‘ఆపరేషన్ సిందూర్’ లీడర్‌‌కు ఇక ‘ఆపరేషన్ అయోధ్య’…
  • Dear You – రూపాయి పెడితే 150 రూపాయలు – గ్లేసియర్ బ్రేక్ బస్టర్ !!
  • ఇది మునుపటి ఇండియా కాదు ! రెండు బలమైన తాజా తార్కాణాలు !!
  • నెహ్రూకు ఓ ఆదివాసీ భార్య… ఆమెది కలిచివేసే ఓ విషాద కథ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions